సుప్రీమ్ సినిమా రివ్యూ

రేటింగ్: 2.25/5
తారాగణం:
  సాయి థరమ్ తేజ, రాశీ ఖన్నా, రవి కిషన్
దర్శకత్వం:  అనీల్ రావిపూడి
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాత:  దిల్ రాజు
విడుదల తేదీ: మే 5, 2016

పటాస్‌తో విజయం సాధించిన అనిల్‌ రావి పూడి, సుప్రీమ్‌తో ఒక్క అడుగు వెనక్కి వేశాడు. దీనికి కారణం కథ వెంట వెళ్ళకుండా సాయిధరంతేజా హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయడానికి ప్రయత్నించడమే. యాక్షన్‌ హీరోలు, మాస్‌ హీరోలు కావాలంటే ఫైట్లు చేస్తే చాలదు. కథతో మనల్ని కనెక్ట్‌ చేయాలి. చిరంజీవి మెగాస్టార్‌ కావడం వెనుకున్న ఫార్ములా ఇదే. సాయిధరంతేజా దీన్ని అర్థం చేసుకోవాలి. సుప్రీమ్‌ అని టైటిల్స్‌లో వేసుకుంటే సుప్రీమ్‌ అయిపోడు.

ఈ సినిమా కథేమిటంటే అనంతపురంలో జాగృతి అనే ట్రస్ట్‌ వుంటుంది. దాన్ని నమ్ముకుని వేలమంది పేదరైతులు జీవిస్తూవుంటారు. ఈ భూములపై సర్కార్‌ అనే విలన్‌ కన్నుపడుతుంది. అయితే ఆ భూములు ఒక రాజాగారివి. ఆ వారసున్ని ప్రవేశపెట్టి, డాక్యుమెంట్లు సమర్పిస్తే ఆ భూముల్ని రైతులకి అప్పజెపుతామని కోర్టు చెబుతుంది. నెలరోజుల్లోగా వారసున్ని వెతకాలి. ఈ పాతచింతకాయ పచ్చడి లైన్‌తో సినిమా వోపన్‌ కావడమే దీనికి మైనస్‌.

సహజంగానే ఆ వారసుడు హీరో అయివుంటాడని మనం వూహిస్తాం. దీనికి తోడు హీరో తండ్రి రాజేంద్రప్రసాద్‌ తన గతాన్ని తలుచుకుని తాగుతూవుంటాడు. అయితే వున్నట్టుండి కథలోకి ఒక చిన్న పిల్లవాడు ఎంటరవుతాడు. ఆ కుర్రాడే వారసుడని ఇంటర్వెల్‌లో తెలుస్తుంది. కిడ్నాపైన కుర్రవాన్ని రక్షించి కోర్టుముందు చూపడమే మిగిలిన కథ.

మూల కథ ఇదయితే ఈ సినిమాలో అనేక ఎపిసోడ్స్‌ వున్నాయి. ఇవేమి కథకి పనికిరాకుండా నవ్వించడానికి ప్రయత్నిస్తూవుంటాయి. దాంతో తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు తయారైంది. దర్శకుడు ప్రతిభావంతుడేనని అక్కడక్కడ మనకు తెలుస్తూ వుంటుంది. కానీ పసివాడి ప్రాణం, బజ్‌రంగి బాయ్‌ జాన్‌లాగా కథ మనల్ని హత్తుకోదు. దీనికి కారణం కథలో ఎపిసోడ్స్‌ ఎక్కువైపోవడం.

హీరోయిన్ రాశిఖన్నా ఒక ఎస్‌.ఐ. లంచమిచ్చి ఉద్యోగం తెచ్చుకుని వుంటుంది. కాబట్టి ఆమె లంచాలు తీసుకోవాలని తండ్రి రఘుబాబు కోరిక. హీరోయిన్‌ ఇంట్లో బోలెడు మంది వుంటారు. హీరోయిన్‌కి ఎలాంటి ప్రాధాన్యతలేదని కాసేపటికే అర్థమవుతుంది.

ప్రభాస్‌ శీను, పృథ్వి ఇద్దరు కార్ల దొంగలు. వాలెట్‌ పార్కింగ్‌ పేరుతో కార్లు కొట్టేస్తూవుంటారు. కథకి అవసరమైనపుడు వస్తూ వుంటారు. శ్రీనివాసరెడ్డి, పోసాని సన్నాయి కళాకారులు. సెకెండాఫ్‌లో వీళ్ళు హీరో కారు ఎక్కి కథలోకి ఎంటరవుతారు. విలన్‌ అసిస్టెంట్‌ది ఇంకో కామెడీ. జయప్రకాశ్‌రెడ్డి ఆలీది వేర్వేరు ఎపిసోడ్స్‌.

రాజేశ్‌, వెన్నెలకిషోర్‌ వాళ్ళదో ట్రాక్‌. ఇన్ని కామెడీ ట్రాక్‌లున్నా కథ ఒక స్ట్రెయిట్‌ లైన్‌లో నడవకపోవడమే ఇబ్బంది. రాజేంద్రప్రసాద్‌, సాయికుమార్‌ ఇద్దరు పెద్ద నటులున్నా వాళ్ళని సరిగా ఉపయోగించుకోలేదు.

కథపైన బోలెడంత వర్క్‌జరిగినట్టు తెలుస్తూవుంది కానీ అది స్క్రీన్‌పై పండలేదు. సాయిధరమ్‌ తేజాలో ఎనర్జీవుందికానీ నటన చాలా మెరుగుపడాలి.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ చాలా బావున్నాడు. అశోక్ సినిమాలో హీరోకి కళింగ దేశ వారసుడు యువరాకుమారుడు ఎదురవుతాడు. షారూక్‌ఖాన్‌కి, ఆ కుర్రాడికి మధ్య ఎమోషన్‌ బాగా పండింది. దీంట్లో అదిలేదు. అనేక విషయాలు కథకి అతికించడం వల్ల జరిగిన నష్టమిది.

మామూలుగా ఆరు పాటలు కాకుండా ఐదుపాటలే వున్నాయి. అయినా దాదాపు రెండున్నర గంటలు నిడివి వుంది. ఇది అనవసరం. చివర్లో వున్న వికలాంగులఫైట్‌ బావుంది. డైలాగులు అక్కడక్కడ పేలాయి. విస్తర్లో ఎక్కువ పదార్ధాలు వున్నా – గందరగోళపడి అర్ధాకలితోనే లేస్తాం.

రొటీన్‌ కథని ఎంచుకున్నపుడు కథని కొత్తగా చెప్పాలి. పాతకథని పాతగానే చెబితే కుదరదు. ప్రేక్షకులు తెలివిమీరి పోయారు. ఈ సినిమాలో హీరోకి హారన్‌ కొడితే నచ్చదు. మరి ఇన్ని ఫైట్లుపెట్టి జనాన్ని చావబాదడం న్యాయమా?

– జి ఆర్‌. మహర్షి