మెట్రో ఆల‌స్యం ప్ర‌భుత్వానికి ప్ల‌స్సా..?  మైన‌స్సా?

హైదరాబాద్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మెట్రో రైల్వే ప్రాజెక్టు అనుకున్న‌ట్లుగా జూన్ 2న ప్రారంభం కావ‌డం లేదు. ఈ విష‌యాన్ని మెట్రో ఎండీ గాడ్గిల్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఆయ‌న ప‌ద‌వీ నుంచి త‌ప్పుకుని తాజాగా ఆ బాధ్య‌త‌ల‌ను శివానంద నంబార్గీకి అప్ప‌జెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జూన్ 2కు నాగోల్ -మెట్టుగూడ‌, ఎస్ ఆర్ న‌గ‌ర్ – మియాపూర్ మార్గాలు ప్రారంభ‌మ‌య్యే ప‌రిస్థితులు లేవ‌ని స్ప‌ష్టం చేశారు.  సాంకేతికంగా ఈ మార్గాలు మొత్తం పూర్త‌యినా.. ఇంకా భ‌ధ్ర‌త‌, ర‌క్ష‌ణ ఏర్పాట్లు పూర్తి కాక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని వెల్ల‌డించారు. ఉమ్మ‌డి ఏపీలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు వాస్త‌వానికి 2014 డిసెంబ‌రు నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ, ఆ త‌రువాత రాష్ట్ర విభ‌జ‌న‌, అలైన్ మెంట్ మార్పు కార‌ణంగా ఎంజీబీ ఎస్ వ‌ద్ద ప‌నులు చాలాకాలం నిలిచిపోయాయి. ఇది ప‌నుల జాప్యానికి ప్ర‌ధాన అడ్డంకిగా మారింద‌ని చెప్పాలి. అయినా.. జూన్ 2 నాటికి నాగోల్ -మెట్టుగూడ‌, ఎస్ ఆర్ న‌గ‌ర్ – మియాపూర్ మార్గాల‌ను ప్రారంభిస్తామ‌ని ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. గాడ్గిల్ ప్ర‌క‌ట‌న‌తో మెట్రో ఏకంగా మ‌రో రెండున్న‌ర ఏళ్లు జాప్యం త‌ప్పేలా లేదు. 
ఇది లాభ‌మా? న‌ష్ట‌మా?
మెట్రో ప‌నుల్లో జాప్యంలో తెలంగాణ స‌ర్కారు ప్ర‌భుత్వం జోక్యం కూడా ఉంది. అసెంబ్లీ రూట్‌లో మెట్రో ఉంటే చారిత్ర‌క భ‌వ‌నాల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని సీఎం అభ్యంత‌ర తెలిపారు. ఒక ద‌శ‌లో అక్క‌డ ఇప్ప‌టికే వేసిన పిల్ల‌ర్లు తొల‌గిస్తార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే, ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు ఇలా జాప్యం కావ‌డం తెలంగాణ ప్ర‌భుత్వ ప‌నితీరుకు మైన‌స్ మార్కులుగానే చెప్పాలి. వారి జోక్యంతోనే ప‌నులు కొంత జాప్యం అయ్యాయ‌న్న సంగ‌తి వాస్త‌వ‌మే! అయితే, గాడ్గిల్ 2018 డిసెంబ‌రునాటికి పూర్తి చేస్తామ‌ని తాజా ల‌క్ష్యాన్ని ప్ర‌క‌టించారు. స‌రిగ్గా అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌రిగితే.. ఇక్క‌డ తెలంగాణ ప్ర‌భుత్వానికి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది. స‌రిగ్గా అప్పుడే ఎన్నిక‌ల వేడి మొద‌లవుతుంది. 2019 ఏప్రిల్‌లో అసెంబ్లీకి ఎన్నిక‌లు వ‌స్తాయి. షెడ్యూలు ప్ర‌కారం.. 2018 డిసెంబ‌రునాటికి మెట్రో రైలు న‌గంలో ప‌రుగులు పెట్టించామ‌ని ప్ర‌జ‌లను ఓట్లు అడ‌గ‌వ‌చ్చు. ప్ర‌జ‌లు కూడా సానుకూలంగా ఓట్లు వేయ‌వ‌చ్చు. అదేస‌మ‌యంలో జాప్యానికి విసిగిన కొంద‌రు వ్య‌తిరేకంగా కూడా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు.  మొత్తానికి ప్రాజెక్టు జాప్యం వ‌ల్ల ప్ర‌భుత్వ ప‌నితీరుపై న‌గ‌ర‌వాసులు ఓట్ల ద్వారా త‌మ‌ తీర్పును త‌ప్ప‌క తెలియ‌జెప్తారు.