Telugu Global
Others

పాలేరు... హోరాహోరు..!

ఖ‌మ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక‌కు హోరాహోరీ పోరు త‌ప్పేలా లేదు. గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా బ‌ల‌హీనంగా ఉన్న టీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడు తుమ్మ‌ల చేరిక‌తో బ‌లోపేత‌మైంది. పార్టీ కేడ‌ర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఖ‌మ్మం కార్పోరేష‌న్‌లో గులాబీ అఖండ విజ‌యాన్ని సాధించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. అయితే, గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌ ఆధారంగా చూస్తే.. గులాబీ పార్టీకి అటు సీపీఎం, ఇటు కాంగ్రెస్‌, టీడీపీ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతుంద‌న్న‌ది ఖాయంగా […]

పాలేరు... హోరాహోరు..!
X
ఖ‌మ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక‌కు హోరాహోరీ పోరు త‌ప్పేలా లేదు. గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా బ‌ల‌హీనంగా ఉన్న టీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడు తుమ్మ‌ల చేరిక‌తో బ‌లోపేత‌మైంది. పార్టీ కేడ‌ర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఖ‌మ్మం కార్పోరేష‌న్‌లో గులాబీ అఖండ విజ‌యాన్ని సాధించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. అయితే, గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌ ఆధారంగా చూస్తే.. గులాబీ పార్టీకి అటు సీపీఎం, ఇటు కాంగ్రెస్‌, టీడీపీ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతుంద‌న్న‌ది ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ ప్రాంతంలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు అధికం. వీరంతా ప‌క్క‌నే ఉన్న కృష్ణా, గుంటూరు, గోదావ‌రి జిల్లాల నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డ్డ‌వారే. అందుకే, ఇక్క‌డ తెలంగాణ వాదం మొద‌టి నుంచి బ‌ల‌హీనంగా ఉంది. ఇక్క‌డ క‌మ్యూనిస్టులైనా, తెలుగు త‌మ్ముళ్ల‌యినా ఇదే సామాజిక‌వ‌ర్గం వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ రెండు పార్టీల ప‌గ్గాలు మ‌రో సామాజిక వ‌ర్గానికి వెళ్లిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌నే చెప్పాలి. ఈ ఒక్క‌ ఉదాహ‌ర‌ణ చాలు వీరు ఇక్క‌డ ఎంత బ‌లంగా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు.
అందుకే నామాను దింపుతోంది..
టీడీపీ త‌న‌ మిత్ర‌ప‌క్షం బీజేపీతో క‌లిసి గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 150 డివిజ‌న్లలో పోటీ చేసినా.. కేవ‌లం ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది. అది కూడా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ప్ర‌జ‌లు అధికంగా ఉన్న కేపీహెచ్‌బీలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఖ‌మ్మం జిల్లాలో కూడా ఇదే స‌మీక‌ర‌ణాల‌తో మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావును బ‌రికిలోకి దింపింది టీడీపీ. తెలుగుదేశానికి గ‌తంలో ఉన్న చ‌రిష్మ ఇప్పుడు ఉందా? అన్న విషయాల‌ను ప‌క్క‌నే పెడితే.. సొంత సామాజిక‌వ‌ర్గ ప్ర‌జ‌లు, పార్టీ కేడ‌ర్‌, గ‌తంలో ఉన్న ఓటు బ్యాంకుల‌ను ప‌రిగ‌ణ‌ణ‌లోకి తీసుకున్నాకే.. టీడీపీ నామాను బ‌రిలోకి దించింది. సామాజిక‌వ‌ర్గాల స‌మీర‌ణాల నేప‌థ్యంలో సీపీఎం, టీడీపీలు కారు హోరుకు ఎంత వ‌ర‌కు బ్రేకులు వేస్తాయో చూడాలి.
కాంగ్రెస్ త‌క్కువేం కాదు..
పాలేరు నియోజ‌క‌వ‌ర్గం మొద‌టి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది. ఇక్క‌డ 1972 నుంచి ఇప్ప‌టి దాకా కేవ‌లం మూడుసార్లు మాత్ర‌మే ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేలు అదీ… సీపీఎం నుంచే గెలుపొందారు.. అందుకే, ఈ స్థానంలో విజ‌యావకాశాల‌పై కాంగ్రెస్ మొద‌టి నుంచి ధీమాగా ఉంది. పైగా ఈ స్థానంలో 2009 నుంచి దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి గెలుస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంతో జ‌రుగుతున్న ఎన్నిక‌లు కావ‌డంతో సెంటిమెంటు వ‌ర్క‌వుట‌యితే.. గులాబీ పార్టీకి క‌ష్టాలు త‌ప్ప‌వు.
First Published:  21 April 2016 11:39 PM GMT
Next Story