Telugu Global
WOMEN

భార‌త‌దేశ‌పు మొద‌టి, ఏకైక మ‌హిళా ట‌న్నెల్ ఇంజినీర్‌...ఏమంటున్నారు?

ఆమె మొద‌టి రోజు ఉద్యోగ విధుల‌కు వెళ్లిన‌పుడు… ఈమె ఈ ప‌ని ఎన్నిరోజులు చేయ‌గ‌ల‌దో చూద్దాం…అని పెద‌వి విరిచారు అక్క‌డ ఉన్న తోటి మ‌గ ఉద్యోగులు. ఎందుకంటే  ఆమె మ‌న‌దేశంలోనే మొట్ట‌మొద‌టి ఎకైక మ‌హిళా ట‌న్నెల్ ఇంజినీర్ మ‌రి. చుట్టూ దాదాపు వంద‌మంది మ‌గ‌వారు. అందులో చాలామంది శ్రామికులు, కొంద‌రు ఇంజినీర్లు.  మ‌ట్టి, రాళ్లు ర‌ప్ప‌ల‌తో కూడిన‌ భ‌యంక‌ర‌మైన వాతావ‌ర‌ణం, కాస్త కూర్చోవ‌డానికి కూడా అనువుగా లేని ప్ర‌దేశాలు. టాయిలెట్ స‌దుపాయం అనే ప్ర‌శ్నేలేదు.   ఆమె తొలిరోజు […]

భార‌త‌దేశ‌పు మొద‌టి, ఏకైక మ‌హిళా ట‌న్నెల్ ఇంజినీర్‌...ఏమంటున్నారు?
X

ఆమె మొద‌టి రోజు ఉద్యోగ విధుల‌కు వెళ్లిన‌పుడు… ఈమె ఈ ప‌ని ఎన్నిరోజులు చేయ‌గ‌ల‌దో చూద్దాం…అని పెద‌వి విరిచారు అక్క‌డ ఉన్న తోటి మ‌గ ఉద్యోగులు. ఎందుకంటే ఆమె మ‌న‌దేశంలోనే మొట్ట‌మొద‌టి ఎకైక మ‌హిళా ట‌న్నెల్ ఇంజినీర్ మ‌రి. చుట్టూ దాదాపు వంద‌మంది మ‌గ‌వారు. అందులో చాలామంది శ్రామికులు, కొంద‌రు ఇంజినీర్లు. మ‌ట్టి, రాళ్లు ర‌ప్ప‌ల‌తో కూడిన‌ భ‌యంక‌ర‌మైన వాతావ‌ర‌ణం, కాస్త కూర్చోవ‌డానికి కూడా అనువుగా లేని ప్ర‌దేశాలు. టాయిలెట్ స‌దుపాయం అనే ప్ర‌శ్నేలేదు. ఆమె తొలిరోజు ఉద్యోగంలో చేరిన‌పుడు భూమిని తొలిచే ఒక పెద్ద మిష‌న్ క‌ద‌ల‌న‌ని మొరాయించింది. అక్క‌డ ఉన్న ఒక జ‌ర్మ‌న్ ఇంజినీర్ అందులోకి వెళ్లి న‌ట్‌ని ఓపెన్ చేయ‌మ‌ని చెప్పాడు. ఆమె అందులోకి వెళ్లి ప‌నిచేస్తుండ‌గా హైడ్రాలిక్ ఆయిల్ మొహంమీద చిమ్మింది. అప్పుడు ఈ విష‌యంమీద ఆమె మ‌గ కొలీగ్స్ వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు సొరంగాలు త‌వ్వ‌డ‌మే నా జీవితం అంటున్నారు…. 35 ఏళ్ల అన్నే సిన్హా రాయ్‌. శుక్ర‌వారం ప్రారంభ‌మ‌వుతున్న ద‌క్షిణ‌ భార‌త‌దేశపు మొట్ట‌మొద‌టి అండ‌ర్ గ్రౌండ్ మెట్రో రైల్ ప్రాజెక్టులో తన భాగస్వామ్యం కూడా ఉంద‌ని ఆమె గ‌ర్వంగా చెబుతున్నారు.

మే 2015లో అన్నే, బెంగ‌లూరు మెట్రో రైల్ కార్పొరేష‌న్‌లో అసిస్టెంటు ఇంజినీర్‌గా చేరారు. ఇప్పుడు ఆమె గోదావ‌రి అనే ట‌న్నెల్ బోరింగ్ మెషిన్ ని ఎవ‌రి స‌హాయం లేకుండా న‌డ‌ప‌గ‌ల‌రు. సొరంగ మార్గంలో రోజుకి ఎనిమిది గంట‌లు ప‌నిచేయ‌గ‌ల‌రు. న‌మ్మ మెట్రో ప్రాజెక్టులో త‌న‌ని హెల్మెట్‌, జాకెట్‌తో చూసిన వారు ఎవ‌రైనా ఈ ప్రాజెక్టు ఎప్ప‌టికి పూర్త‌వుతుంది అనే ఒకే ఒక‌ ప్ర‌శ్న‌ని అడిగే వార‌ని అన్నే గుర్తు చేసుకున్నారు.

నాగ‌పూర్ యూనివ‌ర్శిటీ నుండి మెకానిక‌ల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశాక అన్నే మాస్ట‌ర్స్ డిగ్రీ చేయాల‌నుకుంది. అయితే అప్పుడే తండ్రి మ‌ర‌ణించ‌డంతో ఉద్యోగంలో చేర‌క‌త‌ప్ప‌లేదు. 2007లో ఢిల్లీ మెట్రో ప‌నుల‌కు ఒక కాంట్రాక్ట‌ర్ వ‌ద్ద ఆమె పనిచేశారు. త‌రువాత 2009లో చెన్నై మెట్రోలో చేరారు. 2014లో ఆరునెల‌లు దోహాలో ప‌నిచేశారు. ఆడ‌వాళ్లు మూస‌ధోర‌ణిలో ఒక‌టే ర‌కం ఉద్యోగాల్లో కాకుండా మ‌గ‌వారికి మాత్ర‌మే అని ముద్ర‌వేసిన ఉద్యోగాల్లోనూ రాణించాల‌ని అన్నే ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె హెచ్ఎస్ఆర్ లే అవుట్‌లో త‌న ఇంజనీర్ భ‌ర్త‌తో క‌లిసి ఉంటున్నారు.

First Published:  29 April 2016 4:29 AM GMT
Next Story