ల‌క్ష్మ‌ణ్ కొత్త బిచ్చ‌గాడా?

ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల దాడి చేయ‌డంలో కేసీఆర్ ఆరితేరాడు.    స్టేజీల‌పై ప్ర‌తిప‌క్షాల‌పై పంచ్‌లు, సెటైర్లు వేయ‌డం ఆయ‌న‌కు మైకుతో పెట్టిన విద్య. అస‌లే కేసీఆర్‌.. ఆపై మైకు అందుకుంటే.. అస‌లే కోపం మీద ఉంటే.. ఆపై గెలిచిన ఉత్సాహం మీద ఉంటే ఆయ‌న  వాగ్దాటిని ఆప‌త‌ర‌మా! ఆయ‌న విమ‌ర్శల్లో హాస్యం ఎంతుంటుందో.. కారంకా త‌గిలే ఘాటూ అంతే ఉంటుంది.  సీఎం అయ్యాక విమ‌ర్శ‌వాడి త‌గ్గించారు కానీ, ఉద్య‌మ స‌మ‌యంలో ఆయ‌న చేసిన కామెంట్లు అంద‌రికీ గుర్తే.  
కేసీఆర్ గురించి తెలిసిన‌వారికెవ‌రికైనా ఇవ‌న్నీ అనుభ‌వాలే! ఆయ‌న వాగ్దాటికి ఈసారి ల‌క్ష్మ‌ణ్ బ‌ల‌య్యాడు. కొత్త బిచ్చ‌గాడు పొద్దెర‌గ‌డ‌న్న‌ట్లు.. నూత‌నంగా పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ల‌క్ష్మ‌ణ్‌కు ఏం చేయాలో పాలుపోక ప్ర‌భుత్వంపై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డాడు. మా వెన‌క ప్ర‌జాబ‌లం ఉంది. మేమెవ‌రి ప్ర‌జాబ‌లం మీద ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అంటే 2014లో టీడీపీ ద‌య‌తో గెలిచావ‌ని ల‌క్ష్మ‌ణ్‌నే నేరుగానే ఎద్దేవా చేశారు. కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది క‌దా! మీకు చేత‌నైతే ఒక్క జాతీయ ప్రాజెక్టునైనా తీసుకురావాల‌ని సూచించారు. అలా కానిప‌క్షంలో అస‌త్య ఆరోప‌ణ‌ల‌కు ముగింపు పల‌కాల‌ని హిత‌వు ప‌లికారు.
ఇంతకీ ఎందుకు?
బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ల‌క్ష్మ‌ణ్ టీఆర్ ఎస్‌ను, సీఎంను టార్గెట్‌గా చేసుకున్నారు. పార్టీ ఆదేశాలో…? లేక టీడీపీ పొత్తు ధ‌ర్మంలో భాగమో తెలియ‌దు కానీ, సందు దొరికితే.. కేసీఆర్‌ను విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన తొలిరోజే.. ఫిరాయింపులను ప్రోత్స‌హిస్తోన్న కేసీఆర్ ఇలాంటి పోక‌డ‌లు మానుకోవాల‌ని సూచించారు.  ఇక అది మొద‌లు…. కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ప‌రిపాల‌న గాలికొదిలేశాడ‌ని బ‌హిరంగ వేదిక‌ల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రారంభించాడు. ఫిరాయింపుల‌పై పెట్టిన శ్ర‌ద్ధ ప‌రిపాల‌న‌పై లేద‌ని ప‌లు మార్లు కేసీఆర్ ను విమర్శించాడు. క‌ర‌వు నివార‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, కేసీఆర్ ప‌త‌నం మొద‌ల‌వుతుంద‌ని ఇలా ఆయ‌న శ‌క్తిమేర‌కు సీఎంపై కామెంట్లు చేశాడు. వీట‌న్నింటిపై ఇంత‌కాలం భ‌రించిన సీఎం పాలేరు విజ‌యోత్స‌వ స‌భ‌లో భగ్గుమ‌న్నారు. కొత్త బిచ్చ‌గాడు అంటూ ల‌క్ష్మ‌ణ్ గాలి తీసేశారు. చేత‌నైతే ఒంట‌రిపోరుతో గెలవాల‌ని చుర‌క‌లంటించారు. పాపం! ల‌చ్చ‌న్న… సీఎం కేసీఆర్ ఇలా విరుచుకుప‌డ‌తాడ‌ని ఊహించి ఉండ‌డు.