సెలవులు అయిపోయాయి… బాహుబలి మళ్లీ మొదలైంది…

విపరీతమైన ఎండల కారణంగా బాహుబలి-2 సినిమాకు ఈ మధ్య సెలవులు ఇచ్చారు. దీంతో యూనిట్ అంతా తలోదిక్కుకు పారిపోయారు. చక్కగా రెస్ట్ తీసుకున్నారు. రాజమౌళి ఆస్ట్రేలియా వెళ్లడంతోపాటు కేన్స్ చిత్రోత్సవానికి కూడా హాజరయ్యాడు. ఇక ప్రభాస్ అయితే ఆఫ్రికా ఖండంలో షికార్లు కొట్టాడు. అనుష్క బెంగళూరులో కుటుంబసభ్యులతో గడిపేసింది. కొన్ని దోష నివారణ పూజలు కూడా చేసుకుంది. మరోవైపు తమన్న, రానా తమ కొత్త సినిమాలతో బిజీ అయిపోయారు. ఇలా విడిపోయిన ఈ సభ్యులంతా ఇప్పుడు మరోసారి కలుస్తున్నారు. వచ్చేనెల 1 నుంచి బాహుబలి-2 సినిమా షూటింగ్ మళ్లీ మొదలుకాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రామోజీ ఫిలింసిటీలో దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్ వేశారు. ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన క్లయిమాక్స్ దృశ్యాల్ని చిత్రీకరించాలని భావిస్తున్నారు. ఇకపై ఏకథాటిగా సినిమా షూటింగ్ ఉంటుందని కూడా మేకర్స్ ప్రకటించారు. బాహుబలి-2 సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రమోషన్ ను ఈ ఏడాది దసరా నుంచి ప్రారంభిస్తారు. దసరా రోజున బాహుబలి-2 ఫస్ట్ లుక్ విడుదలవుతుంది.