బోయపాటి… హింసాపాటి

రేటింగ్: 2.75/5
తారాగణం:
  అల్లు అర్జున్, సుమన్, సాయికుమార్, జయప్రకాష్‌ రెడ్డి, ఆది, రకుల్, క్యాథరిన్
దర్శకత్వం:  బోయపాటి శీను
సంగీతం: థమన్
నిర్మాత:  అల్లు అరవింద్
విడుదల తేదీ: ఏప్రిల్ 22, 2016

ఒక విలనుంటాడు. అరాచకాలు చేస్తుంటాడు. ఒక హీరో వుంటాడు. విలన్ని ఎదుర్కుంటాదు. ఒకరో ఇద్దరు హీరోయిన్లుంటారు. వాళ్ళు ఆడిపాడుతారు. హీరోకి ఒక కుటుంబం ఉంటుంది. దాని జోలికొస్తే ముఖ్యమంత్రినైనా, అతని కొడుకునైనా వదిలిపెట్టడు. ఇదో ఫార్ములా. ఈ రకంగా వంద సినిమాలు వచ్చుంటాయి. ఇంకా వస్తాయి. బోయపాటి శీను తన ఫార్ములాని వదలకుండా సరైనోడు సినిమా తీసాడు. తెలిసిన కథే అయినా కొత్తగా చెప్పాలి. అనగనగా ఒక రాజు, ఆయనకి ఏడుగురు కొడుకులు అనే కథని అనగనగా ఒక రాజు, ఆయని ఏడుగురు తమ్ముళ్ళు అని చెబితే ఆసక్తిగా వింటారు. శీను ఫార్ములా కూడా ఇదే.

హీరోపేరు గణ. చీఫ్ సెక్రటరీ కొడుకు. ఒక లాయర్ కి తమ్ముడు. అన్నలు, వదినలు నానమ్మలతో పెద్దకుటుంబం. విలన్ పేరు వైరంధనుష్ (ఆది). ముఖ్యమంత్రి కొడుకు. ఒక హీరోయిన్ (క్యాథరిన్) ఎమ్మెల్యే. ఇంకో హీరోయిన్ (రకుల్) ఒక మాజీ ఐఏఎస్ అధికారి సాయికుమార్ కూతురు. ఇది కథ.

ఆయిల్ కంపెనీకి భూములు అమ్మడం కోసం తానేనేరుగా రంగంలోకి దిగి అడ్డొచిన వాళ్ళని చంపుతూ వుంటాడు ధనుష్. భూముల్ని ఆక్రమించడాన్ని సాయికుమార్ ఎదిరిస్తాడు. సాయికుమార్ ఇంటికి పెళ్ళి చూపులకి వచ్చిన హీరోకి ఎదురైన సంఘటనలేమిటనేది సినిమా..

హీరో ఎమ్మేల్యే క్యాథరీన్ ను ప్రేమిస్తుంటాడు. గొడవలు మానేస్తే పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది. హీరో గొడవలు మానేస్తానని పెద్దమ్మ తల్లిపై ప్రమాణం చేస్తున్నపుడు జరిగే ఫైట్ తో ఇంట్రవెల్. సెకండాఫ్ అంతా విలన్ ని హీరో ఎలా ఎదుర్కొంటాడనేది కథ.

సిస్టంలో వుంటూ సిస్టంతో ఆడుకునే వాడితో జాగ్రత్త అని ఈ సినిమాలో ఒక డైలాగుంది. ముఖ్యమంత్రి కొడుకుగా వున్న విలన్‌కి అసలు సిస్టమే తెలియదు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగమంతా అతని చేతిలో వుంటుంది. వీధిరౌడీలాగా జనంపై పడి చంపక్కరలేదు. సినిమాల్లో లాజిక్‌ అడగకూడదు.

ఎమ్మెల్యేని లవ్‌చేస్తే కొత్తగా వుంటుందని పెట్టారేతప్ప, ఆ పాత్రవల్ల పెద్ద ప్రయోజనం లేదు. రకుల్‌కి నటించే అవకాశం లేదు. సినిమాని మొత్తం అల్లు అర్జున్‌ తన భుజాలపై మోసాడు. బోయపాటి అన్ని సినిమాల్లో వున్నట్టే హింస టాప్‌రేంజ్‌లో వుంది. అర్జున్‌ ఫైట్స్‌ అభిమానుల్ని అలరిస్తాయి. సీరియస్‌గా సాగుతున్న కథకి పాటలు అడ్డం పడతాయి. నాలుగు పాటలైతే సరిపోయేది. స్టెప్స్‌ అభిమానులు ఇష్టపడతారని రెండు పెంచి ఆరు చేశారు.

హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ లేకపోవడం ఒక రిలీఫ్‌. అది కూడా వుంటే మొత్తం ఏడుపాటలయ్యేవి. బ్రహ్మానందం, పృథ్వి వున్నారు కానీ కామెడీ వర్కవుట్‌ కాలేదు. చాలా రోజుల తరువాత నాయనమ్మగా అన్నపూర్ణ కనిపించింది. ఎం. రత్నం డైలాగులు అక్కడక్కడ బావున్నాయి. వున్నకాసేపు సాయికుమార్‌, సుమన్‌ బాగా చేశారు. జయప్రకాష్‌ రెడ్డి ఎపిసోడ్‌ పూర్తిగా అనవసరం. రెండు గంటల నలభై నిముషాల నిడివి కొంచెం భారమే. కనీసం 20 నిముషాలు కుదించే అవకాశమున్నా డైరెక్టర్‌ లెంగ్త్‌కే ప్రాధాన్యత ఇచ్చాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రవాదం పూర్తిగా అంతరించిపోతున్న దశలో, తీవ్ర వాదులు ముఖ్యమంత్రిని, ఆయన కొడుకుని చంపారని చూపించడం ఒక విచిత్రం.

అభిమానులకి ఎలాగూ నచ్చుతుంది. బోయపాటి మార్కు హింసని ఇష్టపడేవాళ్ళు ఒకసారి చూడొచ్చు.

ఇంతకూ ఈ సినిమాలోని ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఏ రాష్ట్రానికి చెందినవారో?

– జి ఆర్‌. మహర్షి