బోసిపోయిన ఇల్లులా…అమ్మ జీవితం ఖాళీ కాకూడ‌దు!

అమ్మ అనే హోదా మ‌హిళ‌లంద‌రికీ ఒక కామ‌న్‌ ఐడింటిటి…ఇది ఇదివ‌ర‌కటి రోజుల సంగ‌తి. ఇప్పుడు ప్రతి అమ్మ‌కు ప్ర‌త్యేక ఒక ఐడింటిటి ఉంటోంది. అమ్మ అంటే… పిల్ల‌ల‌ను విప‌రీతంగా ప్రేమించే మాతృమూర్తి అనే నిర్వ‌చ‌నమే మ‌నం చెప్పుకుంటాం. కానీ ఇప్ప‌టి అమ్మ‌లు పిల్ల‌ల‌తో పాటు త‌మ‌నితాము కూడా ప్రేమించుకుంటున్నారు. ఇది ఒక అవ‌స‌రం కూడా. ప‌ద్దెనిమిది…పాతిక‌, ముప్ప‌యి, న‌ల‌భై, యాభై…ఈ అన్ని వ‌య‌సుల్లోనూ అమ్మ‌లుంటారు. ఇర‌వై ఏళ్ల అమ్మ ఆలోచ‌న‌లు, అర‌వై ఏళ్ల అమ్మ ఆలోచ‌న‌లు ఒక‌టిగా ఉండ‌క‌పోవ‌చ్చు. ఏ వ‌య‌సులో అయినా పిల్ల‌ల ప‌ట్ల త‌ల్లి చూపించే ప్రేమ ఒకేలా ఉండ‌వ‌చ్చు. కానీ ఆమె కూడా మ‌నిషి. ఒక నిండు జీవితం ఈ భూమ్మీద నిల‌బ‌డి, సాగాలంటే… ఇత‌రుల‌కు ఆమె పంచే ప్రేమ‌తో పాటు, ఆమెపైన‌ ఆమె కూడా ప్రేమ‌ని పెంచుకోవాలి. ఇది అత్య‌వ‌స‌రం…అమ్మ‌కీ అవ‌స‌రం.

అమ్మ‌కు త‌న జీవిత‌మంతా పిల్ల‌లే మొద‌టి ప్రాధాన్య‌త‌గా మిగ‌లాల‌ని మ‌నం భావిస్తుంటాం. అదొక స్వార్థం. అవ‌స‌రాన్ని బ‌ట్టి, అవ‌స‌ర‌మైనంత వ‌ర‌కు ప్రేమ, బాధ్య‌త చూపించి…త‌రువాత నా గురించి నేను కూడా కాస్త ఆలోచించుకుంటాను… అని ఏ అమ్మ అయినా అంటే… మ‌నం త‌ట్టుకోలేము. అందుకే బ‌య‌టి ప్ర‌పంచంలో విజ‌యాలు సాధించే అమ్మ‌లు చాలామంది ఏ స్థాయికి వెళ్లినా, పిల్ల‌ల‌ను పూర్తిస్థాయిలో చూసుకోలేక‌పోతున్నామ‌నే అప‌రాధ‌భావ‌న‌కు గుర‌వుతుంటారు. కానీ అమ్మ‌..బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌హిళ‌గా బాధ్య‌త‌లు మోస్తున్న కాలమిది. అందుకే బాధ్య‌త‌లు మోస్తూ కూడా అప‌రాధ‌భావ‌న‌కు గుర‌వ‌టం అమ్మ‌లు మానేయాలి. మ‌నం నిజంగా అమ్మ మేలు కూడా కోరేవాళ్ల‌మయితే ఆమె, పిల్ల‌ల‌ను ప్రేమించినంత స్థాయిలో త‌న‌ని తాను కూడా ప్రేమించుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకోవాలి. ఎంతో ప్రేమ‌తో, ప్రాణాల‌ను మొత్తం పెట్టి పెంచిన పిల్ల‌లు, త‌మ జీవితాల్లోకి వెళ్లిపోయాక‌, అమ్మ జీవితం ఖాళీ అయిపోతుంది. అప్ప‌టికీ ఆమె, బిడ్డ త‌న‌కు ఎంత దూరంలో ఉన్నా త‌న క‌ళ్ల‌ముందు ఉన్న‌ట్టుగానే ప్రేమిస్తుంటుంది. ఆమె జీవితంలో వాళ్లున్నా, వారి జీవితంలో ఆమె ఉండ‌దు. ఇది ఒక వాస్త‌వం. ప్ర‌పంచంలో త‌ల్లులంతా అనుభ‌విస్తున్న‌దే.

పిల్ల‌ల‌ను మాత్ర‌మే ప్రేమించిన అమ్మ అయితే…వారు త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని బాధ‌ప‌డుతుంది… నిందించ‌వ‌చ్చు కూడా. కానీ త‌న‌ని తాను కూడా ప్రేమించుకునే అమ్మ అయితే… వారి నిర్ల‌క్ష్యాన్ని త‌ట్టుకుంటుంది. అది వారి జీవితం… ఇది త‌న జీవితం అనే వాస్త‌వాన్ని అర్థం చేసుకుంటుంది. ఎంత గొప్ప ప్రేమ‌క‌యినా ప‌రిమితులు ఉంటాయ‌ని… ప్రేమ‌లు కాలానుగుణంగా ప‌రిణామం చెందుతాయ‌ని అర్థం చేసుకుంటుంది. ఇప్ప‌టి అమ్మ‌లు… పిల్ల‌లకు ఆకాశ‌మంత ప్రేమ‌ని పంచామే… వారు ఇప్పుడు త‌మ‌ని ప‌ట్టించుకోవ‌టం లేదే అని… ఒక్కక‌న్నీటి బొట్టు కూడా కార్చ‌నంత ఎత్తులో ఉండాలి… పిల్ల‌ల‌కు ప్రేమ‌ని పంచుతున్న కొద్దీ గుండె ఖాళీ అయిపోయిన ఫీలింగ్‌తో కాకుండా గుండె నిండుతున్న ఫీలింగ్‌తో ఉండాలి…. పిల్ల‌లు చ‌దువు, ఉద్యోగాలు, పెళ్లిళ్ల వ‌ల‌న బ‌య‌ట‌కు వెళ్లిపోయాక బోసిపోయిన ఇల్లులా… అమ్మ మ‌న‌సు కూడా అలా బోసిపోయిన‌ట్టుగా మార‌కూడ‌దు. ఇక నా జీవితం ఏంటి అనే ప్ర‌శ్న రాకూడ‌దు… ఆమెకి త‌న నిండు జీవితాన్ని ఏం చేసుకోవాలో తెలియ‌ని స్థితి రాకూడ‌దు…. క‌ళ్ల‌లో పెట్టుకుని పెంచిన పిల్ల‌ల బొమ్మ అక్క‌డ స్ప‌ష్టంగా ఉండాలి… అందుకే అమ్మ క‌న్నీళ్లు కార్చ‌కూడ‌దు. ప‌సిత‌నాన్ని ప‌దిలంగా పెంచిన అమ్మ‌… అంత జాగ్ర‌త్త‌ని, శ్ర‌ద్ధ‌నీ త‌నమీద తాను చూపించుకుని గుండెల‌నిండుగా న‌వ్వాలి. పిల్ల‌లు ఎప్పుడు క‌ళ్ల‌ముందుకు వ‌చ్చినా, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, అన్‌కండిష‌న‌ల్‌గా వారిని ప్రేమించాలి. అమ్మ‌లు త‌మ పిల్ల‌ల‌కు పంచే ప్రేమ నిజంగా స‌ముద్ర‌మంత‌టిది. స‌ముద్రం ఎప్ప‌టికీ ఖాళీ అవ‌దు…ఏ పిల్ల‌కాలువ‌లూ దాన్ని నింప‌లేవు. అమ్మ బేల‌గా… బ‌ల‌హీనంగా…ఎవ‌రికోస‌మో ఎదురుచూపులు చూస్తూ…క‌డిగి బోర్లించేసిన గిన్నెలా ఎప్ప‌టికీ మార‌కూడ‌దు.

ఆకాశ‌మంత ప్రేమ‌కు ఎప్ప‌టికీ నేనే శాశ్వ‌త చిరునామా అని అమ్మ గ‌ట్టిగా చెప్పాలి….అమ్మ…ఎప్పుడూ అక్క‌డ ఉండాలి…ఎక్క‌డ అంటే…ఆమె ప్రేమించాలి అంతే… ప్రేమ‌ని దేబిరించ‌కూడ‌దు… అందుకే ఈ మాతృదినోత్స‌వాన‌… అమ్మ‌ల‌కు ఓ గ్రీటింగ్ కార్డు కొనిచ్చి, ఓ కేక్ క‌ట్ చేసి… కాస్త ప్రేమించండి అని…. పిల్ల‌ల‌కు చెప్ప‌టం కాదు…. మిమ్మ‌ల్ని మీరు ప్రేమించుకోండి… మీరు ఈ ప్ర‌పంచానికి ఎప్ప‌టికీ ప్రేమ‌దాతలే అని అమ్మ‌ల‌కే చెబుదాం. అణువంత రూపంలో త‌న క‌డుపులో ప‌డిన బిడ్డ‌కి నూరేళ్ల జీవితాన్ని సృష్టించి ఇచ్చిన అమ్మ‌కు….పిల్ల‌లు వెళ్లిపోయాక‌…నీ జీవితాన్ని నువ్వు పునః సృష్టి చేసుకోమ‌ని చెబుదాం…అమ్మా…నువ్వు మ‌ళ్లీ జ‌న్మించు…ఈసారి నువ్వే బిడ్డ‌వు…నువ్వే త‌ల్లివి!

-వ‌డ్ల‌మూడి దుర్గాంబ‌