తెలంగాణ‌ టీడీపీలో ఎవ‌రుంటారు? 

తెలంగాణ‌లో తెలుగుదేశం ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టు.. నాగంబొట్టు అన్న‌ట్లుగా ఉంది. రోజుకో షాక్ త‌గులుతుండటంతో ఆ పార్టీలో ఎవ‌రుంటారు? ఎవ‌రు వెళ‌తారు? ఎవ‌రిని న‌మ్మాలి? ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌తీ నాయ‌కుడు.. అవ‌త‌లి నేత‌ను అనుమానంతో చూసుకుంటున్నారు. ఓటుకు నోటు  కేసు త‌రువాత చంద్ర‌బాబు తెలంగాణ‌లో మ‌కాం ఖాళీ చేసి విజ‌య‌వాడ‌లో జెండా పాతిన సంగ‌తి తెలిసిందే!  తెలంగాణ‌లో ఆయ‌న పార్టీని పూర్తిగా విస్మ‌రించిన‌ట్లేన‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఏమాత్రం స్పందించ‌క‌పోవ‌డం ఈ ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతుంది. జ‌రుగుతున్న ప్ర‌చారం చూస్తుంటే… కొడితే ఏనుగు కుంభ‌స్థ‌లాన్నే కొట్టాల‌న్న గులాబీ పార్టీ సంక‌ల్పం త్వ‌ర‌లోనే నెర‌వేరేలా ఉంది. పార్టీ ఫిరాయింపులు అనైతిక‌మంటూ ప్ర‌తిప‌క్షాలు గోల పెడుతున్నా.. అవేమీ లెక్క చేయ‌కుండా తెలంగాణ‌లో త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చాల‌ని చూసిన పార్టీని కూక‌టివేళ్ల‌తో పెకిలించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు గులాబీనేత‌లు. ఈ క్ర‌మంలో ఎవ‌రినీ ఖాతారు చేయ‌డం లేదు. గ‌ట్టిగా మాట్లాడితే…. ఓటుకు నోటు కేసులో తిర‌గ‌దోడ‌తార‌న్న భ‌యం చంద్ర‌బాబుకు ప‌ట్టుకుంద‌న్న వైసీపీ నేత‌ల‌ ఆరోప‌ణ‌లు విన‌బ‌డ‌కుండా టీడీపీ నేత‌లు చెవులు మూసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.  
వీరిలో ఎవ‌రు ముందు వెళ‌తారు?
టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీ మార‌తాడంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.  దీనిపై రేవంత్ ప‌లుమార్లు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఇలాంటి వార్త‌లు అధికంగా రాస్తున్నారంటూ ఓ ప‌త్రికపై మండిప‌డ్డారు. ఇదంతా అధికార పార్టీ చేస్తోన్న ప్ర‌చార‌మంటూ మండిప‌డుతున్నారు టీడీపీ నేత‌లు. మ‌రోవైపు ఎల్‌.ర‌మ‌ణ కూడా గోడ దూకుతారంటూ జోరుగా ప్ర‌చారం సాగుతోంది. దీంతో పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌లో ఎవ‌రు ముందుగా గోడ దూకుతార‌న్న విష‌యంలో సొంత‌పార్టీలోనే గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ విష‌యంలో రేవంత్ కాస్త న‌యం. క‌నీసం ఆయ‌న పార్టీ మార‌తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకే ఆయ‌న ప‌దేప‌దే స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని, పాలేరులో ఆ పార్టీకి అనుకూలంగా ప్ర‌చారం చేశార‌ని చెప్పుకుంటున్నారు. ఎల్ ర‌మ‌ణ ప‌రిస్థితి వేరే అని చెప్పాలి.  ఆయ‌న ఏకంగా తెలుగుదేశం పార్టీనే తీసుకెళ్లి కేసీఆర్ చేతిలో పెట్టి, అధినేత నెత్తిన శ‌ఠ‌గోపం పెట్ట‌నున్నార‌న్న వార్త ఎన్టీఆర్ ట్ర‌స్టు భ‌వ‌న్‌లో భూకంపాన్నే సృష్టిస్తోంది. అయితే ఇంత  జ‌రుగుతున్నా.. బాబు మాత్రం విదేశాల్లో విహ‌రిస్తున్నారే త‌ప్ప పార్టీని కాపాడుకోవ‌డానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. మొత్తానికి రెండు కీల‌క‌ప‌దవుల్లో ఉన్న రేవంత్‌, ర‌మ‌ణల్లో ముందుగా ఎవ‌రు చంద్ర‌బాబు నెత్తిన చేయి పెడ‌తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.