తెలంగాణ‌లో 25 జిల్లాలు ఇవే!

నూత‌న రాష్ట్రం తెలంగాణ‌లో కొత్త జిల్లాల ప్ర‌తిపాద‌న‌పై ఆచ‌ర‌ణ దిశ‌గా ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌లు జిల్లాల్లో ప్ర‌జ‌ల్లో దీనిపై ఆందోళ‌న‌లు, సందేహాలు, అభ్యంత‌రాలు వ్య‌క్త‌మవుతున్నాయి. అయితే ప్ర‌భుత్వం కొత్త జిల్లాల‌పై ముందే అవ‌గాహ‌న‌కు వ‌చ్చి ఉండ‌టం వ‌ల్ల ఈ విష‌యంలో తాను అనుకున్న‌ట్లుగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్రకారం.. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతో మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని కలిపి సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ (సెంట్రల్‌), హైదరాబాద్‌ (నార్త్‌), హైదరాబాద్‌ (వెస్ట్‌), రంగారెడ్డి, రంగారెడ్డి (వెస్ట్‌) జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. వరంగల్‌ జిల్లాలో భూపాలపల్లి (ప్రొఫెసర్‌ జయశంకర్‌)ని కరీంనగర్‌ జిల్లాలోని మంథనితో కలిపి కొత్తగా జిల్లా చేయనున్నారు. ఆదిలాబాద్‌లో కొమురం భీం పేరుతో కొత్త జిల్లా పుట్టనుంది. కరీంనగర్‌లో జగిత్యాల, మహబూబ్‌నగర్‌లో నాగర్‌కర్నూలుతోపాటు వనపర్తి కొత్త జిల్లాలపై ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నల్గొండ జిల్లాలో సూర్యాపేటతోపాటు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలను జన గామతో కలిపి, కొత్త జిల్లా ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. ఈలెక్క‌న‌ తెలంగాణ‌లో మొత్తం 25 జిల్లాలు ఉండ‌నున్నాయి.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా జూన్ 2న దీనిపై నోటిఫికేష‌న్ జారీ చేస్తారు. దీనిపై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ నెల‌రోజుల‌పాటు జ‌రిపిన త‌రువాత ఆగ‌స్టు 15 క‌ల్లా కొత్త జిల్లాల ప్రక‌ట‌న చేయ‌నున్నారు.