Telugu Global
Family

వర్తమానం

ఒక పున్నమి రాత్రి నేను మిత్రుల్తో కలిసి ఒక పడవలో ఒక సరోవరం మధ్యలోకి వెళ్లాం. అప్పుడు అర్థరాత్రి కావస్తోంది. అంతా నిశ్శబ్ధంగా, నిర్మలంగా వుంది. పడవని సరస్సు మధ్యలో ఆపేశాం. ఆరబోసిన వెన్నెల్ని చూస్తూవుంటే అది మనోహర స్వప్నంలా వుంది. నిశ్చల సరోవరంలో ప్రతిఫలించే నిండు చంద్రుడు మాతో మాట్లాడుతున్నట్లున్నాడు. నేను ఆకాశంలోని చంద్రుణ్ణి, సరోవరంలోని ప్రతిఫలించే చంద్రుణ్ణి చూస్తున్నాను. కానీ నా మిత్రులకు అదేమీ పట్టలేదు. వాళ్లు ఏవో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల జీవితంలోని ఆదాయ […]

ఒక పున్నమి రాత్రి నేను మిత్రుల్తో కలిసి ఒక పడవలో ఒక సరోవరం మధ్యలోకి వెళ్లాం. అప్పుడు అర్థరాత్రి కావస్తోంది. అంతా నిశ్శబ్ధంగా, నిర్మలంగా వుంది. పడవని సరస్సు మధ్యలో ఆపేశాం. ఆరబోసిన వెన్నెల్ని చూస్తూవుంటే అది మనోహర స్వప్నంలా వుంది. నిశ్చల సరోవరంలో ప్రతిఫలించే నిండు చంద్రుడు మాతో మాట్లాడుతున్నట్లున్నాడు. నేను ఆకాశంలోని చంద్రుణ్ణి, సరోవరంలోని ప్రతిఫలించే చంద్రుణ్ణి చూస్తున్నాను.

కానీ నా మిత్రులకు అదేమీ పట్టలేదు. వాళ్లు ఏవో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల జీవితంలోని ఆదాయ వ్యయాల గురించి, సమస్యల గురించి ప్రణాళికల గురించి చర్చించుకుంటూ చుట్టూ వున్నది ఏమీ పట్టనట్లు ఉన్నారు. అది నిండు పున్నమి రాత్రి. పిండారబోసినట్లు లోకమంతా వెన్నెల వ్యాపించిన రాత్రి. ప్రకృతి అపూర్వ సౌందర్యాన్ని అలంకరించుకున్న రాత్రి. ఆ సరోవరం కేసి ఆకాశం కేసి వాళ్లు కనీసం చూడ్డమయినా లేదు. గడిచిపోయిన విషయాల్ని గురించో, రాబోయే సంగతుల గురించో మాట్లాడు కుంటున్నారు. అంతమందిలో నేను ఒంటరిగా వున్నాను. కానీ ఒంటర్ని కాను. ప్రకృతి నాకు తోడువుంది. ప్రకృతి ఆస్వాదనలో పరవశించిపోతున్నాను. ఇంతలో మిత్రుల సంభాషణ దేవుడిపైకి మళ్లింది. దేవుడి గురించి చర్చ చేయని మనిషి వుండడు. ఆయన నోరు లేనివాడు కదా! అందరి కాలక్షేపానికి పనికి వస్తాడు. మిత్రుల్లో కొందరు దేవుడు వున్నాడన్నారు. మరికొందరు దేవుడు లేడన్నారు. చర్చ కొనసాగింది.

ఎప్పటికీ తెగని, తేలని తెమలని చర్చల్లో అది ఒకటి. అందరూ మౌనంగా వున్న నాకేసి తిరిగారు. ”ఎక్కడో ఏదో లోకంలో వున్నట్లున్నావు. మాకు సమాధానం చెప్పు. దేవుడున్నాడా? లేడా?” అని అడిగారు. వాళ్ల ప్రశ్న గురించి ఆలోచించాను. వాళ్లకు ఎట్లాంటి సమాధానమివ్వాలా? అని ఆలోచనలో పడ్డాను. వాళ్లకు ఏం చెప్పాలి?

ఎవరయితే వర్తమానంలో జీవిస్తారో వాళ్లకు మాత్రమే దేవుడితో సాన్నిహిత్యం ఉంటుంది. వాళ్లు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. గతంలో భవిష్యత్తులో జీవించే వాళ్లకు దేవుడి గురించి తెలీదు. తెలుసుకోలేరు. వాళ్లని చూసి ”మీకో సంఘటన చెబుతాను. ఒక ఆఫీసులో వుద్యోగాల కోసం యింటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లందరికీ నెంబర్లిచ్చారు.

అందరూ హాల్లో వున్నారు. అందరూ వుద్యోగం లోని లాభనష్టాల గురించి, యితర

ఉద్యోగాల గురించి యింకా ఎన్నెన్నో విషయాల గురించి తీవ్రంగా చర్చించుకుంటూ వున్నారు. వాళ్ల నెంబర్లని మైకులో అనౌన్సు చేసిన విషయం కూడా వాళ్లు గుర్తించలేదు. యివేవీ పట్టని వ్యక్తి తన నెంబర్‌ వస్తూనే వెళ్లి సెలెక్ట్‌ ఐ అప్పాయింట్‌మెంట్‌ ఆర్డరు పట్టుకుని బయటకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు” అన్నాను.

నా మిత్రులు ”మేము దేవుణ్ణి గురించి అడిగితే నువ్వు యిదంతా ఎందుకు చెప్పావు?” అన్నారు. నేను ”ఇక్కడ సరోవరం వుంది. ఆకాశంలో పండు వెన్నెల విరగబూస్తోంది. మనం పడవలో వున్నాం. అంతా ప్రశాంతంగా, ఆహ్లాదంగా, మనోహరంగా వుంది. మీరేమో వీటితో సంబంధం లేకుండా ఏవో పనికిమాలిన విషయల్లోపడి కొట్టుకుపోతున్నారు.

ఈ సరోవరంలో దేవుడున్నాడు. ఆ నిండు చంద్రుడిలో దేవుడున్నాడు. ఈ నిర్మలత్వంలో దేవుడున్నాడు. దేవుడు మీతో మాట్లాడడానికి మిమ్మల్ని తాకుతున్నాడు. మిమ్మల్ని పిలుస్తున్నాడు. యిప్పుడు యిక్కడ ఈ క్షణం దేవుడున్నాడు. మీరేమో నిన్న గురించి, రేపు గురించి, దేవుడి గురించి చర్చించుకుంటున్నారు. వర్తమానంలో దేవుడున్నాడు. మీరేమో గతంలో, భవిష్యత్తులో జీవిస్తున్నారు. భగవంతుని సందేశం, పిలుపు ప్రతిక్షణంలో ప్రతిధ్వనిస్తుంది. ప్రకృతి పులకరింతలో వుండి, వినేవాళ్లకు అది వినిపిస్తుంది” అన్నాను.

మిత్రులు మౌనంగా వుండిపోయారు.

-సౌభాగ్య

First Published:  6 April 2016 1:01 PM GMT
Next Story