మీడియాకి ఎవ‌రిని న‌మ్మాలో తెలియ‌దు…ప్రియాంకా చోప్రా!

బాలివుడ్ న‌టి ప్రియాంకా చోప్రా మూడుసార్లు ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నాలు చేసింద‌ని ఆమె మాజీ మేనేజ‌ర్ ప్ర‌కాష్ జాజు చెప్ప‌గా ఆ వార్త మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప్రియాంకాచోప్రా తీవ్రంగా స్పందించింది. ప్ర‌కాష్ జాజు త‌న‌ని వేధించాడ‌ని, తాను కేసుపెట్ట‌గా జైలుకి కూడా వెళ్లి వ‌చ్చాడ‌ని పేర్కొంది. అలాంటి మ‌నిషి మాట‌ల‌ను న‌మ్మి మీడియా అత‌ను చెప్పిన‌దానికి తీవ్ర‌మైన ప్ర‌చారం క‌ల్పించింద‌ని ప్రియాంక అంది.  ఏ ఆధారాలు లేకుండానే, ప్ర‌కాష్ జాజూ గురించి ఏమీ తెలుసుకోకుండానే మీడియా ఆ మాటల‌ను న‌మ్మి ప్ర‌చారం చేసింద‌ని ఆమె వాపోయింది. 

2004లో ప్రియాంక, ప్ర‌కాష్ జాజుని మేనేజ‌ర్ ఉద్యోగం నుండి తొల‌గించింది. త‌న‌కు రావాల్సిన మొత్తం ఇవ్వ‌లేదంటూ అత‌ను ప్రియాంక‌పై క్రిమిన‌ల్ కేసు పెట్టాడు. త‌రువాత ప్రియాంక తండ్రి కూడా అత‌నిపై పోలీస్ కేసు పెట్ట‌గా 67 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. అస‌లు ఎలాంటి విలువ‌లేని వ్య‌క్తి చెప్పిన మాట‌ల‌ను మీడియా న‌మ్మింద‌ని, తాను ఈ విష‌యం గురించి ఇంకేమీ  మాట్లాడ‌ద‌ల‌చుకోలేద‌ని, అత‌నికి అంత అర్హ‌త కూడా లేద‌ని ఆమె తెలిపింది. టివి న‌టి ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య త‌రువాత ప్ర‌కాష్ జాజూ ప్రియాంక చోప్రా కూడా మూడుసార్లు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింద‌ని వెల్ల‌డించాడు.