ప్ర‌తిప‌క్షాల‌కు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్‌!

పాలేరు ఉప ఎన్నిక విజ‌య‌మో.. లేక ప్ర‌తిప‌క్షాల మీద వ‌చ్చిన విసుగో గానీ సీఎం కేసీఆర్‌కు కోపం వ‌చ్చింది. అది ఏకంగా వారికి వార్నింగ్ ఇచ్చే దాకా పోయింది. అస‌త్య ఆరోప‌ణ‌లు, ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కామెంట్లను ఇక‌పై స‌హించేది లేద‌ని, అలా చేసిన‌ వారిపై కేసులు న‌మోదు చేస్తామ‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. దేశంలో ఎక్క‌డాలేని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంటే.. ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేక‌, పొద్దుపోక ఆరోప‌ణ‌లకు దిగుతున్నాయ‌ని మండిప‌డ్డారు. ఇష్టానుసారంగా అవాకులు, చెవాకులు పేలితే కేసుల‌తోపాటు, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.
టీడీపీ నేత‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారో లేదో తెలియ‌దు కానీ, కాంగ్రెస్‌కు మాత్రం డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో గెలిచిన త‌మ పార్టీని కించ‌ప‌రిస్తే స‌హించేది లేద‌ని బ‌హిరంగంగా హెచ్చ‌రించారు. కాంగ్రెస్ పార్టీ 1947 నాటి రాజ‌కీయాలు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. అస‌లు ఆ పార్టీకి రాజ‌కీయ వ్యూహాలే తెలియ‌వ‌ని ఎద్దేవా చేశారు. రెండేళ్ల కాలంలో రెండు పార్లమెంటు, రెండు అసెంబ్లీ స్థానాల‌లో మేం సాధించిన విజ‌య‌మే మాకు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ తెలియ‌జేస్తుంద‌ని గుర్తు చేశారు. గ‌తంలో పాలేరులో కేవలం 4,100 ఓట్లు మాత్రమే రాగా ఈసారి ఏకంగా 95వేల పైచిలుకు మెజారిటీ రావ‌డం పాల‌న‌లో ప్ర‌జ‌లు మాకు వేసిన మార్కులే అని చెప్పారు. ఏపీ స‌ర్కారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. అభివృద్ధిలో ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని చెప్పారు.
ఆ వ్యాఖ్య‌లే చికాకు పుట్టించాయా?
తెలంగాణ‌లో సీఎం చెబుతున్నంత కాక‌పోయినా.. ఇక్క‌డ త‌ల‌పెట్టిన మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల‌పై వివిధ రాష్ట్రాలు దృష్టి సారించిన విష‌యం విదిత‌మే. ఇక ఏపీ సీఎం చంద్ర‌బాబు అయితే ప్ర‌తివిష‌యంలో కేసీఆర్‌ను మక్కీకి మ‌క్కీ కాపీ కొడుతూ పోతున్నారు. కాంగ్రెస్ కోరికోరి కారు పార్టీతో క‌య్యాలు పెట్టుకుంటోంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. నారాయ‌ణ‌ఖేడ్ ఉప ఎన్నిక స‌మ‌యంలో సీఎం ఏక‌గ్రీవానికి ఒప్పుకున్న‌ప్పుడు, టీడీపీతో క‌లిసి బంద్ పిలుపు ఇచ్చింది, అవిశ్వాసం పెడ‌తామంటూ రెచ్చ‌గొట్టింది. దీంతో దీన్ని ప్రతిష్టాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్ ఆ స్థానంలో పోటీ పెట్టి గెలిచాడు. ఇక వ‌రంగ‌ల్‌, పాలేరులో ప్ర‌భుత్వ ప‌థ‌కాలైన మిష‌న్ కాక‌తీయ‌ను క‌మీష‌న్ కాక‌తీయ అని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌చారం చేశారు. ఇక‌పోతే.. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై ఇటీవ‌ల అసెంబ్లీలో సీఎం ఇచ్చిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ను స‌రిగా ఎదుర్కోలేక పోయింది. కానీ, అందులో అవినీతి జ‌రుగుతోందంటూ ఆరోప‌ణ‌లు చేస్తోంది. అందుకే, కేసులు పెడ‌తామంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.