లోక్ స‌త్తా జాతీయ అధ్య‌క్షుడి పోరాటం దేనిపై?

నీతి, నిజాయితీ, అవినీతిపై పోరాటం అంటూ భారీ ఆశయాల‌తో లోక్‌స‌త్తా పార్టీని స్థాపించాడు జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ. కానీ ఇకపై ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నంటూ ఇటీవ‌ల రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న త‌రువాత ఆయ‌న ఏం చేస్తున్నార‌న్న‌ది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. తాజాగా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తాన‌ని ప్ర‌క‌టించి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. అయితే, మ‌లిద‌శ ఉద్య‌మంలోనైనా జేపీ స‌ఫ‌లీకృతుడ‌వుతాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ స‌మ‌యంలో ఒక‌సారి జేపీ ప్ర‌స్థానం గురించి గుర్తు చేసుకోవాలి..

కొంప‌ముంచిన జేపీ త‌ప్ప‌ట‌డుగులు!
ఐఏఎస్ కి రాజీనామా చేసి కులం, మ‌తం, అవినీతిపై పోరాటం సాగిస్తానంటూ ప్ర‌జ‌ల ముందుకు వెళ్ల‌డంతో తొలినాళ్ల‌లో ప్ర‌జ‌లు దేశవ్యాప్తంగా బాగానే ఆద‌రించారు. కానీ, త‌న ల‌క్ష్యాన్ని చేరే క్రమంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు జేపీ. అవినీతిపై, మత పిచ్చిపై నిజంగానే ఆయన పోరాడాడు. కానీ కులంపై పోరాటం సంగతి దేవుడెరుగు, ఆయనే కులపిచ్చినుంచి బయటపడలేకపోయాడని చాలామంది లోక్ సత్తా కార్యకర్తలు బాధపడేవాళ్లు. స‌మాచార హ‌క్కు అంటూ.. ఆరంభంలో తొలి అడుగులు బాగానే వేసినా.. రాను..రాను.. త‌ప్ప‌ట‌డుగులు ఎక్కువ‌య్యాయి. త‌మ విధానాల‌కు విరుద్ధంగా సాక్ష‌త్తూ పార్టీ అధ్య‌క్షుడైన జేపీనే వ్య‌వ‌హ‌రించ‌డంతో 2009 ఎన్నిక‌ల్లో తొలిసారిగా విభేదాలు బ‌య‌ట‌పెట్టాయి. పోనీ, ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచిన త‌రువాత అవినీతిపై ఏదైనా యుద్ధం చేశారా? అంటే..  వీధిపోరాటాల‌కూ దిక్కులేదు. క‌నీసం పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు.

కులానికి వ్య‌తిరేకం అంటూనే..!
కుల వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకమంటూనే.. సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన చంద్ర‌బాబుతో అంట‌కాగ‌డం, టీడీపీ మ‌ద్ద‌తుతో కూక‌ట్ ప‌ల్లిలో గెలిచార‌న్న విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆయ‌న‌పై జ‌నాల్లో న‌మ్మ‌కం స‌న్న‌గిల్లింది. కుల వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేక‌మంటూ ఆయ‌న కులం వారు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయ‌డంతోపై సొంత‌పార్టీ నాయ‌కులే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. 2014లో మ‌రోసారి అదే ప్రాంతం నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేద్దామ‌నుకున్నారు. చంద్ర‌బాబు ఆశీర్వాదం కోసం నామినేష‌న్ వేసే వ‌ర‌కు ఎదురు చూసి జ‌నాల ముందు చుల‌క‌న అయ్యారు. బీజేపీ-టీడీపీ పొత్తుతో పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో తాను అవే రెండు పార్టీల మ‌ద్ద‌తు కోరడంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు రేగాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. లోక్‌స‌త్తాను ఆ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ నాయ‌కులే కాదు, ప్ర‌జ‌లే పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. లోక‌స‌త్తా కంటే వెన‌క స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అవినీతిపై యుద్ధం ప్ర‌క‌టించి ఏకంగా ఢిల్లీలో గ‌ద్దెనెక్క‌డంతో లోక్‌స‌త్తాలో స‌త్తాలేద‌ని జ‌నాలకు అర్థ‌మైంది.

ఇంత‌కీ జేపీ పోరు దేనిపై?

నిన్న మొన్న‌టి దాకా బీజేపీ- టీడీపీలతో క‌లిసి ప‌నిచేస్తాన‌న్న జేపీ ఇప్పుడు ఎవ‌రిపై పోరాడ‌తారు? ఎవ‌రి విధానాల‌పై పోరాడ‌తారు? ఆయ‌న‌కు చంద్ర‌బాబును ఎదిరించే ధైర్యం లేదన్న విమ‌ర్శ‌లూ ఉన్నాయి. ఒక‌వేళ అదే నిజ‌మైతే.. ఇక మిగిలింది తెలంగాణ రాజ‌కీయాలు. రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా ప్ర‌కారం.. జేపీ ఈసారి తెలంగాణ‌లోని స‌మ‌స్య‌ల‌పైనే పోరాటానికి రంగం సిద్ధం చేసుకునేలా క‌నిపిస్తోంది. ఒక‌వేళ తెలంగాణ ప్ర‌భుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. ఆయ‌న అప్పుడు ఎవ‌రిపై పోరాటం చేస్తారు? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. జేపీ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టించే వ‌ర‌కు ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం క‌ష్ట‌మే! ఏది ఏమైనా చిత్తశుద్దిలేని జేపీ ఎంతటి నిజాయితీ పరుడైనా, మేథావి అయినా ప్రజల మన్నన పొందడం కష్టమే..!