మళ్లీ జోరు పెంచిన మాస్ రాజా…

కిక్-2 తర్వాత సెడన్ గా స్లో అయిపోయాడు మాస్ రాజా రవితేజ. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఒకెత్తయితే… ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఒప్పుకున్న సినిమా నుంచి తప్పుకోవడం రెండో విషయం. ఈ రెండు కారణాల వల్ల రవితేజ కెరీర్ కాస్త స్లో అయింది. తగ్గిన కెరీర్ గ్రాఫ్ ను మళ్లీ పెంచుకునేందుకు రవితేజ స్పీడ్ మార్చాడు. టాప్ గేర్ లోకి ఎంటరయ్యాడు. ఇప్పటికే కొత్త కుర్రాడినిని డైరక్టర్ గా పరిచయం చేస్తూ రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే తమిళ్ లో హిట్టయిన కనిథన్ అనే సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించాడు. ఈ సినిమా రీమేక్ బాధ్యతల్ని ఒరిజినల్ తమిళ దర్శకుడు టీఎన్ సంతోష్ కే అప్పగించాడు. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు కుదిరితే శ్రీవాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు మాస్ రాజా ప్లాన్స్ సిద్ధంచేస్తున్నాడు.
ఇటీవల కాలంలో బాలయ్యతో డిక్టేటర్ సినిమాను తెరకెక్కించాడు శ్రీవాస్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ట్రయిలర్ బాగున్నప్పటికీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత శ్రీవాస్ కు మళ్లీ ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. మరోసారి బాలయ్యతోనే సినిమా చేయాలని ఆ దర్శకుడు భావించినప్పటికీ అదికూడా వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజ తో సినిమా చేసే అవకాశం లభించింది. మాస్ రాజాను డైరక్ట్ చేయడం శ్రీవాస్ కు ఇదే ఫస్ట్ టైమ్. నిర్మాత ఠాగూర్ మధు ఈ కాంబినేషన్ ను సెట్ చేశాడు. శ్రీవాస్ సినిమాలన్నీ మాస్ టచ్ తో ఉంటాయి. అలాంటిదే మరో కథను రవితేజకు చెప్పి ఒప్పించాడనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికైతే ముగ్గురు దర్శకుల్ని లైన్లోపెట్టాడు మాస్ రాజా. ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరు రవితేజకు హిట్ ఇస్తారో వేచి చూడాలి.