కేటీఆర్, ఉత్త‌మ్ ప‌ద‌వులు సేఫ్‌!

పాలేరు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ఐటీ మంత్రి కేటీఆర్ మంత్రి ప‌ద‌విసేఫ్‌! పాలేరులో కారు గెల‌వకుంటే.. త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని శ‌ప‌థం చేసిన రామారావు మ‌రోసారి త‌న నెగ్గారు. స‌వాలు విసిరి పంతంలో నెగ్గి కేటీఆర్ త‌న ప‌ద‌విని కాపాడుకుంటే.. ఎలాంటి పంతాల‌కు పోకుండా, స‌వాలుకు ప్ర‌తిస‌వాలు విస‌ర‌కుండా త‌న ప‌ద‌విని కాపాడుకున్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. మొత్తానికి ఇద్దరికీ ప‌ద‌వీగండం త‌ప్పిన‌ట్లయింది. ఒక్కసారి ప్ర‌చారంలో అధికార – విప‌క్షాల మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్ధాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం..!
పాలేరులో కాంగ్రెస్ అభ్య‌ర్థి సుచరితా రెడ్డి మీద కారుపార్టీ పోటీ పెట్ట‌డాన్ని స‌హించ‌లేక‌పోయింది కాంగ్రెస్‌. ఏక‌గ్రీవానికి మ‌రో ప్ర‌తిప‌క్షం టీడీపీ సుముఖ‌త వ్య‌క్తం చేసినా.. కారుపార్టీ పోటీకే మొగ్గు చూప‌డంతో కాంగ్రెస్ పార్టీకి అరికాలి మంట నెత్తికెక్కింది. కేసీఆర్ పార్టీకి మాన‌వ‌త్వం లేద‌ని, కేవ‌లం ఓట్లు- సీట్ల మీదే వారి శ్ర‌ద్ధ అంటూ మాట‌ల దాడి మొద‌లు పెట్టాడు ఉత్త‌మ్‌. టీఆర్ ఎస్ పార్టీని ఓడిస్తామంటూ ధీమా వ్య‌క్తం చేశాడు. అయితే, దీన్ని తిప్పికొట్టే ప్ర‌య‌త్నంలో కేటీఆర్ త‌న మంత్రి ప‌ద‌వినే ప‌ణంగా పెట్టాడు. పాలేరులో టీఆర్ ఎస్ ఓడిపోతే.. త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప‌రుశ‌రామ శ‌ప‌థం చేశాడు. ఒక‌వేళ కాంగ్రెస్ ఓడిపోతే.. టీపీసీసీ చీఫ్ త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌గ‌ల‌రా? అంటూ స‌వాలు విసిరారు. ఈ స‌వాలుకు కాంగ్రెస్ నుంచి  ఎలాంటి స్పంద‌న రాకున్నా.. టీఆర్ ఎస్ ఇరుకున పెట్టేలా పార్టీ సీనియ‌ర్లంద‌రూ శ్రీ‌కాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ విష‌యాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చారు. రాజ్య‌స‌భ సీట్ల విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు. ఉద్య‌మ‌పార్టీగా చెప్పుకునే మీరు అమ‌రుల‌ను పెద్ద‌ల స‌భ (రాజ్య‌స‌భ‌)కు ఎందుకు పంప‌రంటూ.. నిల‌దీశారు. ఈ ఆరోప‌ణ‌లు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపాయ‌నే చెప్పాలి.
ఉత్త‌మ్‌కు న‌మ్మ‌కం లేదా?
కేటీఆర్ విసిరిన స‌వాలుపై ఉత్త‌మ్‌కుమార్ ఎందుకు స్పందించ‌లేద‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చానీయాంశంగా మారింది. ఇందుకు గ్రేట‌ర్ స‌మ‌యంలో జ‌రిగిన రాజ‌కీయ స‌వాళ్లే కార‌ణ‌మ‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఇటీవ‌ల గ్రేట‌ర్‌లో కారు పార్టీకి 100 స్థానాలు వ‌స్తాయ‌ని, అలాకాకుంటే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కేటీఆర్ శ‌ప‌థం చేశాడు. ఈ స‌వాలుకు టీడీపీ, సీపీఐ వీర లెవల్లో స్పందించాయి. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి (ఓటుకు నోటు కేసు ప్ర‌ధాన నిందితుడు) నిజంగా కేటీఆర్ చెప్పిన‌ట్లు జ‌రిగితే.. తాను రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని ప్ర‌తి స‌వాలు విసిరాడు. దీనిపై స్పందించిన సీపీఐ నేత నారాయ‌ణ టీఆర్ ఎస్ అన్ని స్థానాలు గెలిస్తే.. త‌న చెవులు కోసుకుంటాన‌ని వెట‌కారం ఆడాడు. కానీ, కేటీఆర్ చెప్పిన‌ట్లుగా జ‌రిగింది. కాకుంటే కారు పార్టీ 99 స్థానాలు గెలుచుకుంది. అయితే, 100 సీట్లు గెల‌వ‌లేదు క‌దా? అన్న పాయింట్‌తో స‌వాలు నుంచి మెల్లిగా జారుకున్నాడు రేవంత్‌. ఇక నారాయ‌ణ అయితే మీడియాకు ముఖం చూపెట్ట‌లేదు. విజ‌యం అనంత‌రం.. గులాబీనేత‌లు నారాయ‌ణ… ఎక్క‌డున్నావు?  నీ చెవులు నీవే కోసుకుంటావా? మ‌మ్మ‌ల్ని కోయ‌మంటావా? అంటూ మీడియాలో ప్ర‌శ్నించారు. దీంతో వెంట‌నే స్పందించారు కేసీఆర్‌. నారాయ‌ణ‌ను ఏమీ అన‌వ‌ద్ద‌ని ఆదేశాలు ఇచ్చాడు. మా నారాయ‌ణ చాలా అంద‌గాడు.. అయ‌న్ని చెవులు లేకుండా చూడ‌లేం, ఒక్క చెవులే కాదు.. ఎవ‌రూ ఏమీ కోసుకోవ‌ద్దు.. అని చుర‌క‌లు అంటించి వ‌దిలేశాడు. ఈ ప‌రిణామాల‌న్నీ ఇంకా క‌ళ్ల‌ముందు క‌ద‌లాడుతున్నాయి కాబ‌ట్టే.. ఉత్త‌మ్ ఎలాంటి ప‌ద‌విని ప‌ణంగా పెట్ట‌లేద‌ని కాంగ్రెస్ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు.