భార్య స్నేహితురాలిపై అత్యాచారం!

ఓ స‌బ్ ఇన్‌స్పెక్టర్ త‌న భార్య స్నేహితురాలైన యువ‌తి (20) పై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. కేసుపెడితే చంపుతాన‌ని బెదిరించాడు. చెప్ప‌కుండా ఉంటే చ‌దువుకి స‌హాయం చేస్తాన‌ని ప్ర‌లోభ‌పెట్టాడు. చివ‌రికి పోలీసుల‌కు చిక్కాడు. పుణెలోని వ‌నావాడి పోలీస్‌స్టేష‌న్ పోలీసులు, ముంబ్రా పోలీస్‌స్టేష‌న్లో ప‌నిచేస్తున్న‌ స‌బ్ ఇన్‌స్పెక్ష‌ర్ సంతోష్ సోనావేన్ (30)ని గురువారం అరెస్టు చేశారు.

కేసు వివ‌రాల్లోకి వెళితే, బాధితురాలు, నిందితుడి కుటుంబాల‌కు మ‌ధ్య మంచి స్నేహం ఉంది. దాంతోపాటు నిందితుడి భార్య‌కు, ఆ యువ‌తి స్నేహితురాలు కూడా కావ‌టంతో అత‌ని ప‌ని మ‌రింత సులువ‌యింది. ఈ నెల 13న బాధితురాలి పుట్టిన రోజు కావ‌డంతో నిందితుడు సోనావేన్, ఆమెని త‌న ఇంటికి పిలిచాడు. థానే జిల్లా శివార్ల‌లో ఉన్న‌ ముంబ్రా ప‌ట్ట‌ణంలో  ప‌నిచేస్తున్న సోనావేన్ కుటుంబం పుణెలో ఉంటోంది. అత‌నికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.  బాధితురాలి కుటుంబం కూడా వీరి ఫ్లాట్ ఉన్న ప్రాంతంలోనే నివాసం ఉంటోంది. బాధితురాలు, సోనావేన్ ఇంటికి వ‌చ్చేస‌రికి అత‌నొక్క‌డే ఇంట్లో ఉన్నాడు.  ఆ స‌మయంలో అత‌ని భార్య బ‌య‌ట‌కు వెళ్లింది. యువ‌తిపై సోనావేన్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.   ఫార్మ‌సీలో డిప్లొమా చేసిన బాధితురాలికి బిఎస్‌సి చ‌దివేందుకు స‌హాయం చేస్తాన‌ని  ప్ర‌లోభ‌పెట్టాడు. అలాగే ఒక‌వేళ ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని గ‌న్ చూపించి బెదిరించాడు.

త‌రువాత ఈ నెల 23న పై చ‌దువుల‌కు ముంబ‌యి వెళుతున్న‌ట్టుగా చెప్పి ఇంట్లోంచి బ‌యట‌కు వ‌చ్చేయాల్సిందిగా చెప్పాడు. ఆమె పుణెలో రైలు ఎక్క‌గా క‌ల్యాణ్ అనే స్టేష‌నులో  దింపుకున్నాడు. ఆమెని పెళ్లిచేసుకుంటాన‌న్నాడు.  మెడ‌లో వేసుకోమ‌ని మంగ‌ళ‌సూత్రం ఇచ్చాడు. అక్క‌డ లాడ్జిలో గ‌ది అద్దెకు తీసుకున్నాడు. తిరిగి అత్యాచారం చేశాడు.

త‌రువాత థానే జిల్లాలోని కాల్వ‌ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ని అద్దెకు తీసుకున్నాడు. ఆమెని లోప‌ల పెట్టి తాళం వేసుకుని వెళ్లేవాడు. తిరిగి వ‌చ్చి  రేప్ చేస్తుండేవాడు. ఇదిలా ఉండ‌గా బాధితురాలి త‌ల్లిదండ్రులు త‌మ కూతురు  క‌నిపించ‌డం లేద‌ని కేసుపెట్టారు. ఆమె ఫోన్ స్విచ్ఛాప్‌లో ఉన్నా, చివ‌రిగా కాల్వ‌లో మోగిన‌ట్టుగా పోలీసులు గుర్తించారు. ఆమె నెంబ‌రుకి వ‌చ్చిన కాల్స్, ఆ నెంబ‌రునుండి వెళ్లిన కాల్స్ సోనావేన్‌వే అయి ఉండ‌టంతో పోలీసులు అత‌ని ఫోన్‌ని ట్రాప్ చేశారు. కాల్వ‌లో ఉన్న‌ట్టుగా క‌నుగొన్నారు. అలాగే బాధితురాలి ఆచూకీ తెలుసుకున్నారు.  ఆమెని ర‌క్షించి, సోనావేన్‌ని అరెస్టు చేశారు. అత‌నిపై అత్యాచారం, మోసం, కిడ్నాప్ కేసుల‌ను న‌మోదు చేశారు.