ఉత్త‌మ్ ఖాతాలో మ‌రో ఓట‌మి!

మూలిగే న‌క్క‌మీద తాటిపండు ప‌డ‌టం అంటే ఇదేనేమో..! వ‌రుస ప‌రాజ‌యాల‌తో కుంగిపోతున్న టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ కు పాలేరు ఓట‌మితో త‌ల‌బొప్పి క‌ట్టింది. ఒక‌టి కాదు రెండు కాదు.. వ‌రుస‌గా ఎదురువుతున్న ఓట‌ముల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వాస్త‌వానికి ప్ర‌తిప‌క్ష నేత‌గా.. ఉప ఎన్నిక‌లు ఎదుర్కోవ‌డం స‌వాలే! అధికార పార్టీని ఎన్నిక‌ల్లో ఢీకొట్ట‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇక విజ‌యం సాధించ‌డమంటే మ‌హాయ‌జ్ఞమే చేయాలి. ఇలా అరుద‌గా వ‌చ్చే ప‌రీక్ష‌లు నాయ‌కుడి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌పెడ‌తాయి. కానీ, ఎన్ని అవ‌కాశాలు వ‌చ్చినా ఉత్త‌మ్ త‌న ప్రాభ‌వాన్ని చూప‌లేక‌పోయాడు. ముందు పార్టీని స‌మ‌ష్టిగా ఉంచ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. బీసీలు- రెడ్లు అంటూ పార్టీ రెండుగా నిట్ట‌నిలువునా చీలిపోయింది. కాక‌పోతే వారి అసంతృప్తి బ‌య‌ట‌ప‌డ‌టం లేదు. త‌న కంటే సీనియ‌ర్ల‌పై ఉత్త‌మ్ కినుక వ‌హిస్తున్నాడ‌న్న అప‌వాదు ఉంది. ఇక‌పోతే జూనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి.  ఇవ‌న్నీ పార్టీ ఓట‌మికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌న్న విమ‌ర్శ కూడా ఉంది.
వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చినా..!
ఒక‌టి కాదు రెండు కాదు, అత‌ని నాయ‌క‌త్వ సామ‌ర్థ్యాన్ని నిరూపించుకునేందుకు  వరంగ‌ల్‌ పార్ల‌మెంటు, నారాయ‌ణ‌ఖేడ్‌, పాలేరు అసెంబ్లీ స్తానాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. కానీ ఉప‌యోగం లేకుండా పోయింది. కొత్త స్థానాల సంగ‌తి ప‌క్క‌న బెడితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలైన నారాయ‌ణ ఖేడ్‌, పాలేరుల‌ను కూడా కోల్పోవడం నాయ‌కుడిగా ఉత్త‌మ్ వైఫ‌ల్యాల‌కు అద్దం ప‌డుతున్నాయి. వాస్త‌వానికి నారాయ‌ణ‌ఖేడ్ ఏక‌గ్రీవానికి కేసీఆర్‌క్ష తొలుత స‌ముఖ‌త వ్య‌క్తం చేశాడు. కానీ, టీడీపీతో క‌లిసి రుణ‌మాఫీ ఒకేసారి మాఫీ చేయాల‌న్న డిమాండ్ తో ఉత్త‌మ్‌ రెండో శ‌నివారం రాష్ట్రవ్యాప్త‌ బంద్ కు  పిలుపునిచ్చాడు. దీంతో కేసీఆర్ కు చిర్రెత్తుకొచ్చింది. దీనికితోడు ప్ర‌భుత్వంపై అవిశ్వాసం పెడ‌తామంటూ కాంగ్రెస్ నేత‌లు బీరాలు ప‌లికారు. ప్ర‌జ‌లు మీ వెంట ఉన్నారో..మా వెంట ఉన్నారో తేల్చుకుందామంటూ నారాయ‌ణ‌ఖేడ్‌లో పోటీ పెట్టి ఆ స్థానాన్ని కేసీఆర్ త‌న్న‌కుపోయారు. ఆస‌మ‌యంలో ఉత్త‌మ్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.
దీనికితోడు డీఎస్‌, వ‌కుళాభ‌రణం, చిట్టెం ఇలా సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లంతా కారెక్కారు. వీటిని ఆప‌లేక‌పోయారు. ఇక మునిసిపాలిటీల్లోనూ కాంగ్రెస్ ఎక్క‌డా త‌న మార్కు చూపెట్ట‌లేక‌పోయింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌, సిద్ధ‌పేట‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఇత‌ర మేజ‌ర్ పంచాయ‌తీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎక్క‌డా స‌త్తా చాట‌లేదు. వీట‌న్నింటికీ ఎక్క‌డా ఉత్త‌మ్ బాధ్య‌త వ‌హించ‌లేదు. అధికార పార్టీని విమ‌ర్శించ‌డం త‌ప్ప త‌న రాజీనామా గురించి ఎక్క‌డా, ఎప్పుడూ ప్ర‌స్తావించ‌లేదు. దానం, వ‌కుళాభ‌ర‌ణం లాంటి నేత‌లు రాజీనామాకు డిమాండ్ చేసినా.. వాటిని ప‌ట్టించుకోలేదు. అధిష్టానం వ‌ద్ద మంచి పేరు ఉండ‌టంతోనే ఇంత‌కాలం కొన‌సాగ‌గ‌లుగుతున్నాడ‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు. మెద‌క్ పార్లమెంటు ఉప ఎన్నిక‌లో స‌రిగా వ్యూహ‌ర‌చ‌న చేయ‌లేద‌ని పొన్నాల ల‌క్ష్మ‌య్య‌ను త‌ప్పించిన కాంగ్రెస్ అధిష్టానం ఉత్త‌మ్ విష‌యంలో మాత్రం ఎందుకు నాన్చుడు ధోర‌ణి అనుస‌రిస్తుందో అర్థం కావ‌డం లేద‌ని వాపోతున్నారు. బ‌హుశా ! రాహుల్‌తో ఉన్ సాన్నిహిత్య‌మే ఇందుకు కార‌ణం కావ‌చ్చని స‌రిపెట్టుకుంటున్నారు.