బాబు మోసం – టీడీపీ సీనియర్‌ నేత అమరణ దీక్ష

చంద్రబాబు తనను మోసం చేశారంటూ తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ సీనియర్‌నేత ముత్యాల రాజబ్బాయి ఆమరణదీక్షకు దిగడం కలకలం రేపింది. ఎన్నికలముందు జనానికి ఇచ్చిన తరహాలోనే తనకు కొన్ని హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని రాజబ్బాయి ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలముందు పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీని కాపాడుకునేందుకు రాజబ్బాయి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తీరా ఎన్నికల సమయంలో పెద్దాపురం టిక్కెట్‌ మాత్రం రాజబ్బాయికి ఇవ్వకుండా స్థానికేతరుడైన నిమ్మకాయల చినరాజప్పకు టిక్కెట్‌ ఇచ్చారు. అప్పట్లో రాజబ్బాయి అభ్యంతరం తెలపగా పార్టీ ఆధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు నమ్మించారు. దీంతో చినరాజప్ప గెలుపుకోసం రాజబ్బాయికూడా కష్టపడ్డారు. అయితే చినరాజప్పకి మంత్రిపదవి దక్కగా రాజబ్బాయికి మొండిచేయ్యే మిగిలింది. రెండేళ్లపాటు ఎదురుచూసిన రాజబ్బాయి తను దగాపడ్డట్లు నిర్ధారణకు వచ్చేశారు. చంద్రబాబు మోసానికి వ్యతిరేకంగా తన సొంతింటిలోనే ఆమరణదీక్ష మొదలుపెట్టారు. రాజబ్బాయి దీక్షతో టీడీపీనేతలు ఉలిక్కి పడ్డారు.