కేటీఆర్ స‌వాలుకు ముందుకు రాని నేత‌లు!

కేటీఆర్‌కు, కాంగ్రెస్ నేత‌ల‌కు మ‌ధ్య సాగుతున్న మాట‌ల యుద్ధం ముదిరి పాకాన ప‌డింది. ఇవి రాజీనామాల వ‌ర‌కు వెళ్లడం రాజ‌కీయ వేడిని మ‌రింత పెంచాయి. ఈక్ర‌మంలోనే మంత్రి కేటీఆర్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాలేరు ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్ ఓడిపోతే.. త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ ఓడిపోతే.. టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఉత్త‌మ్ రాజీనామా చేస్తాడా? అని స‌వాలు విసిరాడు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జిగా పార్టీ అభ్య‌ర్థి గెలిచినా, ఓడినా తాను బాధ్య‌త వ‌హిస్తాన‌ని తెలిపారు. కారు పార్టీ ఓడిపోతే త‌న మంత్రి ప‌ద‌విని త్య‌జించి, ఉత్త ఎమ్మెల్యేగా మిగులుతాన‌ని ప్ర‌క‌టించారు. అదేస్థాయిలో చిత్త‌శుధ్ది ఉంటే ఉత్త‌మ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాడా? అని స‌వాలు విసిరారు. నైతిక‌త‌, మాన‌వ‌త్వం గురించి కాంగ్రెస్ మాట్లాడుతుండటం హాస్యాస్ప‌ద‌మ‌ని ఎద్దేవా చేశారు. గ‌తంలో మాజీ హోంమంత్రి మాధ‌వ‌రెడ్డి, ఎమ్మెల్యే ర‌జ‌బ్ అలీ చ‌నిపోయిన‌పుడు కాంగ్రెస్ పోటీ ఎందుకుపెట్టింద‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన రెండు ఉప ఎన్నిక‌ల్లోనూ ఎందుకు పోటీ చేశార‌ని కాంగ్రెస్‌ను నిల‌దీశారు.
గ్రేట‌ర్‌లోనూ ఇదే తీరు!
గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో 100 స్థానాలు గెలుచుకుని స‌త్తా చాటుతామ‌ని కేటీఆర్ అప్ప‌ట్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లేకుంటే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ స‌వాలుకు అన్ని పార్టీలు స్పందించాయి. టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయితే ఒక మాట ఎక్కువే అన్నారు. గ్రేట‌ర్‌లో టీఆర్ ఎస్  అన్ని స్థానాలను గెలిస్తే.. తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని గొప్ప‌ల‌కు పోయారు. సీపీఐ నేత నారాయ‌ణ అయితే, తాను ఒక చెవి కోసుకుంటాన‌ని ప్ర‌తిస‌వాలు విసిరారు. కానీ, అనూహ్యంగా గ్రేట‌ర్‌పై గులాబీ జెండా రెప‌రెప‌లాడ‌టంతో రేవంత్ రెడ్డి, నారాయ‌ణ‌లు తోక‌ముడిచారు. తాజాగా కేటీఆర్ చేసిన స‌వాలుకు ఉత్త‌మ్ తెలివిగా స్పందించారు.. కేటీఆర్ ఓ బచ్చా అని, ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. పాలేరు ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ బాధ్యత వహిస్తే సమాధానం చెబుతానని అన్నారు.