సీఎం ఆ కుర్చీలో కూర్చుంటారా?

అన‌గ‌న‌గా ఓ ఆర్డీఎస్‌ ప్రాజెక్టు గ‌ట్టు.. ఆ గ‌ట్టుపై ఓ కుర్చీ.. అది ఆషామాషీ కుర్చీ కాదు.. సీఎం గారి కోసం వేయించింది. సీఎం గారూ వ‌చ్చి కూర్చోండి అని ప్ర‌త్యేకంగా రాసి ఉంచారు. అదేంటి? సీఎం కుర్చీ క్యాంప్ ఆఫీస్‌లో ఉండాలి క‌దా! ఆర్డీఎస్ గ‌ట్టుపైకి ఎప్పుడు మారిందనుకుంటున్నారా?  వాస్త‌వానికి ఆ కుర్చీ సీఎం కోసం వేసిందే! కానీ, వేయించింది ప్ర‌భుత్వం కాదు.. ప్ర‌తిప‌క్షాలు. సోమ‌వారం ఆర్డీఎస్ వ‌ద్ద కాంగ్రెస్ ధ‌ర్నా చేప‌ట్టింది. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌లంతా మూకుమ్మ‌డిగా సీఎం కేసీఆర్‌పై మాట‌ల‌దాడి చేశారు. ఆర్డీఎస్ వ‌ద్ద కుర్చీ వేసుకుని కూర్చుండి మ‌రీ ప్రాజెక్టు పూర్తి చేస్తాన‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో కేసీఆర్ పాల‌మూరు ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌వుతున్నా.. ఆమాట‌లు అమ‌లుకు నోచుకోలేద‌ని కాంగ్రెస్ ఈ ధ‌ర్నా చేప‌ట్టింది. ఇందులో వినూత్నంగా నిర‌స‌న తెలపాల‌నుకుంది. అందుకే, సీఎం కోసం కుర్చీ త‌యారు చేసి గ‌ట్టుపై పెట్టారు. ఈ కుర్చీ సీఎం ఇచ్చిన హామీని ప్ర‌జ‌లకు నిరంతరం గుర్తుకు చేస్తూ ఉంటుందని అందుకే దీన్ని ఏర్పాటు చేశామని అస‌లు విష‌యం చెప్పారు.