పాలేరు ఫలితంపై మొదలైన బెట్టింగ్!

పాలేరు ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఇక ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.  ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అప్పుడే ఎవరు గెలుస్తారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో తలపడుతున్న టీఆర్ ఎస్ అభ్య‌ర్థి తుమ్మ‌ల‌ – కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా రెడ్డి మధ్య పోరు హోరాహోరీగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇదే అద‌నుగా పందెం రాయుళ్లు బ‌రిలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. పాలేరులో ఎవ‌రు గెలుస్తార‌న్న విషయంలో పందాలు, బెట్టింగ్‌లు మొద‌లైన‌ట్లు స‌మాచారం. తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు గెలుస్తాడ‌ని కొంద‌రు, కాదు సుచ‌రితా రెడ్డే విజ‌యం సాధిస్తుంద‌ని మ‌రికొంద‌రు బెట్టింగ్‌లు పెడుతున్నట్లు తెలిసింది. ఓ వైపు పోలింగ్ జ‌రుగుతుండ‌గానే.. ఈ బెట్టింగ్‌లు మొద‌లైన‌ట్లు స‌మాచారం. సాయంత్రానికి ఈ బెట్టింగ్‌ల జోరు మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది. పోలింగ్ ఎలా సాగుతున్న‌దానిపై బెట్టింగ్ కూడా ఆధార‌ప‌డి ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఈ రోజు సాయంత్రానికి పోలింగ్ ముగుస్తుంది. ఈనెల 19న  ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతాయి. అంటే గురువారం మ‌ధ్యాహ్నానికి ఫ‌లితాలు వెలువ‌డుతాయి. ఈ లోపు పందెం రాయుళ్ల‌కు పండ‌గే! ఫ‌లితం ఎటువైపు మొగ్గు చూపినా.. కాయ్ రాజా కాయ్ అంటూ గురువారం వ‌ర‌కు వీరికి చేతి నిండా ప‌నే!