ప్రేమ గుట్టు విప్పారు..పెళ్లికి సిద్దం అయ్యారు..

టాలీవుడ్ లో ఈ మధ్య పలువురు సింగర్లు ప్రేమ వివాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే దారిలో మరో తెలుగు గాయని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. శ్రీరామదాసు, హ్యాపీడేస్, యమదొంగ, లయన్ తదితర చిత్రాల్లో తన గానంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రణవి ఆచార్య ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ను పెళ్లాడబోతున్నారు. ఏప్రిల్ 21న తమ పెళ్లి జరుగనున్నట్టు రఘు వెల్లడించారు. గత కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇన్నాళ్లు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ మెయింటన్ చేస్తూ వచ్చారు. అయితే ఆ మధ్య ఆడియో వేడుకలో యాంకర్ ఝాన్సి వీరి ప్రేమ వ్యవహారం బయట పెట్టడంతో విషయం బయటకు లీకైంది.

డిసెంబర్‌ 26న వీరి నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాపులో కొనసాగుతున్న కొరియోగ్రాఫర్లలో రఘు మాస్టర్ ఒకరు. ఆర్య2 సినిమా తర్వాత కొరియోగ్రాఫర్ గా పాపులర్ అయిన రఘు మిర్చి, జిల్, అఖిల్ తో పాటు అనేక చిత్రాలకు పని చేసారు. సింగర్ ప్రణవి కూడా సినీరంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. పెళ్లి విషయాన్ని తెలియజేస్తూ తమ నిశ్చితార్థం నాటి ఫొటోను రఘు మాస్టర్ పోస్టు చేసారు. సినీ ప్రముఖుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక వైభవంగా జరుగబోతోంది.