Telugu Global
Family

ఖానాజీ ఠాకూర్‌

ఖానాజీ ఠాకూర్‌ ఆ గ్రామానికి రాజులాంటివాడు. అతని మాటకు తిరుగులేదు. కానీ ధర్మాత్ముడు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించి స్వహస్తాలతో పూలుకోసి, పళ్ళు సిద్ధంచేసి ప్రతిరోజు గంటసేపు శివుణ్ణి ఆరాధించి విభూతి ధరించి వస్తాడు. అట్లా ఎన్నో సంవత్సరాలుగా శివుణ్ణి ఆరాధించేవాడు ఆయన భార్య ‘ఏమండీ యిన్నేళ్ళుగా మీరు శివుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ శివుడు మీకు ఏమైనా చేశారా? మీరు ఈ గ్రామానికి రాజు లాంటివారు. కానీ మీరే లేచి స్వయంగా పూలుకోయడం వంటి పనులన్నీ […]

ఖానాజీ ఠాకూర్‌ ఆ గ్రామానికి రాజులాంటివాడు. అతని మాటకు తిరుగులేదు. కానీ ధర్మాత్ముడు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించి స్వహస్తాలతో పూలుకోసి, పళ్ళు సిద్ధంచేసి ప్రతిరోజు గంటసేపు శివుణ్ణి ఆరాధించి విభూతి ధరించి వస్తాడు.

అట్లా ఎన్నో సంవత్సరాలుగా శివుణ్ణి ఆరాధించేవాడు ఆయన భార్య ‘ఏమండీ యిన్నేళ్ళుగా మీరు శివుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ శివుడు మీకు ఏమైనా చేశారా? మీరు ఈ గ్రామానికి రాజు లాంటివారు. కానీ మీరే లేచి స్వయంగా పూలుకోయడం వంటి పనులన్నీ చేస్తారు. ఏమి ప్రయోజనం?’ అంది.

ఠాకూర్‌ ‘చూడు నేను శివుణ్ని ప్రార్థిస్తున్నది ఏదో ఆశించి కాదు ఆరాధనా భావంతో. నేను స్వయంగా పూజకు సంబంధించిన విధులు ఎందుకు చేస్తానంటే ఆత్మ సంతృప్తికోసం. నేను తింటే నీ కడుపు నిండుతుందా?’ అని అడిగాడు.

ఆ రాత్రి ఠాకూర్‌ కలలో శివుడు దర్శనమిచ్చి మూడవరోజు నీకు ప్రత్యక్షంగా కనిసిస్తానన్నాడు.

మూడవరోజు శివాలయానికి వెళ్ళి పూజాదికాలు నిర్వర్తించి ధ్యానంలో కూర్చుని తేలిక పడిన మనసుతో బయటికి వచ్చాడు.

ఎదురుగా ఒక చెట్టు కింద ఒక సాధువు వున్నాడు. ఠాకూర్‌ అక్కడికి వెళ్ళి సమస్కరించాడు. శివుని అనుగ్రహం నీకువుంది. నీలాంటి సాహసి రాజధానిలో నివసించాల్సినవాడు. ఈ విభూది తీసుకుని రాజధానికి నీ మకాం మార్చు అన్నాడు.

ఠాకూర్‌ భార్యను తీసుకుని రాజధానికి తన వివాసం మార్చాడు.

కొన్నాళ్ళ తరువాత నగరంలో ఒక ప్రకటన చేశాడు రాజు. నగర ప్రజలకు నిద్రా నీళ్ళు లేకుండా చేస్తున్న గజదొంగను పట్టిచ్చిన వారికి గొప్ప బహుమానం, సత్కారం జరుగుతాయన్నది ఆ ప్రకటన సారాంశం అప్పటికే ఎందరో వీరులు ప్రయత్నించి విఫలం చెందారు.

ఠాకూర్‌ తెల్లవారు జామున లేచి శివుని ఆరాధించి ఆ గజదొంగ ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తాడో తెలుసుకునే ప్రయత్నంలో పడ్డాడు. విభూతి ధరించి బయటపడ్డాడు.

హఠాత్తుగా ఒక చోట కలకలం రేగింది. ఒకయింట్లో అరుపులు మొదలయ్యాయి. అది ఒక సంపన్నుల గృహం వజ్రాలహారం దొంగించిన గజ దొంగ గోడదూకబోతూ ఠాకూర్‌ కంటపడ్డాడు గజదొంగనల్లని రూపంలో భయంకరంగా వున్నాడు. ఠాకూర్‌ కూడా చెట్టంతమనిషి ఒక్కసారిగా ఠాకూర్‌ విజృంభించి గజదొంగతో తలపడ్డాడు. చేయిమెలిపెట్టి బంధించాడు. దొంగ కదల్లేకపోయాడు. అప్పటికీ జనమంతా గుంపు చేరారు. ఠాకూర్‌ దొంగను పట్టుకుని రాజుదగ్గరికి వెళ్ళాడు. జనమంతా అనుసరించారు. అప్పడే నిద్రలేచిన రాజు వార్తవిని బయటికి వచ్చాడు. ఠాకూర్‌ బంధించిన గజదొంగని చూశాడు. ఠాకూర్‌ని అభినందించి ఎన్నో ఏళ్ళుగా ఎవరూ బంధించలేని దొంగని పట్టుకున్నందుకు భారీ బహుమానం యిచ్చి కొంత భాగం రాజ్యాన్ని కూడా యిచ్చి పాలించుకోమన్నాడు.

తనకు ఏది ప్రాప్తమయిన దైవానుగ్రహమే అని భావించే ఠాకూర్‌ వినయంగా నమస్కరించాడు.

– సౌభాగ్య

First Published:  6 April 2016 1:02 PM GMT
Next Story