ఎమ్మెల్యే వీరేశం వీరంగం.. ఫోన్‌లో బెదిరింపులు!

తెలంగాణ రాష్ర్ట స‌మితికి చెందిన మంత్రి జోగు రామ‌న్న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైన విష‌యం మ‌రువ‌క‌ముందే.. ఆ పార్టీకి చెందిన మ‌రో నేత చిక్కుల్లో ప‌డ్డారు. న‌ల్ల‌గొండ జిల్లా న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఓ కాలేజీ యాజ‌మాన్యాన్నిబెదిరించిన‌ట్లుగా చెబుతున్న ఆడియో టేపుల సంభాష‌ణ‌ను ఓ టెలివిజ‌న్ ప్ర‌సారం చేయ‌డం తీవ్ర సంచ‌ల‌నాన్ని రేపింది. ఇప్ప‌టిదాకా అధికార పార్టీ నేత‌ల‌పై ఎలాంటి ఆరోప‌ణ‌లు రాలేదు. వ‌రుస‌గా నేత‌లపై ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌టంతో అధిష్టానం వీరంద‌రిపై గుర్రుగా ఉంది. అస‌లే పాలేరు ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుని విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోన్న పార్టీ పెద్ద‌ల‌కు గులాబీ నేత‌ల వీరంగం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.
అస‌లేం జ‌రిగింది..!
న‌కిరేక‌ల్ ప‌రిధిలో ఓ కళాశాల యాజ‌మానికి ఎమ్మెల్యే వేముల వీరేశం  ఫోన్ చేశాడు. ఓ పంచాయ‌తీ విష‌యంలో తాము చెప్పిన‌ట్లు వినాల‌ని బెదిరించాడు. కొడ‌తాన‌ని, చంపుతాన‌ని బెదిరించాడు. మొత్తం 3 సార్లు ఫోన్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. త‌న మాటంటే లెక్క‌లేదా? అంటూ ఫోన్‌లోనే వీరంగం వేశాడు. ఇప్పుడు ఈ ఆడియో టేపులు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ సంభాష‌ణ‌ను ఓ న్యూస్ చానల్ చేతికి చిక్కాయి. అంతే అది కాస్త టెలీకాస్ట్ కావ‌డంతో వీరేశం భాగోతం విశ్వ‌వ్యాప్త‌మైంది. ఇది గులాబీ పార్టీ పెద్ద‌ల‌కు తీవ్ర త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింది. మూడు ఆడియో సంభాష‌ణ‌లు ఇప్పుడు న‌ల్ల‌గొండ జిల్లాతోపాటు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రికీ షేర్ అవుతుండ‌టంతో పార్టీ నేత‌ల‌కు ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యాల‌పై ఇలా బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యావంతులు కోరుతున్నారు. ఇలా చేస్తే తాము విద్యా సంస్థ‌లు న‌డ‌ప‌లేమ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.