క‌విత కోసం వారిని తొక్కేస్తున్నారా?

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కాంగ్రెస్ నేత‌లు ఆస‌క్తిక‌ర ఆరోప‌ణ‌లు చేశారు. మాజీ మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, సునీతా ల‌క్ష్మారెడ్డిలు ప్ర‌భుత్వానికి బ‌హిరంగ లేఖ రాశారు. ఇందులో కేసీఆర్ కూతురు అయిన క‌విత‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని, మిగిలిన‌వారిని ఎద‌గ‌నీయ‌డం లేద‌ని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక కూడా మ‌హిళ‌ల‌కు మంత్రివ‌ర్గంలో స్తానం ఇవ్వ‌క‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. దీనికితోడు నామినేటెడ్‌, ఎమ్మెల్సీ ప‌ద‌వుల్లోనూ మ‌హిళా నేత‌ల‌కు మొండిచేయ్యే మిగిలింద‌ని గుర్తు చేశారు. పార్టీలో మ‌రే ఇత‌ర మ‌హిళా నేత‌ను ఎద‌గ‌నీయ‌కుండా చేస్తోన్నార‌ని ఆరోపించారు. ఇదంతా కేసీఆర్ కూతురు కవిత కోస‌మే జ‌రుగుతోంద‌ని విమ‌ర్శించారు. క‌విత విష‌యంలో టీఆర్ ఎస్‌పై విమ‌ర్శ‌లు కొత్తేం కాదు. గ‌తంలో బీజేపీతో అంట‌కాగిన స‌మ‌యంలోనూ కేంద్రంలో క‌విత కోస‌మే బీజేపీతో చెలిమి చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.
మ‌హిళ‌ల‌కు ద‌క్క‌నిచోటు!
ఈ ఆరోప‌ణ‌లు తెలంగాణ ప్ర‌భుత్వానికి కొత్త కాదు. తెలంగాణ మంత్రివ‌ర్గం ఏర్ప‌డినప్ప‌టి నుంచి ఈ విమ‌ర్శ‌ల‌ను ప్ర‌భుత్వం ఎదుర్కొంటూనే ఉంది. అయితే, తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ప‌లువురి నేత‌ల భార్య‌ల‌కు ఎమ్మెల్యే, స్థానిక సంస్థ‌ల స్థానాల్లో టికెట్లు కేటాయించింది టీఆర్ ఎస్ పార్టీ. ఇవ‌న్నీ మొక్కుబ‌డి చ‌ర్య‌లుగానే మిగిలాయి త‌ప్ప‌. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భావం చూపే.. ప‌ద‌వులు కాక‌పోవ‌డంతో గులాబీపార్టీపై విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు. క‌నీసం మాతా శిశు సంక్షేమ శాఖ‌నైనా మ‌హిళ‌కు కేటాయించాల్సింది. ఈ శాఖ‌ను ఇత‌ర పార్టీ  నుంచి వ‌చ్చిన తుమ్మ‌ల‌కు కేటాయించ‌డంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌ద్మాదేవంద‌ర్ రెడ్డికి డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి మిన‌హా తెలంగాణ కేబినెట్‌లో మ‌హిళ‌లే లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక బుడిగె శోభ‌, కొండాసురేఖ లాంటి నేత‌లు ఉన్నా.. వారికి మ‌రోసారి జ‌రిగే విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం ఉంటుంద‌న్న ప్ర‌చారం ఉంది. మాది ఉద్య‌మ‌పార్టీ, ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేత‌లంద‌రికీ ప‌దవులు ఇవ్వ‌డం మా ధ‌ర్మం అని త‌మ‌నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించుకుంటున్నారు.  కాంగ్రెస్, ఇత‌ర పార్టీలు  చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌కు గులాబీ నేత‌లు ఇస్తోన్న వివ‌ర‌ణ సంతృప్తిక‌రంగా లేద‌న్న‌ది వాస్త‌వం. ఈసారి జ‌రిగే విస్త‌ర‌ణ‌లోనైనా మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం క‌ల్పించి త‌న‌పై వెల్లువెత్తుతోన్న విమ‌ర్శ‌లను త‌గ్గించుకుంటారా? అన్న‌ది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.