సంప‌త్‌పైనా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్ర‌యోగించారా?

ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ లో ఇప్పుడున్న యువ ఎమ్మెల్యేల్లో సంప‌త్ కుమార్ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వెన‌క‌బ‌డిన పాల‌మూరు జిల్లా ఆలంపూర్ నుంచి గెలిచిన యువ‌నాయ‌కుడు. గెలిచిన‌ప్ప‌టి నుంచి ప‌లు టీవీ చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లో కాంగ్రెస్ వాణిని విజ‌య‌వంతంగా వినిపిస్తూ వ‌స్తున్నాడు. దీంతో తెలంగాణ రాజ‌కీయాల్లో నెమ్మ‌దిగా ప్ర‌ముఖుడి అవ‌తార‌మెత్తుతున్నాడు. యువ‌కుడు, విద్యావంతుడు, అన్ని రంగాల‌పై అవ‌గాహ‌న ఉన్న నాయ‌కుడిగా చ‌క్క‌టి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇత‌నిపై గులాబీ పార్టీ కన్నేసిందా? అత‌న్ని కారెక్కించే ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టాయా? అంటే అవున‌నే అంటున్నారు.. సంప‌త్ కుమార్‌. 
తుమ్మిళ్ల కోసం పార్టీ మార‌మన్నారు..!
తాజాగా సంప‌త్ టీఆర్ ఎస్‌పై చేసిన ఆరోప‌ణ‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. త‌నను పార్టీ మారాలంటూ గులాబీపార్టీ ఒత్తిడి చేసిందంటూ ఆయ‌న వెల్ల‌డించ‌డంతో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. తుమ్మిళ్ల ఎత్తిపోత‌ల ప‌థ‌కం చేప‌ట్టాలంటే.. త‌న‌ను పార్టీ మారాల‌ని గులాబీ నేత‌లు ష‌ర‌తు పెట్టార‌ని ఆరోపించాడు. తాను ప‌ద‌వుల‌కు అమ్ముడుపోయేవాడిని కాన‌ని.. ఇలాంటి ప‌ప్పులు త‌న‌వ‌ద్ద ఉడ‌క‌వ‌ని తేల్చిచెప్పాడు. ఇటీవ‌ల పాల‌మూరు జిల్లా మ‌క్త‌ల్ ఎమ్మెల్యే చిట్టెం న‌ర‌సింహా రెడ్డి కారెక్కిన సంగ‌తి తెలిసిందే! ఆలంపూర్ ఎమ్మెల్యే సంప‌త్ కూడా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ గురించి ప్ర‌స్తావించ‌డం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చ‌ర్చ మ‌ళ్లీ మొద‌లైంది.