కేసీఆర్ నిజంగానే ముస్లింల‌కు అన్యాయం చేస్తున్నారా?

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో మంచి దూకుడు మీదున్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి జోరు పెంచారు. త‌ర‌త‌రాలుగా కాంగ్రెస్ పార్టీకి అండ‌గా ఉంటున్న మైనార్టీల ప‌క్షాన పోరాటానికి స‌మాయ‌త్త‌మయ్యారు. గులాబీపార్టీ ఎన్నిక‌ల స‌మ‌యంలో 12 శాతం రిజ‌ర్వేష‌న్ల క‌ల్పిస్తామ‌న్న వాగ్దానాన్ని త‌క్ష‌ణ‌మే నెర‌వేర్చాల‌న్న డిమాండ్‌తో పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. టీఆర్ ఎస్ ఇచ్చిన హామీల‌న్నీ ఎన్నిక‌ల స్టంట్ల‌నీ మాట‌ల దాడి ప్రారంభించారు. ఈ విష‌యంలో ఉత్త‌మ్ ఒక‌డుగు ముందుకేశారు.  ముస్లిం మైనార్టీల‌కు ఇచ్చిన హామీ ప్ర‌కారం.. వెంట‌నే రిజ‌ర్వేషన్లు అమ‌లు చేయాల‌ని కోరుతూ.. 10 ల‌క్ష‌ల మంది ముస్లింల సంత‌కాల సేక‌ర‌ణ ప్రారంభించారు. అంతేనా.. ముస్లిం ఆన్ రిజ‌ర్వేష‌న్స్ అనే వెబ్‌సైట్ ను కూడా ప్రారంభించారు. త‌మ హ‌యాంలో 4 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించి ముస్లింల‌కు న్యాయం చేశామ‌ని 12 శాతం అని ప్ర‌క‌టించి ముస్లింల‌ను కేసీఆర్ మ‌భ్య పెట్టార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇక మ‌రో ముస్లిం మైనార్టీ నేత షబ్బీర్ అలీ ముస్లింల స్థితిగ‌తుల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. 
టీఆర్ ఎస్ వాద‌న మ‌రోలా ఉంది..! 
కాంగ్రెస్ హ‌యాం కంటే త‌మ పార్టీనే ముస్లింల‌కు ఎక్కువ మేలు చేసింద‌ని గులాబీనేతలు చెప్పుకుంటున్నారు.  ముస్లింల సంక్షేమానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నాము కాబ‌ట్టే గ్రేట‌ర్‌లో త‌మ‌ను గెలిపించార‌ని టీఆర్ ఎస్ నేత‌లు వాదిస్తున్నారు. వాస్త‌వానికి షాదీముబార‌క్‌, షాదీఖానాల‌ నిర్మాణం , పాత‌బ‌స్తీ అభివృద్ధికి త‌గిన కార్య‌చ‌ర‌ణ‌, త‌దిత‌ర ప‌థ‌కాల‌తో మేమే ముస్లింల సంక్షేమంలో ముందున్నామ‌ని దీమా వ్య‌క్తం చేస్తున్నారు.