49మంది పిల్ల‌ల‌కు ఒక్క టూత్ బ్ర‌ష్…

అంగ‌వైక‌ల్యం వారిదా…ప్ర‌భుత్వానిదా!

ఎప్పుడైనా, ఎక్క‌డైనా శారీర‌కంగా కానీ, మాన‌సికంగా గానీ అంగ‌వైక‌ల్యం ఉన్న‌వారు సౌక‌ర్య‌వంతంగా జీవించ‌లేక‌పోతున్నారంటే..వారి చుట్టూ ఉన్న స‌మాజానికి అంత‌కుమించిన మాన‌వ‌తాలోపం అనే అంగ‌వైక‌ల్యం ఉంద‌నుకోవాలి. 49మంది పిల్ల‌ల‌కు ఒక్క టూత్ బ్ర‌ష్, ఒక్క టూత్ పేస్ట్‌…ఈ ప‌రిస్థితిని మ‌నం ఊహించ‌గ‌ల‌మా…అంగ‌వైక‌ల్యం ఉన్న పిల్ల‌ల‌కోసం ప్ర‌భుత్వం న‌డుపుడుతున్న ఒక స‌హాయ కేంద్రంలోని ప‌రిస్థితి ఇది. అయితే ఇది ఏ జ‌ర్న‌లిస్టో రాసిన న్యూస్ కాదు.  జాతీయ మాన‌వ‌హ‌క్కుల సంఘం ఛైర్ ప‌ర్స‌న్ జ‌స్టిస్ హెచ్.ఎల్‌.ద‌త్తు స్వ‌యంగా ఆవేద‌న‌తో వెల్ల‌డించిన నిజాలు ఇవి.

ఆ హోమ్ ఏ రాష్ట్రంలో ఉంది… అనేది విష‌యం కాద‌ని, అస‌లు అంగ‌వైక‌ల్యం ఉన్న పిల్ల‌ల‌కోసం ప్ర‌భుత్వాలు న‌డుపుతున్న హోములు చాలావ‌ర‌కు ఇలాగే ఉంటున్నాయ‌ని, పిల్ల‌లు విప‌రీతంగా నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వం నుండి మంజూర‌వుతున్న నిధులకు కొర‌తేమీ లేద‌ని, అయినా పిల్ల‌ల స‌హాయ సంక్షేమ కేంద్రాలు, వృద్ధుల శ‌ర‌ణాల‌యాల ప‌రిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేద‌ని ఆయ‌న తెలిపారు. ఇటీవ‌ల కాలంలో ప్రతిరోజూ వృద్ధుల శ‌ర‌ణాల‌యాల‌ను సంద‌ర్శించి వారిలో న‌మ్మ‌కాన్ని, ఆశ‌ని పెంచే ప్ర‌య‌త్నం చేసిన జ‌స్టిస్ ద‌త్తు త‌న క‌ళ్ల‌తో చూసిన విష‌యాల‌నే ఆవేద‌న‌తో వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వాలు వృథా ఖ‌ర్చులు పెట్ట‌కుండా వికలాంగుల‌, వృద్ధుల సంక్షేమాన్ని ప‌ట్టించుకోవాల‌ని, వారికి క‌నీస వ‌స‌తులైనా క‌ల్పించాల‌ని ఆయ‌న అన్నారు. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  ప‌ద‌వినుండి డిసెంబ‌రులో రిటైర్ అయన జ‌స్టిస్ ద‌త్తు, ఫిబ్ర‌వరిలో జాతీయ మావ‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌కి ఛైర్ ప‌ర్స‌న్‌గా బాధ్య‌త‌లు తీసుకున్నారు. డిసెంబ‌రు నుండి ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య‌కాలంలో ఆయ‌న ప్ర‌తిరోజూ బెంగ‌లూరుకి స‌మీపంలో ఉన్న‌ ఓల్డేజి హోముల‌నుకు వెళ్లారు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. ప్రస్తుతం జాతీయ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్సన్‌గా జ‌స్టిస్ ద‌త్తు, ప్ర‌భుత్వాలు న‌డుపుతున్న స‌హాయ, సంక్షేమ కేంద్రాల్లో ప‌రిస్థితుల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్,  ఓల్డేజి హోముల్లో, అంగ‌విక‌లుర కేంద్రాల్లో నివ‌సిస్తున్న‌వారి జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర్చ‌గ‌ల‌గితే అది త‌న జీవితంలోని అత్యంత ఆనంద‌క‌ర‌మైన సంద‌ర్భాల్లో ఒక‌టి అవుతుంద‌ని ఆయ‌న అన్నారు.