ఎప్పుడొస్తారు…ఏమిస్తారు…. మాల్యాకి సుప్రీం ప్ర‌శ్న‌లు!

భార‌త్ ఎప్పుడు తిరిగొస్తారో చెప్పండి…అలాగే మీ ఆస్తులు మొత్తం ఎన్ని ఉన్నాయో ఏప్రిల్ 21లోగా ప్ర‌క‌టించండి… అంటూ సుప్రీంకోర్టు, లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాని ఆదేశించింది.  అలాగే మాల్యా కోర్టు ముందు ఎప్పుడు హాజ‌ర‌వుతారు, బ్యాంకుల అప్పుల నిమిత్తం ఎంత మొత్తం డిపాజిట్ చేయ‌గ‌ల‌రు… అనే వివ‌రాల‌ను కూడా ఏప్రిల్ 21నాటికి చెప్పాల‌ని కోర్టు కోరింది.  అయితే మాల్యా ఇండియాకి రావ‌డం విష‌యంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయ‌ని ఆయ‌న న్యాయ‌వాది కోర్టుకి తెలిపారు.

ఏప్రిల్ 22 నాటికి ఆయ‌న ఎప్పుడు రాగ‌ల‌రో చెప్ప‌గ‌ల‌మ‌ని అన్నారు.  సెప్టెంబ‌రు 30 నాటికి 4వేల కోట్ల రూపాయ‌లు చెల్లిస్తాన‌ని మాల్యా చేసిన ప్ర‌తిపాద‌న‌ను బ్యాంకుల క‌న్సార్టియం అంగీరించలేదు. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు మాల్యా ఎప్పుడు వ‌చ్చేది చెప్ప‌డంతో పాటు, మాల్యాకు, ఆయ‌న భార్యాపిల్ల‌ల‌కు ఉన్న అన్ని స్థిర‌చ‌ర ఆస్తుల వివ‌రాల‌ను తెలపాల‌ని  కోరింది.  కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఏప్రిల్ 26కి వాయిదా వేసింది.