Telugu Global
National

ఇక సెల‌బ్రిటీల‌కు ప్ర‌క‌ట‌న‌లు...విక‌టించ‌నున్నాయా?

సాధార‌ణంగా చాలామంది సెల‌బ్రిటీలు తాము వాడ‌ని వ‌స్తువులు, తిన‌ని ఆహారం, తాగ‌ని పానీయాల‌కు కూడా ప్ర‌చార క‌ర్త‌లుగా ప‌నిచేస్తుంటారు.  వారేమో వినియోగ‌దారుల‌ను ఆయా వ‌స్తువుల‌ను వాడ‌మ‌ని ప్ర‌భావితం చేస్తుంటారు కానీ, వారు ప్ర‌భావితం అయ్యేది మాత్రం అధిక‌మొత్తాల్లో ల‌భించే పారితోష‌కాలకే. ఆ త‌రువాత ఆయా వ‌స్తువుల్లో లొసుగులు, లోపాలు బ‌య‌ట‌ప‌డితే మాత్రం త‌మ‌కేం సంబంధం లేన‌ట్టే ఉంటారు. ఈ ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చే అవ‌కాశాలు క‌న‌బ‌డుతున్నాయి. ఆహారం, ప్ర‌జాపంపిణీ, వినియోగ‌దారులకు సంబంధించిన అంశాలపై వినియోగ‌దారుల ర‌క్ష‌ణ‌ చ‌ట్టంలో […]

ఇక సెల‌బ్రిటీల‌కు ప్ర‌క‌ట‌న‌లు...విక‌టించ‌నున్నాయా?
X

సాధార‌ణంగా చాలామంది సెల‌బ్రిటీలు తాము వాడ‌ని వ‌స్తువులు, తిన‌ని ఆహారం, తాగ‌ని పానీయాల‌కు కూడా ప్ర‌చార క‌ర్త‌లుగా ప‌నిచేస్తుంటారు. వారేమో వినియోగ‌దారుల‌ను ఆయా వ‌స్తువుల‌ను వాడ‌మ‌ని ప్ర‌భావితం చేస్తుంటారు కానీ, వారు ప్ర‌భావితం అయ్యేది మాత్రం అధిక‌మొత్తాల్లో ల‌భించే పారితోష‌కాలకే. ఆ త‌రువాత ఆయా వ‌స్తువుల్లో లొసుగులు, లోపాలు బ‌య‌ట‌ప‌డితే మాత్రం త‌మ‌కేం సంబంధం లేన‌ట్టే ఉంటారు. ఈ ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చే అవ‌కాశాలు క‌న‌బ‌డుతున్నాయి. ఆహారం, ప్ర‌జాపంపిణీ, వినియోగ‌దారులకు సంబంధించిన అంశాలపై వినియోగ‌దారుల ర‌క్ష‌ణ‌ చ‌ట్టంలో చేయాల్సిన మార్పుల‌ను గురించి పార్ల‌మెంట‌రీ బృంద‌మొక‌టి ఒక నివేదిక‌ను త‌యారుచేసింది. ఈ క‌మిటీకి తెలుగుదేశం పార్టీ నేత జెసి దివాక‌ర్‌రెడ్డి అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ నివేదిక‌ను కేంద్రం ఆమోదిస్తే ప్రచార‌క‌ర్త‌లుగా కోట్లు సంపాదిస్తున్న సెల‌బ్రిటీల‌కు చిక్కులు త‌ప్ప‌వు.

క‌మిటీ త‌న నివేదిక‌లో పేర్కొన్న మార్గ‌ద‌ర్శకాల ప్ర‌కారం ఇకపై ఒక వ‌స్తువుకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌నిచేసే సెల‌బ్రిటీలు ఎవ‌రైనా ఆ ఉత్ప‌త్తి లేదా ప్ర‌చార అంశం వ్య‌వ‌హారాల్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా అనేది ముందుగానే ప‌రిశీలించాలి. ఒక‌వేళ త‌రువాత ఆయా ఉత్ప‌త్తుల్లో ప్ర‌జ‌ల‌కు హాని క‌లిగించే అంశాలు, లోపాలు బ‌య‌ట‌ప‌డితే ప్ర‌చార రాయబారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేలా వినియోగ‌దారుల‌ చ‌ట్టంలో మార్పులు తేవాల‌ని క‌మిటీ సూచించింది.

క‌మిటీ పేర్కొన్న మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం, వ‌స్తుసేవ‌ల్లో లోపాలు ఉంటే, వాటికి ప్ర‌చార‌క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రించిన వారు వినియోగ‌దారులను త‌ప్పుదోవ ప‌ట్టించినందుకు గానూ వారికి అయిదేళ్ల జైలుశిక్ష‌, 50ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంటుంది. ఈ నివేదిక‌లోని అంశాలు చ‌ట్టంలో చోటు చేసుకుంటే క్రికెట‌ర్ ధోనీకి చిక్కులు ఎదురుకానున్నాయి. ఆయ‌న నోయిడాలోని ఆమ్ర‌పాలి నీల‌మ‌ణి అనే హౌసింగ్ ప్రాజెక్టుకి ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. అయితే ఆ బిల్డ‌రు ఇళ్ల నిర్మాణం పూర్తిచేయ‌కుండా ఫ్లాట్లు బుక్ చేసుకున్న‌వారికి చుక్క‌లు చూపిస్తున్నాడు. దీనిపై ఫ్లాట్ల య‌జ‌మానులు ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. వినియోగ‌దారుల ర‌క్ష‌ణ చ‌ట్టంలో మార్పులు వ‌స్తే ఆమ్ర‌పాలి వ్య‌వ‌హారం ధోనీ మెడ‌కు కూడా చుట్టుకుంటుంది.

First Published:  12 April 2016 4:11 AM GMT
Next Story