Telugu Global
Health & Life Style

మాయ రోగాల‌ను మించి పోతున్న మెడిక‌ల్ ఎర్ర‌ర్‌!

ఇది నిజంగా విచిత్ర‌మే…మ‌న దేశంలోని ధ‌న‌వంతులు అమెరికా వైద్యాన్ని అల్టిమేట్‌గా భావించి అక్క‌డ చికిత్స తీసుకుంటుంటారు. అయితే అక్క‌డ పేషంట్ల ప‌ట్ల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల విష‌యంలో ఎంత నిర్ల‌క్ష్యం ఉందో ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. అమెరికాలో ఎక్కువ మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మవుతున్న అంశాల్లో మూడ‌వ‌ది… వైద్య‌ప‌రంగా జ‌రుగుతున్న త‌ప్పిదాలు, పొర‌బాట్లేన‌ని బ్రిటీష్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ ప్ర‌చురించింది. మెడిక‌ల్ ఎర్ర‌ర్ అనేది కూడా ఒక వ్యాధి అయితే ఎక్కువ‌మంది అమెరిక‌న్ల మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న వ్యాధుల లిస్టులో దీనికి మూడ‌వ స్థానం […]

మాయ రోగాల‌ను మించి పోతున్న మెడిక‌ల్ ఎర్ర‌ర్‌!
X

ఇది నిజంగా విచిత్ర‌మే…మ‌న దేశంలోని ధ‌న‌వంతులు అమెరికా వైద్యాన్ని అల్టిమేట్‌గా భావించి అక్క‌డ చికిత్స తీసుకుంటుంటారు. అయితే అక్క‌డ పేషంట్ల ప‌ట్ల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల విష‌యంలో ఎంత నిర్ల‌క్ష్యం ఉందో ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. అమెరికాలో ఎక్కువ మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మవుతున్న అంశాల్లో మూడ‌వ‌ది… వైద్య‌ప‌రంగా జ‌రుగుతున్న త‌ప్పిదాలు, పొర‌బాట్లేన‌ని బ్రిటీష్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ ప్ర‌చురించింది. మెడిక‌ల్ ఎర్ర‌ర్ అనేది కూడా ఒక వ్యాధి అయితే ఎక్కువ‌మంది అమెరిక‌న్ల మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న వ్యాధుల లిస్టులో దీనికి మూడ‌వ స్థానం ద‌క్కేదని ఆ ప‌త్రిక వెల్ల‌డించింది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్శిటీ బృందం ఈ విష‌యంపై అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించింది. వైద్య‌ప‌ర‌మైన త‌ప్పిదాలు పేషంట్ల ప్రాణాలు తీయ‌డంపై నిర్వ‌హించిన ఈ అధ్య‌య‌నంలో అమెరికాలో గుండె జ‌బ్బుల కార‌ణంగా ఏటా 6.11 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణిస్తుండ‌గా, 5.85ల‌క్ష‌ల మంది క్యాన్స‌ర్ కార‌ణంగా చ‌నిపోతున్నార‌ని, ఈ వ‌రుస‌తో వైద్య‌ప‌ర‌మైన పొర‌బాట్ల కార‌ణంగా 2.51 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది.

ఐసియులో ప‌రిస్థితి విషమించిన పేషంటుకి ఇవ్వాల్సిన ఇంజ‌క్ష‌న్ విష‌యంలో న‌ర్సులు ఒక్క క్ష‌ణం అయోమ‌యానికి గుర‌యినా ప్రాణాలు పోయే పొర‌బాబు జ‌రిగిపోతుంద‌ని డాక్ట‌ర్ నిఖిల్ డాట‌ర్ అనే ముంబ‌యి వైద్య కార్య‌క‌ర్త అంటున్నారు. ఏ అర్థ‌రాత్రో అత్య‌వ‌స‌రంగా ఇంజ‌క్ష‌న్ చేయాల్సి వ‌స్తే ఒకేలా ఉన్న, ఒకేలాంటి పేర్లు ఉన్న ఇంజ‌క్ష‌న్ల‌లోంచి స‌రైన‌దాన్ని ఎంపిక చేయ‌టంలో న‌ర్సులు పొర‌బాటు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఇలాంటి పొర‌బాట్లు జ‌ర‌గ‌కుండా పేషంటు భ‌ద్ర‌త కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల విష‌యంలో మ‌నం దృష్టి పెట్ట‌టం లేద‌ని ఆయ‌న అంటున్నారు. ముంబ‌యిలో ఇదే విష‌యంమీద ప‌నిచేస్తున్న నిఖిల్‌, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న లెక్క‌ల ప్ర‌కారం ఆసుప‌త్రిలో చేరుతున్న ప్ర‌తిప‌దిమందిలో ఒక‌రు మెడిక‌ల్ ఎర్ర‌ర్ ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నార‌ని, ప్ర‌తి మూడువంద‌ల‌మందిలో ఒక‌రు మ‌ర‌ణిస్తున్నార‌ని తేలిందని పేర్కొన్నారు. యూర‌ప్ దేశాల్లో ఆసుప‌త్రిలో చేరిన రోగుల విష‌యంలో 8 నుండి 10 శాతం వ‌ర‌కు మెడిక‌ల్ ఎర్ర‌ర్స్, ఆసుప‌త్రిలో స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం అనే త‌ప్పిదాలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ‌ణాంకాలు చెబుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.

పేషంట్ల ర‌క్ష‌ణ విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, అవ‌గాహ‌న‌పై ఎవ‌రూ పెద్ద‌గా స్పందించ‌డం లేద‌ని డాక్ట‌ర్ నిఖిల్ అంటున్నారు. వైద్య‌ప‌ర‌మైన పొర‌బాట్లు, త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దృష్టి పెట్ట‌కుండా, పేషంటు మ‌ర‌ణించిన సంద‌ర్భాల్లో కేవ‌లం డాక్ట‌ర్ల‌ను, వైద్య వ్య‌వ‌స్థ‌ను తిట్టుకోవ‌టం మాత్ర‌మే జ‌రుగుతోంద‌ని ఆయ‌న అన్నారు. బ్రిటీష్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ అధ్య‌య‌నంలో గ‌మ‌నించిన మ‌రొక విష‌యం, మెడిక‌ల్ ఎర్ర‌ర్ కార‌ణంగా మ‌ర‌ణిస్తే ఆ విష‌యాన్ని డెత్ స‌ర్టిఫికెట్‌లో పేర్కొన‌క‌పోవ‌డం. న‌యం కాగ‌ల వ్యాధే అయినా, పేషంటుకి స‌రైన కేర్ లేక‌పోవ‌డం వ‌ల‌న అది మ‌ర‌ణానికి దారితీసిందా…అనే విష‌యాన్ని సైతం డెత్ స‌ర్టిఫికెట్‌లో పేర్కొనాల్సి ఉంటుంద‌ని ఈ అధ్య‌య‌న నిర్వాహ‌కులు చెబుతున్నారు. మెడిక‌ల్ ఎర్ర‌ర్ల విష‌యంలో మ‌న‌దేశం కూడా త‌క్కువేమీ కాదు, భార‌త్‌లో జ‌రుగుతున్న ఇలాంటి పొర‌బాట్ల‌పై 2013లో హార్వ‌ర్డ్ యూనివ‌ర్శ‌టీ ఒక అధ్య‌యనం నిర్వ‌హించింది. అందులో భార‌త్‌లో ఏటా వైద్య‌ప‌ర‌మైన త‌ప్పుల వ‌ల‌న 52 ల‌క్ష‌ల గాయాలు, ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని తేలింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 430 ల‌క్ష‌లుగా ఉంది.

First Published:  4 May 2016 11:30 PM GMT
Next Story