సప్తగిరి కాదు…. లక్షలాది గిరి

కమెడియన్లకు కాలం కలిసొచ్చిందంటే వాళ్లను అడ్డుకోవడం ఎవరితరం కాదు. ఎందుకంటే… హీరోల్లా సినిమా అంత కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. సినిమాకు ఇన్ని కాల్షీట్లు కేటాయిస్తే సరిపోతుంది. మరీ ముఖ్యంగా సినిమా జయాపజయాలతో కూడా సంబంధం లేదు. అందుకే కమెడియన్ కు స్టార్ డమ్ వచ్చిందంటే నక్కతోక తొక్కినట్టే. ప్రస్తుతం స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మాత్రమే హాస్యనటుల్లో రెమ్యూనరేషన్ పరంగా నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. మిగతావాళ్లంతా బ్రహ్మితో పోలిస్తే చాలా తక్కువ తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే… బ్రహ్మి దరిదాపులకు కూడా వెళ్లే కమెడియన్ లేడు. సునీల్ ఈ సెగ్మెంట్ లో ఉండుంటే ఆ ఘనత సాధించేవాడేమో కానీ హీరో అయిపోయి, బ్రహ్మానందాన్ని బతికించాడు. ఇప్పుడు ఆ దిశగా దూసుకుపోతున్న ఒకే ఒక్క కమెడియన్ సప్తగిరి. అవును… వెన్నెల కిషోర్ ను కూడా దాటేశాడు సప్తగిరి. మొన్నటివరకు సినిమాకు 2లక్షల రూపాయలు మాత్రమే తీసుకునే సప్తగిరి, ఇప్పుడు ఏకంగా కాల్షీట్ కు లక్ష రూపాయలు తీసుకునే రేంజ్ కు ఎదిగాడు. గమ్మత్తేంటంటే… ప్రస్తుతం బ్రహ్మానందం కూడా కాల్షీట్ కు లక్ష రూపాయలే తీసుకుంటున్నాడు. కొన్ని భారీ సినిమాలకు మాత్రం, డిమాండ్ కు తగ్గట్టు 2లక్షల వరకు తీసుకుంటున్నాడు. చూస్తుంటే… భవిష్యత్తులో అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్ గా సప్తగిరి రికార్డు సృష్టిస్తాడేమో చూడాలి.