సైట్‌ సీయింగ్‌కి టాక్సీ బుక్ చేసుకుంటే…రేప్ చేశాడు!

ఒక మైన‌ర్ బాలిక‌పై టాక్సీ డ్రైవ‌ర్ అత్యాచారం చేసిన ఘ‌ట‌న సోమ‌వారం ఉత్త‌ర సిక్కిం జిల్లాలో జ‌రిగింది. మంగ‌ళ‌వారం పోలీసులు ఈ వివ‌రాలను వెల్ల‌డించారు. కోల్‌క‌తాకు చెందిన ముగ్గురు టీనేజి అమ్మాయిలు త‌మ 12 త‌ర‌గ‌తి ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత టూర్‌కి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యారు.  ఈ నెల 13న వారు సిక్కిం రాజ‌ధాని గ్యాంగ్‌ట‌క్ చేరారు. వారిలో ఒక అమ్మాయి బంధువుదైన ఒక హోట‌ల్‌లో దిగారు. ఆదివారం మ‌ధ్యాహ్నం వారు గ్యాంగ్‌ట‌క్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌ను చూడ‌టానికి ఒక ట్యాక్సీని మాట్లాడుకున్నారు. ఆ డ్రైవ‌ర్ పేరు ప్రేమ్‌రాజ్ రాయ్ (24). అక్క‌డ కొన్ని ప్రాంతాలు చూశాక డ్రైవ‌ర్, ఉత్త‌ర సిక్కిం జిల్లాలో వాట‌ర్ ఫాల్స్ బాగుంటాయ‌ని అక్క‌డికి వెళ‌దామ‌ని చెప్పాడు. అమ్మాయిలు అందుకు అంగీక‌రించారు.

ప్రేమ్ రాజ్ దారి మ‌ధ్య‌లో వారికి చిప్స్ తెచ్చి ఇచ్చాడు. అత‌నితో పాటు ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి వాటిని తిన‌గా, వెనుక సీట్లో కూర్చున్న అమ్మాయిలిద్ద‌రూ తిన‌లేదు. చిప్స్ తిన్న‌వెంట‌నే ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి మ‌త్తుగా అయిపోయింది. దాంతో డ్రైవ‌ర్ ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెట్టాడు. వెనుక ఉన్న ఇద్ద‌రు అమ్మాయిలు అడ్డ‌గించ‌డంతో అత‌ను వారిని బ‌ల‌వంతంగా కారులోంచి బ‌య‌ట‌కు తోసేసి ముందు కూర్చున్న అమ్మాయితో ప‌రార‌య్యాడు.

ఇద్ద‌రు అమ్మాయిలు రెండు కిలోమీట‌ర్లు న‌డిచి ఒక గ్రామాన్ని చేరి గ్రామ‌స్తుల‌కు విష‌యం వివ‌రించారు. దాంతో వారు పోలీసుల‌కు కంప్ల‌యింట్ చేశారు. గ్యాంగ్‌ట‌క్‌లో ఉన్న ఒకమ్మాయి బంధువైన హోట‌ల్ య‌జ‌మానికి సైతం విష‌యం తెలియ‌జేశారు. దాంతో అత‌ను అక్క‌డి పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశాడు. ఎట్ట‌కేలకు ఫుడాంగ్ అనే ప్రాంతంలో స్థానికుల స‌హాయంతో పోలీసులు ప్రేమ్‌రాజ్‌ని ప‌ట్టుకుని అరెస్టు చేశారు. అత‌ను తీసుకువెళ్లిన అమ్మాయి మొహంమీద మెడ‌మీద గాయాలున్నాయ‌ని, ఆమె పూర్తిగా షాక్‌లో ఉంద‌ని ఆ ప్రాంత వాసులు చెప్పారు. సోమ‌వారం బాధితులు గ్యాంగ్‌ట‌క్‌లో డ్రైవ‌ర్‌పై పోలీస్ కేసు పెట్టారు. సంఘ‌ట‌న జ‌రిగింది ఉత్త‌ర సిక్కిం జిల్లాలో క‌నుక ఈ కేసు గ్యాంగ్‌ట‌క్ నుండి అక్క‌డికి బ‌దిలీ అయిన‌ట్టుగా పోలీసులు వెల్ల‌డించారు. పోలీసులు ట్యాక్సీ డ్రైవ‌ర్‌మీద సంబంధిత కేసులు న‌మోదు చేశారు.

అమ్మాయిల‌కు స్వేచ్ఛ అవ‌స‌ర‌మే. కానీ వారి చుట్టూ మృగాలు తిరుగుతున్న‌పుడు వారిని స్వేచ్ఛ పేరుతో ఒంట‌రిగా వ‌దిలేయ‌డ‌మూ త‌ప్పే అవుతుంద‌ని, మృగాల్లో మార్పు వ‌చ్చే వ‌ర‌క‌యినా వారిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌కు ఉంద‌ని ఈ కేసు గురించి తెలిసిన వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.