ప‌ద‌కొండేళ్ల బాలిక‌…అంత‌పని చేసింది!

చిన్న‌పిల్ల‌ల్లో పెరిగిపోతున్న హింసా ప్ర‌వృత్తికి ఈ సంఘ‌ట‌న అద్దం ప‌డుతోంది. ఢిల్లీలోని రాజౌరీ ప్రాంతంలో 11ఏళ్ల బాలిక 71 సంవ‌త్స‌రాల వృద్ధురాలిపై దాడిచేసింది. ఆమెను ప‌లుర‌కాలుగా హింసించింది. బాలిక, దొంగ‌త‌నం  ప్ర‌య‌త్న‌మే చేసి ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. బుధ‌వారం నాలుగుగంటల స‌మయంలో బాలిక త‌న త‌ల్లి ప‌నిచేసే ఇంటికి వెళ్లింది. ఆ ఇంటి య‌జ‌మానురాలు సునీతా మేదాన్‌. చిన్న‌పిల్ల‌, అదీ కాకుండా రోజూ చూసే అమ్మాయే కావ‌టంతో ఆమెకు బాలిక ఎందుకు వ‌చ్చింద‌నే సందేహం రాలేదు. అయితే ఆమె చూస్తూ ఉండ‌గానే బాలిక బాధితురాలి కంట్లో పెప్ప‌ర్ పొడిని చ‌ల్లింది. దాంతో పాటు క‌త్తితో పొడిచింది. అక్క‌డే ఉన్న‌ పూల కుండీని ఆమెపై విసిరికొట్టింది. ఊహించ‌ని ప‌రిణామంతో తెల్ల‌బోయిన‌ సునీత,  పెద్ద‌గా కేక‌లు వేయ‌టంతో చుట్టుప‌క్క‌ల ఇళ్ల‌లోని వారు వ‌చ్చి ఆమెను కాపాడారు. బాలిక‌ని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. పోలీసులు ఆమెను పిల్లల సంస్క‌ర‌ణ కేంద్రానికి త‌ర‌లించారు. సునీతా మేదాన్‌ని ఆసుప‌త్రిలో చేర్పించారు. బాలిక వృద్ధురాలిని క‌త్తితో పొడ‌వ‌టం వెనుక ఉన్న కార‌ణం ఇంకా స్ప‌ష్టం కాలేద‌ని, అయితే, ఇంట్లో ఉన్న విలువైన వ‌స్తువుల‌ను దొంగ‌త‌నం చేయ‌డానికే ఆమె అలా చేసి ఉంటుంద‌ని భావిస్తున్నామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.