Telugu Global
Cinema & Entertainment

'24' మూవీ రివ్యూ

టైటిల్ : 24 జానర్ : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తారాగణం : సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్, శరణ్య సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : విక్రమ్ కె కుమార్ నిర్మాత : 2డి ఎంటర్టైన్మెంట్స్ రేటింగ్- 2. 5 కాలం అనే పదం ఎప్పుడూ ప్రశ్నార్ధకమే. జరిగిపోయిన క్షణాన్ని వెనక్కితీసుకురాలేం. జరగబోయే క్షణాన్ని ఊహించలేం. వర్తమానం మాత్రమే వాస్తవం. అయితే గతాన్ని తలచుకొని బాధపడుతూ, భవిష్యత్తు గురించి ఆశపడుతూ వర్తమానాన్ని విస్మరించే వాళ్ళే […]

24 మూవీ రివ్యూ
X

టైటిల్ : 24
జానర్ : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
తారాగణం : సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్, శరణ్య
సంగీతం : ఏఆర్ రెహమాన్
దర్శకత్వం : విక్రమ్ కె కుమార్
నిర్మాత : 2డి ఎంటర్టైన్మెంట్స్

రేటింగ్- 2. 5

కాలం అనే పదం ఎప్పుడూ ప్రశ్నార్ధకమే. జరిగిపోయిన క్షణాన్ని వెనక్కితీసుకురాలేం. జరగబోయే క్షణాన్ని ఊహించలేం. వర్తమానం మాత్రమే వాస్తవం. అయితే గతాన్ని తలచుకొని బాధపడుతూ, భవిష్యత్తు గురించి ఆశపడుతూ వర్తమానాన్ని విస్మరించే వాళ్ళే ఎక్కువుంటారు. కాలం మర్మం తెలుసుకోవాలని మనిషి ఎప్పుడునుంచో ప్రయత్నిస్తున్నాడు. వేల ఏళ్ళక్రితమే కాలాన్ని లెక్కించడం తెలుసుకున్నాడు. తరువాత గడియారాన్ని కనిపెట్టాడు. కాలాన్ని తమచేతిలోకి తీసుకోవాలని రచయితలు, కళాకారులు కలలుగన్నారు. హెచ్.జీ.వేల్స్ టైంమిషన్ నవలనే రాసాడు.

మనిషి అత్యంతవేగంగా ప్రయాణించగలిగితే సూక్ష్మరూపాన్ని పొంది కాలంలోకి వెళ్ళగలడని కొందరి ఊహ. కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళగలమా ? తీసుకెళితే గాంధీజీ, మధర్ ధెరిసా బతికొస్తారు. వాళ్ళతోపాటు హిట్లర్ కూడా బతుకుతాడు.గ‌డియారం ఒక అద్భుత‌మైన క‌ళాకృతి, గ‌డియారాలు ఎన్నో సైజుల్లో ఉంటాయి. ఎన్నో డిజైన్స్‌లో ఉంటాయి. గ‌డియారాలు చేయ‌డంలో నిష్టాతుడైన ఒక మేధావి ఒక‌సారి త‌ప్పుచేస్తాడు. ఆయ‌న త‌యారు చేసిన గ‌డియారంలో ముళ్లు వెన‌క్కు వెళుతున్నాయ‌ట‌. ఇదేమిట‌య్యా అని ఆయ‌న్ని అడిగితే కాలం వెన‌క్కివెళితే యుద్ధంలో చ‌నిపోయిన త‌న బిడ్డ బ‌తికొస్తాడ‌ని ఆశ‌ప‌డ్డాను అన్నాడ‌ట‌.

టైమ్ మిషిన్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. చ‌నిపోయిన ప్రియురాలిని బ‌తికించుకోవ‌డానికి కాలాన్ని వెన‌క్కు తిప్పుతాడు. కానీ ఆమె మ‌ర‌ణం ఆగ‌దు. అత‌నికి తెలియ‌ని ఇంకో రూపంలో వ‌స్తుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే 24 సినిమా గురించి చెప్ప‌డానికి విక్రం కె కుమార్‌కి కాలాన్ని వెన‌క్కి తీసుకెళ్లాల‌ని కోరిక‌. మ‌నం సినిమాలో ఈ లక్ష‌ణాలు క‌నిపిస్తాయి. అది జ‌న్మ‌ల‌బంధం క‌థ అయిన‌ప్ప‌టికీ కాలంతో సంబంధముంటుంది. ఒక సంఘ‌ట‌న జ‌రిగితే అనేక సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి. ఒక‌దాన్ని ఆప‌గ‌లిగితే చాలా వాటికి ఆప‌వ‌చ్చు.

ఈ విక్రం ఈసారి టైం మిష‌న్‌తో ఫాంట‌సీ కథ‌ని తీశాడు. సూర్య ఏకంగా మూడు ప్రాత‌ల్లో న‌టించాడు. అయితే ద‌ర్శ‌కుడికి మొక్క‌ల గురించి విప‌రీతంగా ఇష్ట‌ముండొచ్చు. అంత మాత్రాన మొక్క‌ల‌పై సినిమాలేస్తే అది బోట‌నీ డాక్యుమెంటరీ అవుతుంది. ఈ 24 సినిమా కూడా డాక్యుమెంట‌రీ ఎక్కువ , ఫీచ‌ర్ ఫిల్మ్ కి త‌క్కువ అన్న‌ట్టుంది.

క‌థ‌లోకి వెళితే 1990లో సూర్య రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తూ ఒక వాచీని క‌నిపెడుతాడు. ఆ వాచీ ఉప‌యోగ‌మేంటి అనేది మ‌న‌కి 40 నిమిషాల సినిమా అయిపోయిన త‌రువాత తెలుస్తుంది. అన్ని సినిమాల్లోలాగే విల‌న్ ఆ వాచీ కోసం వ‌స్తాడు. అయితే ఇక్క‌డ విల‌న్ కూడా సూర్య‌నే. త‌మ్ముడిని త‌మ్ముడి భార్య‌ని చంపేస్తాడు. త‌మ్ముడి కొడుకు త‌ప్పించుకుంటాడు. 26 ఏళ్ల త‌రువాత అత‌ను కూడా సూర్య‌నే. తండ్రి క‌నిపెట్టిన వాచీకి ఒక కీ ఉంటుంది. అది ఒక రోజు సూర్య‌కి దొరుకుతుంది. త‌న ద‌గ్గ‌ర ఉన్న‌ది టైం మిష‌న్ అని అత‌నికి తెలుస్తుంది. దాన్ని ఏం చేసుకోవాలో తెలియ‌క హీరోయిన్‌ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఉంటాడు. (బాబా సినిమాలో ర‌జ‌నీకాంత్ త‌న వ‌రాల‌ని వేస్ట్ చేసిన‌ట్టు). ఒక రోజు విల‌న్ సూర్య‌కి టైంమిష‌న్ ఎక్క‌డుందో తెలిసిపోతుంది. అయితే ఆ మిష‌న్ వ‌ల్ల 24 గంట‌లు మాత్ర‌మే ముందుకి వెన‌క్కి వెళ్ల‌గ‌లం త‌ప్ప‌, మ‌న య‌వ్వ‌నంలోకి వెళ్ల‌లేమ‌ని విల‌న్‌కి అర్థ‌మై ఆయ‌న ఒక మాస్ట‌ర్ ప్లాన్ వేస్తాడు. తానే హీరో తండ్రిన‌ని న‌మ్మిస్తాడు. ఇలా క‌థ జ‌రుగుతుంటే ప్రేక్ష‌కులు ఆవ‌లిస్తూ ఒళ్లు విరుచుకుంటూ వాట్సాప్ మేసేజ్‌లు చూసుకుంటూ ఉండారు.

దీనికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం. ఆయ‌న శ్ర‌మంతా వేస్ట్. ద‌ర్శ‌కుడికి పైత్యం ఉంటే, అది ఆయ‌న స్వంత విష‌యం. కానీ కోట్లు ఖ‌ర్చుపెట్టి జ‌నాల్ని చావ‌బాద‌డం ఎందుకు. ఈ సినిమా ప్ర‌త్యేక‌త ఏమంటే టైం మిష‌న్ పేరుతో ఒకే స‌న్నివేశం పదేప‌దే వ‌స్తూ ఉంటుంది. అందుకే రెండు గంట‌ల 42 నిమిషాల నిడివి. ద‌ర్శ‌కుడు త‌న టైం మిష‌న్లో ఒకేసారి వెన‌క్కి వెళ్లి లెంగ్త్ చెక్ చేసుకుని ఉంటే కాస్త జాగ్ర‌త్త ప‌డేవాడు. సమంతా చాలాసార్లు బిక్క మొహంతో ఆశ్చ‌ర్యంగా చూస్తూ ఉంటుంది. నిజానికి ప్రేక్ష‌కుల‌కే కాదు, న‌టించేట‌ప్పుడు స‌మంతాకి కూడా ఈ క‌థ అర్థ‌మై ఉండ‌దు. నాలుగు గంట‌ల సేపు ఈ ద‌ర్శ‌కుడు క‌థ చెబితే హీరో సూర్య క‌ద‌ల‌కుండా విన్నాడ‌ట‌. అంత‌సేపు సినిమా వేసి ఉంటే థియేట‌ర్ బ‌య‌ట అంబులెన్స్‌లు వ‌చ్చి ఉండేవి.

అన్నీతానై సూర్య మోసినా ఈ సినిమా నిల‌బ‌డ‌దు. మేధావిత‌నం ఎక్కువైనా ప్ర‌మాద‌మే. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూసిన అనుభూతిని కోరుకునే వారు దీన్ని చూడ‌వ‌చ్చు. ఈ సినిమాలోని పాజిటివ్ అంశం ఏమంటే మ‌నం వాచ్ మెకానిక్‌లుగా మారితే ఏదో ఒక రోజు టైం మిష‌న్‌ని త‌యారు చేసే స్థాయికి ఎదుగుతామ‌ని డైరెక్ట‌ర్ త‌న‌కు తెలియ‌కుండానే ఒక మేసేజ్ ఇచ్చాడు.

First Published:  6 May 2016 7:15 AM GMT
Next Story