నాగం కాంగ్రెస్‌లో చేర‌డం లేదా?

బీజేపీ నాయ‌కుడు, మాజీమంత్రి నాగం జ‌నార్ద‌న్ రెడ్డి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఇంత‌కాలం ఆయ‌న పేరు ప్ర‌స్తావన‌కు వ‌స్తే… ఆయ‌న ఏపార్టీలో ఉన్నార‌న్న విష‌య‌మై చ‌ర్చ జ‌రిగేది. తాజాగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో తెలంగాణ రాజ‌కీయాల్లో కాస్త ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ విష‌యాన్ని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోనే లేదు. ఎందుకంటే.. ఆయ‌న రాజ‌కీయంగా ఫామ్‌లో లేరు. నాగం తీసుకున్న నిర్ణ‌యాలే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును గంద‌ర‌గోళంలో ప‌డేశాయి. టీడీపీకి తెలంగాణ‌లో భ‌విష్య‌త్తు లేక‌పోవ‌డం, టీఆర్ ఎస్‌లో చేర‌డానికి మ‌న‌సు రాక‌పోవ‌డంతో ఆయ‌న రాంగ్ స్టెప్ వేశార‌ని విశ్లేష‌కుల అంచ‌నా వేస్తున్నారు. నాగం క్ర‌మంగా రాజ‌కీయాల్లో ఉనికిని కోల్పోతున్నార‌న్న చ‌ర్చ కూడా మొద‌లైంది.
టీడీపీని వీడి తెలంగాణ న‌గారా స‌మితి పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించారు. దాన్ని ఎంతోకాలం న‌డ‌ప‌లేక బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చినా గెల‌వ‌లేక‌పోయారు. పార్టీలో చేరినా… ఆయ‌న‌కు అక్క‌డ ప్రాధాన్యం లేకుండా పోయింది. కిష‌న్‌రెడ్డి వ‌ర్గంతో ఆయ‌న‌కు పొస‌గ‌క‌పోవ‌డంతో నాగం చిన్న‌బుచ్చుకున్నారు. తెలంగాణ బ‌చావో పేరిట కొంత కుంప‌టి ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా ఆయ‌న ప్ర‌భుత్వంపై మాట‌ల‌దాడి మొద‌లు పెట్టారు. కిష‌న్ రెడ్డి రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాకే పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చారు. అదేంటి మీరు కొత్త కుంప‌టి పెట్టుకున్నాక‌.. ఇక్క‌డికి ఎందుకు వ‌చ్చారు? అన్న విలేక‌రుల‌కు తాను బీజేపీలో ఉన్నాన‌ని చెప్పారు. తాజాగా ఆయ‌న కాంగ్రెస్‌లో చేరుతున్నాడ‌న్న వార్త కొద్దిసేపు మాత్రమే టాపిక్‌గా నిలిచింది త‌ప్ప దానికి మీడియా అంత‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. తెలంగాణ రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన నాగం ఏ వేదిక‌పై ఉన్నార‌న్న విష‌యాన్ని ఆయ‌నే స్ప‌ష్టత ఇచ్చినా.. మీడియా కాదు క‌దా.. జ‌నాలు కూడా ప‌ట్టించుకునే స్థితిలో లేరు.