Telugu Global
Family

ప్రతీకారం

పూర్వం ఒక గ్రామంలో నలుగురు అన్నదమ్ములుండేవాళ్ళు. వాళ్ళకు ఒక్కగానొక్క చెల్లెలు. ఆ అమ్మాయిని వాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్ళు. తమలో తాము ఎన్ని గొడవలు పడినా చెల్లెల్ని కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు. వాళ్ళకు పెళ్ళిళ్ళయ్యాయి. భార్యలు వచ్చారు. మొదట్లో భార్యలు తమ మరదల్ని బాగా చూసుకునేవారు. కానీ తమకన్నా ఎక్కువగా తమ భర్తలు వాళ్ళ చెల్లెలు పట్ల ప్రేమ కనబరచడంతో వాళ్ళల్లో ఈర్ష్య పెరిగింది. క్రమంగా ఆ ఈర్ష్య ద్వేషంగా మారింది. అవకాశం వస్తే ఆ […]

పూర్వం ఒక గ్రామంలో నలుగురు అన్నదమ్ములుండేవాళ్ళు. వాళ్ళకు ఒక్కగానొక్క చెల్లెలు. ఆ అమ్మాయిని వాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్ళు. తమలో తాము ఎన్ని గొడవలు పడినా చెల్లెల్ని కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు. వాళ్ళకు పెళ్ళిళ్ళయ్యాయి. భార్యలు వచ్చారు. మొదట్లో భార్యలు తమ మరదల్ని బాగా చూసుకునేవారు. కానీ తమకన్నా ఎక్కువగా తమ భర్తలు వాళ్ళ చెల్లెలు పట్ల ప్రేమ కనబరచడంతో వాళ్ళల్లో ఈర్ష్య పెరిగింది. క్రమంగా ఆ ఈర్ష్య ద్వేషంగా మారింది. అవకాశం వస్తే ఆ అమ్మాయిని బాధపెట్టాలని చూసేవాళ్ళు.

అన్నలు పనికి వెళ్లినపుడు, వేరేవూరు వెళ్ళినప్పుడు వదినలు ఆ అమ్మాయిని సతాయించేవాళ్ళు. ఒకావిడ బట్టలు ఉతకమనేది. ఇంకోకావిడ వంటచెయ్యమనేది, మరోకావిడ ఇల్లలకమనేది. కానీ ఆ అమ్మాయి అవేవీ అన్నలతో చెప్పేది కాదు.

వాళ్ళు కూడా తమ భర్తలు ఇంటికి వస్తూనే ప్రవర్తనలో మార్పుని ప్రదర్శించే వాళ్ళు. మరదలి పట్ల ప్రేమ కురిపించేవాళ్ళు. ఇట్లా కాలం గడిచేకొద్దీ వాళ్ళు మరదలి మీద కసిపెంచుకున్నారు. ఓసారి అన్నలు నాలుగురోజులు పొరుగూరికి పనులమీద వెళ్ళారు. వదినలకు మంచి అవకాశం దొరికింది. మరదలు కష్టాలు మొదలయ్యాయి.

పెద్ద వదిన ఒకరోజు పిలిచి ‘ఇదిగో! మొన్న ఎపుడో మీ అన్న ఉంగరం ఈ గడ్డివాములో పడిపోయిది. వెతికిపెట్టు’ అంది. ఆ అమ్మాయి అంతపెద్ద గడ్డివాము చూసి ఏం చెయ్యాలో తెలీక భళ్ళున ఏడ్చింది. కన్నీళ్లు కార్చింది. అంతలో కాళ్ళ దగ్గర ఏదో కదిలితే చూసింది. ఒక చిట్టెలుక ఆ అమ్మాయిని చూసి నవ్వింది. ఉండు అని సంజ్ఞ చేసి గడ్డి వాములో దూరి ఐదు నిముషాల్లో ఉంగరం తెచ్చి ఇచ్చింది.

ఆ అమ్మాయి పెద్దవదినకు ఉంగరమిచ్చింది.

ఆమె ఆశ్చర్యపోయింది.

మరుసటిరోజు వదినలు మరో ప్లాను వేశారు.

పొలంనించీ తెచ్చిన వడ్లు కుప్పగా వేశారు. వాటిల్లో మంచివడ్లను వేరుగా, పొల్లుపోయిన వాటిని వేరుగా చేయమని పసిపిల్లకు పనిచెప్పారు. దాదాపు పది బస్తాల ధాన్యాన్ని ఎలా వేరు చెయ్యడం. ఎప్పటిలా ఆ అమ్మాయి జలజలా కన్నీరు కార్చింది.

అంతలో పెద్ద పిచ్చుకల గుంపు ఆకాశం నించీ వచ్చి వడ్లగింజల కుప్పపై వాలింది. అవి వడ్లగింజల్ని తింటున్నాయని ఆ అమ్మాయి అనుకుంది. కానీ కాసేపటికి మంచి వడ్లను, పొల్లుగింజల్ని వేరు చేసి అవి వెళ్ళిపోయాయి. వదినలకు ఈ అద్భుతాలు ఎలా జరుగుతున్నాయో అంతుబట్టలేదు. మూడవరోజు ఏ ఆలోచనా తోచకపోవడంతో ఆ అమ్మాయికి విశ్రాంతి దొరికింది.

నాలుగోరోజు వదినలు ఆ అమ్మాయిని పిలిచి ఒక గిన్నెనిచ్చి ‘వెళ్ళి పక్కగ్రామంలో ఒక వైద్యుడుంటాడు. ఆయన్ని అడిగి వనమూలికల రసం మేము అడిగామని చెప్పు అది తీసుకురా. సాయంత్రం కల్లా వచ్చేయి’ అన్నారు. ఆమె అన్నలు సాయంత్రానికి ఇంటికి రావచ్చని వదినలు అంచనా వేశారు.

ఆ అమ్మాయి పాత్ర తీసుకుని అడవిలోకి అడుగుపెట్టిన వెంటనే చెట్ల నించీ వనమూలికలు వచ్చి దాని నిండుగా రసం నింపాయి. వెంటనే ఆమె వెనుదిరిగింది. అప్పుడు అడవిమార్గం గుండా వచ్చిన అన్నలు ఆమెకు ఎదురుపడ్డారు.

అన్నలు చెల్లెల్ని చూసి ఆశ్చర్యపడ్డారు. పువ్వులాంటి తమ చెల్లెలు ఇంత పెద్ద అడవిలో కనిపించడం వాళ్ళకు ఆగ్రహం తెప్పించింది. తమ భార్యల మీద వాళ్ళకు సందేహం కలిగింది. ‘అమ్మా! నువ్వు ఎందుకు ఈ అడవిలో ఉన్నావు?’ అన్నారు. ఆ అమ్మాయి ‘అన్నలూ! మన వదినలు కంటినొప్పితో బాధపడుతున్నారు. పక్కగ్రామం వెళ్ళి వైద్యుణ్ణి అడిగి వనమూలికల రసం తీసుకురమ్మని పంపారు’ అంది. అందరూ కలిసి ఇంటికి వచ్చారు.

అన్నలతో కలిసివచ్చిన చెల్లెల్ని చూసి ఆమె వాళ్ళకు అన్నీ చెప్పేసి ఉంటుందని అనుమానపడ్డారు. కానీ భర్తలు భార్యల్ని చూసి మీకు కంటినొప్పి ఉందని, పసరు తీసుకురమ్మన్నారని చెల్లెలు చెప్పింది అన్నారు. దాంతో వదినలు నిట్టూర్చారు.

అన్నలు తమ భార్యల కళ్లల్లో వనమూలికల రసం పోశారు. దాంతో బాగవడం కన్నా కంటినొప్పులు క్రమంగా పెరిగాయి. మసకబారాయి. కొన్నాళ్ళకు వాళ్ళు చూపు కోల్పోయారు. దాంతో పుట్టిళ్ళకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడూ వాళ్ళు తిరిగి రాలేదు. అన్నలు చెల్లెలితో ఆనందంగా జీవించారు.

– సౌభాగ్య

First Published:  31 May 2016 1:02 PM GMT
Next Story