ర‌మ‌ణ కారెక్క‌డం లేదా?

తాను పార్టీ మారుతున్న‌ట్లుగా వ‌స్తోన్న ప్ర‌చారాన్ని తెలంగాణ తెలుగుదేశం అధ్య‌క్షుడు  ఎల్‌. ర‌మ‌ణ ఖండించారు. కొంత‌కాలంగా ర‌మ‌ణ తెలుగుదేశాన్ని వీడి.. అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో చేర‌తాడ‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే! ఈవార్త‌లు రెండురోజులుగా మ‌రింత ఎక్కువ‌వ‌డంతో తెలుగేదేశం పార్టీ నాయ‌కులను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేశాయి. దీనిపై ఎన్టీఆర్ ట్ర‌స్టు భ‌వ‌న్ నుంచి కీల‌క నేత‌లు ఎల్‌.ర‌మ‌ణ‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలిసింది. ఆయ‌న పార్టీ మారుతున్న‌ట్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆరాతీసిన‌ట్లు స‌మాచారం. అయితే, అదంతా ఉత్తి ప్ర‌చార‌మేన‌ని ర‌మ‌ణ కొట్టిపారేసార‌ని వినికిడి! ఎన్టీఆర్ ట్ర‌స్టు భ‌వ‌న్ సూచ‌న‌ల‌తోనే ఆయ‌న తాజాగా తాను పార్టీ మార‌డం లేదంటూ ప్రెస్ మీట్ పెట్టి ఆ విష‌యాన్ని ఖండించార‌ని తెలుస్తోంది. 
నిజ‌మేనా.. జాప్య‌మా?
తెలుగుదేశం తెలంగాణ అధ్య‌క్షుడు ర‌మ‌ణ తాను పార్టీ మార‌డం లేద‌ని ఇచ్చిన వివ‌ర‌ణ తాత్కాలిక‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇలా ఖండించిన‌వారంతా త‌రువాత‌కాలంలో కారెక్కడమే ఇందుకు కార‌ణం. ఇత‌ర పార్టీ నాయ‌కులను కారెక్కించ‌డంలో గులాబీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ‌పార్టీపై చంద్ర బాబు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసినపుడు, తెలంగాణ‌లో టీడీపీ బ‌హిరంగ స‌భ‌లు పెట్టిన ప్ర‌తిసారీ ఆ పార్టీ నుంచి ఒక్కో ఎమ్మెల్యేను కారెక్కిస్తున్నారు. ఇదంతా నేత‌ల‌తో ముందస్తుగా ట‌చ్‌లో ఉండ‌డంతోనే సాధ్య‌మ‌వుతోంది. ఇటీవ‌ల వైస్సార్ సీపీ తెలంగాణ అధ్య‌క్షుడు  పొంగులేటి శ్రీ‌నివాస రెడ్డి గులాబీ పార్టీలో మార‌తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై ఆఘ‌మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి ఖండ‌ఖండాలుగా ఖండించారు పొంగులేటి. కానీ, పాల‌మూరు ప్రాజెక్టుపై వైస్సార్ సీపీ ధ‌ర్నాకు దిగ‌డంతో వెంట‌నే పొంగులేటిని కారులోకి ఎక్కించుకున్నారు. అంటే, ఫిరాయింపులు కూడా తెలంగాణ కోస‌మే జ‌రుగుతున్న‌ట్లుగా ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అందుకే, ర‌మ‌ణ చేరిక‌లోనూ ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తున్నారా..?  లేక ర‌మ‌ణ పార్టీ మార‌తార‌న్న విష‌యమంతా వ‌దంతేనా అన్న‌ది త్వ‌ర‌లోనే తేలుతుంది.