హ‌రీశ్ బాధ‌ను వారెందుకు అర్థం చేసుకోవ‌డం లేదో?

తెలంగాణ భారీ నీటి పారుద‌ల శాఖామంత్రి హ‌రీశ్ రావు బాధ‌ను వారెవ‌రూ (గులాబీ ఎమ్మెల్యేలు) అర్థం చేసుకోవ‌డం లేదు. ఇంత‌కీ విష‌య‌మేంటంటే.. తెలంగాణ‌లో చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు చేప‌ట్టిన ప‌థ‌కం మిష‌న్ కాక‌తీయ‌.. కేసీఆర్ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టారు. ఈ ప‌థ‌కం మంచి ఉద్దేశంతో చేప‌ట్టింది కావ‌డంతో ఇత‌ర రాష్టాల వారు వ‌చ్చి అధ్య‌యనాలు సాగిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు ప్ర‌తిష్ట మ‌రింత పెరిగింది. తెలంగాణ‌లో క‌రువు నివార‌ణ‌కు చేప‌ట్టిన ప‌థ‌కం కావ‌డంతో సీఎం కేసీఆర్ త‌న సొంత యంత్రాంగంతో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ.. హ‌రీశ్‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల స‌చివాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఇరిగేషన్ అధికారుల‌పై హ‌రీశ్ మండిప‌డ్డారు. చెరువుల పూడిక‌తీత ప‌నులు ఆల‌స్యంగా జ‌ర‌గ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌ర్షాకాలం స‌మీపిస్తున్న‌నేప‌థ్యంలో ఏప్రిల్ 30ని డెడ్‌లైన్‌గా విధించారు.
తోటి ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఎలా మంద‌లించాలి?
అధికారుల‌పై అయితే ఆగ్ర‌హం వెళ్ల‌గ‌క్కిన హ‌రీశ్‌కు త‌న తోటి ఎమ్మెల్యేల‌ను ఎలా మందలించాలో తెలియ‌క ఆవేద‌న చెందుతున్నారు. ప్ర‌భుత్వం క‌రువు నివార‌ణే ల‌క్ష్యంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన చెరువుల పూడిక తీత ప‌నులు ఇప్ప‌టికీ కొన్ని జిల్లాల్లో స‌గం కూడా పూర్తి కాలేదు. ముఖ్యంగా వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో స‌గం కూడా ప‌నులు కాలేదట‌. అంటే.. ఈజిల్లాలో ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తోన్న ఎమ్మెల్యేల అనాస‌క్తి కార‌ణంగా ఈ దుస్థితి త‌లెత్తింద‌న్న‌ది హ‌రీశ్ ఆవేద‌న‌. అధికారులంటే ఉద్యోగులు కాబ‌ట్టి, వెంట‌నే ప‌నులు చేస్తారు. కానీ, త‌న తోటి ఎమ్మెల్యేల‌ను ఎలా దారికి తెచ్చుకోవాలో?  తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఏది ఏమైనా వారంద‌రితో త్వ‌ర‌లో స‌మావేశాలు ఏర్పాటు చేసి.. వేస‌వి పూర్త‌య్యేలోగా.. చెరువుల పూడిక తీత పూర్తి చేయాల‌ని హ‌రీశ్ భావిస్తున్నట్లు స‌మాచారం. ఇందుకు ఆయ‌న మ‌రి ఏ ప‌ద్ధ‌తులు అవ‌లంబిస్తారో !