Telugu Global
National

ప్ర‌పంచ సుంద‌ర రాజ‌ధాని నిర్మాణం...కార్మికుడి ప‌రిస్థితిలో మార్పులేదు!

తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ‌రు… అనే ప్ర‌శ్న‌ ఎప్ప‌టికీ చ‌రిత్ర‌గా మార‌దు…ఎందుకంటే నిత్యం ఎక్క‌డో ఒక చోట ఆ ప‌రిస్థితి క‌న‌బ‌డుతూనే ఉంటుంది.  సుంద‌ర నిర్మాణాలు భిన్నంగా ఉండ‌వచ్చు కానీ, వాటిని క‌ట్టే కార్మికుల జీవితాలు మాత్రం ఒకేలా ఉంటాయి. ప్ర‌పంచ సుంద‌ర రాజ‌ధాని అని పాల‌కులు చెబుతున్న అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంలో… ప‌నిచేస్తున్న కార్మికుల ప‌రిస్థితి మాత్రం సుంద‌రంగా లేదు. అత‌ను ప్ర‌పంచ కార్మికుడిలాగే ఉన్నాడు. రాజ‌ధాని ప‌నుల‌కోసం ఎల్ఎన్‌టి యాజ‌మాన్యం బీహార్ జార్ఖండ్ ఒరిస్సా […]

తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ‌రు… అనే ప్ర‌శ్న‌ ఎప్ప‌టికీ చ‌రిత్ర‌గా మార‌దు…ఎందుకంటే నిత్యం ఎక్క‌డో ఒక చోట ఆ ప‌రిస్థితి క‌న‌బ‌డుతూనే ఉంటుంది. సుంద‌ర నిర్మాణాలు భిన్నంగా ఉండ‌వచ్చు కానీ, వాటిని క‌ట్టే కార్మికుల జీవితాలు మాత్రం ఒకేలా ఉంటాయి. ప్ర‌పంచ సుంద‌ర రాజ‌ధాని అని పాల‌కులు చెబుతున్న అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంలో… ప‌నిచేస్తున్న కార్మికుల ప‌రిస్థితి మాత్రం సుంద‌రంగా లేదు. అత‌ను ప్ర‌పంచ కార్మికుడిలాగే ఉన్నాడు. రాజ‌ధాని ప‌నుల‌కోసం ఎల్ఎన్‌టి యాజ‌మాన్యం బీహార్ జార్ఖండ్ ఒరిస్సా త‌దిత‌ర రాష్ట్రాల‌నుండి కార్మికుల‌ను తీసుకువ‌చ్చింది. వీరంతా ముప్ప‌యి సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సున్న యువ‌తే. వెల‌గ‌పూడిలో స‌చివాల‌య నిర్మాణ ప‌నుల్లో ఉన్నవీరంతా క‌నీస మౌలిక వ‌స‌తులు కూడా అంద‌క దుర్బ‌ర ప‌రిస్థితుల మ‌ధ్య జీవిస్తున్నారు. వీరికి ఆహారం, మంచినీరు, వాడునీరు, మ‌రుగుదొడ్లు, నివాస వ‌స‌తి…ఇవేమీ స‌క్ర‌మంగా అంద‌టం లేదు. అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తాం…అన్ని రోజులు ప‌ని క‌ల్పిస్తాం…అంటే వ‌చ్చామ‌ని, కానీ ఇక్క‌డ‌కు వ‌చ్చాక తాము నానా బాధ‌లు ప‌డుతున్నామ‌ని కార్మికులు చెబుతున్నారు. ఒక్కసారి ప‌నిలోకి దిగాక ప‌న్నెండు గంట‌ల త‌రువాతే బ‌య‌ట‌కు రావాల్సి ఉంటుంద‌ని అంత క‌ష్ట‌ప‌డుతున్నా రోజు కూలి 240 నుండి 290 మ‌ధ్య‌లో మాత్ర‌మే ఉంటున్న‌ద‌ని, ప‌న్నెండు గంట‌ల నిరంత‌ర శ్ర‌మ‌తో త‌మ శ‌రీరాలు తీవ్రంగా అల‌సిపోతున్నాయ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రోజంతా క‌ష్ట‌ప‌డిన వారు రాత్రి విశ్రాంతి తీసుకునేది రేకుల షెడ్డుల్లో. ఆ షెడ్డుల్లో బ‌య‌టి ఎండ‌కంటే మూడురెట్లు ఎక్కువ వేడి ఉత్ప‌న్న‌మవుతున్న‌ద‌ని వారు వాపోతున్నారు. రేకుల షెడ్డుల‌కు స‌రైన భ‌ద్ర‌త లేక‌పోవ‌టం వ‌ల‌న వారు తయారు చేసుకున్న ఆహారం కుక్క‌ల పాల‌వుతోంది. వేలాది కార్మికులు ప‌నిచేస్తున్న ఈ ప్రాంతంలో ఒక్క మ‌రుగుదొడ్డి కూడా లేదు. రైతులు రాజ‌ధానికోసం ఇచ్చిన పొలా‌ల‌ను కార్మికులు మ‌రుగుదొడ్డిగా వాడుతున్నారు. ఇంత‌మంది కార్మికులు ప‌నిచేస్తున్నా వారికోసం ఒక్క వైద్య కేంద్ర‌మూ అక్క‌డ లేదు. ఈ ప్రాంతాన్ని బుధ‌వారం సంద‌ర్శించిన ఎమ్మెల్సీల బృందం ఈ విష‌యాల‌ను ప‌రిశీలించింది. ఒక్క వైద్య కేంద్ర‌మూ లేక‌పోవ‌డం పై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ వైద్య వ‌స‌తి క‌ల్పించాల‌ని డిమాండ్ చేసింది.

First Published:  12 May 2016 9:00 PM GMT
Next Story