అరుదైన రికార్డు సృష్టించిన రజనీకాంత్

కబాలి సినిమాతో ఇప్పటికే సోషల్ మీడియాలో లెక్కలేనన్ని రికార్డులు సృష్టించాడు రజనీకాంత్. భారత దేశంలోనే అత్యధిక వీక్షకులు కలిగిన టీజర్ గా కబాలి నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాతో మరో రికార్డు కూడా సృష్టించాడు సూపర్ స్టార్. ఈ సినిమాను మళయ్ భాషలోకి డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించారు. ఓ భారతీయ సినిమాను మళయ్ భాషలోకి డబ్బింగ్ చేసి విడుదల చేయడం ఇదే తొలిసారి. మలేషియాలో రజనీకాంత్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. భాష అర్థం కాకపోయినా అక్కడి జనాలు రజనీ సినిమాల్ని ఆదరిస్తుంటారు. అంతెందుకు ఇక్కడ ఫ్లాప్ అయిన లింగ సినిమాకు కూడా అక్కడవసూళ్లు వచ్చాయి. అందుకే ఈసారి కబాలి సినిమాను ఏకంగా మళయ్ భాషలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా కబాలి టీజర్ ను కూడా మళయ్ భాషలోకి డబ్ చేసి విడుదల చేశారు. గతవారం విడుదలైన ఈ టీజర్ మలేషియా ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. భారత్ తో పాటు మలేషియాలో ఈ సినిమా జులై 1న విడుదలవుతుంది. మళయ్ భాషతో పాటు తమిళ్ భాషలో కూడా ఈ సినిమా మలేషియాలో విడుదలకానుంది. వచ్చేనెల రెండోవారం నుంచి ఈ సినిమా అధికారిక ప్రచారాన్ని ప్రారంభిస్తారు.