మేమూ కేసులు పెట్ట‌గ‌లం:  జానారెడ్డి

పెద్ద‌లు జానారెడ్డి చాలా రోజుల త‌రువాత నోరువిప్పారు. అసత్య ఆరోప‌ణ‌లు చేస్తే.. కేసులు పెడ‌తామంటూ కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల‌ను హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ఆయ‌న త‌న‌దైన శైలిలో కేసీఆర్‌కు చుర‌క‌లు అంటించారు. కేసులు పెట్టే అధికారం కేవ‌లం అధికార ప‌క్షానికే కాద‌ని.. న్యాయ‌వ్య‌వ‌స్థ అంద‌రికీ స‌మాన‌మేన‌న్న విష‌యం మ‌రిచిపోవ‌ద్ద‌ని గుర్తుచేశారు. త‌ప్పులు అధికార ప‌క్షంలోని వారు కూడా చేస్తార‌ని, మాకూ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై అవగాహ‌న ఉంద‌న్న విష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు. ఎవ‌రి హ‌ద్దుల్లో వారు ఉంటే మంచిద‌ని కేసీఆర్‌కు సైలెంట్‌గా వార్నింగ్ ఇచ్చారు. అధికార ప‌క్షం కేసుల పేరుతో ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తే.. ప్ర‌తిఘ‌ట‌న త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు టీఆర్ ఎస్ త‌మ‌కు ఇంకా చేస్తోంద‌న్న భ్ర‌మ‌ల్లో ఉన్నార‌న్నారు. అందుకే పాలేరులో కారుపార్టీ విజ‌యం సాధించ‌గ‌లిగింద‌న్నారు.  అంతే త‌ప్ప  విజ‌యం సాధించామ‌ని టీఆర్ ఎస్ గ‌ర్వ‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌ని సూచించారు.
కార్య‌క‌ర్త‌లు నిరుత్సాహ ప‌డ‌న‌వ‌స‌రం లేదు..
 ఎంతైనా జానారెడ్డి పెద్ద‌లు అనిపించుకున్నారు. త‌న‌దైన శైలిలో కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. అయినా సంప్ర‌దాయం మ‌రువ‌లేదు. పాలేరులో విజ‌యం సాధించిన తుమ్మ‌లకు అభినంద‌లు తెలిపారు. పాలేరులో రాత్రింభ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు నిరుత్సాహ ప‌డ‌వ‌ద్ద‌ని వారిలో భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నిరాశ చెంద‌వ‌ద్ద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆస్థానం మ‌న‌దేనని వారికి ధైర్య‌మిచ్చారు. అస్సోంలో గ‌తంలో 5 స్థానాలు కూడా లేని బీజేపీ ఇప్పుడు ఏకంగా అధికారాన్న కైవ‌సం చేసుకున్న  తీరు మ‌నంద‌రికీ స్ఫూర్తి దాయ‌క‌మ‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని నిరంత‌రంగా పోరాటం చేయాల‌ని, అదే మ‌న‌ల్ని విజ‌యాల బాట ప‌ట్టిస్తుంద‌ని సూచించారు.