పాలేరులో తుమ్మ‌ల పాగా!

పాలేరులో తుమ్మ‌ల పాగా వేయ‌నున్నారా? ఆంధ్ర స‌రిహ‌ద్దులో సెటిల‌ర్ల జోన్‌లో తొలిసారిగా గులాబీ గుభాళించ‌నుందా? అవున‌నే అంటున్నాయి ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు. కాంగ్రెస్ చేతిలో ఉన్న మ‌రో సీటును కారు కైవ‌సం చేసుకుంటుంద‌ని స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. ఇప్ప‌టికే మంత్రిగా ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావుకు స్థానికంగా ఉన్న చ‌రిష్మా, ఆయ‌న మంత్రిగా ఈ ప్రాంతంలో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులు ఇందుకు దోహ‌దం చేసి ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. సాధార‌ణంగా దేశంలో ఎక్క‌డ ఉప ఎన్నిక జ‌రిగినా.. 50 శాతం దాటితే బాగానే జ‌రిగిన‌ట్లు అని చెబుతారు. కానీ, ఎప్పుడూ లేనిది రికార్డు స్థాయిలో దాదాపు 90 శాతం పోలింగ్ న‌మోదు కావ‌డం తుమ్మ‌ల‌కు క‌లిసి వ‌స్తుంద‌నే రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. తీవ్ర‌మైన ఎండ ఉన్నా.. పాలేరు ప్ర‌జ‌లు ఓటింగ్ లో పాల్గొన‌డానికి ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఉత్సాహం చూప‌డం విశేషం. పోలింగ్ జ‌రిగిన తీరుపై అధికార పార్టీ అసంతృప్తిగా ఉంది. మొద‌టి నుంచి గెలుపుపై ధీమాగా ఉన్న టీఆర్ ఎస్ భారీగా పోలింగ్ న‌మోదు కావ‌డంతో మ‌రింత ఉత్సాహంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.
సానుభూతి ప‌నిచేయ‌లేదా?
పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి మ‌ర‌ణంతో ఈ ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే! ఈ కార‌ణంతోనే టీడీపీ పోటీకి దూరంగా ఉంది. కానీ, గులాబీపార్టీ పోటీ చేసింది. ఎన్ని విమ‌ర్శ‌లొచ్చినా లెక్క చేయ‌లేదు. పాలేరును ఏక‌గ్రీవం చేయాల‌ని వెంక‌ట‌రెడ్డి స‌తీమ‌ణి సుచ‌రితారెడ్డి, కాంగ్రెస్ పెద్ద‌లు ఎన్ని విజ్ఞ‌ప్తులు చేసినా కారు పార్టీ ఖాతరు చేయ‌లేదు. ప్ర‌జ‌లు భారీ ఎత్తున పోలింగ్ స్టేష‌న్ల‌కు హాజ‌రై ఓట్లేశారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. పాలేరులో సానుభూతి పెద్ద‌గా ప‌నిచేయ‌లేద‌న్న టాక్ వినిపిస్తోంది.  కారు టాప్‌గేర్‌లో దూసుకుపోవ‌డం ఖాయం అన్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. కారు గుర్తుకు దాదాపుగా 45 వేల మెజారిటీ వ‌స్తుంద‌ని పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ దెబ్బ‌తో కాంగ్రెస్ కంచుకోట బ‌ద్ద‌లు కొడ‌తామ‌ని విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు నిజ‌మైతే.. నారాయ‌ణ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక త‌రువాత కాంగ్రెస్ కోల్పోయిన రెండో సీటు పాలేరు అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.