Telugu Global
Family

అమాయకత్వం

స్వాములనే వాళ్లు, గురువులనే వాళ్లు మనిషిలో అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని నిలిపిఉంచడానికే ప్రయత్నిస్తారు. వాళ్లు చెప్పింది వింటూ,వాళ్లు చెయ్యమన్నది చేస్తూ ఉంటేనే వాళ్ళ పనులు జరుగుతాయి. ఎవరయినా సందేహిస్తే, ప్రశ్నిస్తే వాళ్ల బండారం బయట పడుతుంది. వాళ్లకు కావలసిందల్లా జనం వాళ్లు చెప్పినట్లు వినాలి.రాజకీయ నాయకులయినా అంతే. వాళ్ళకు అనుచరులు కావాలి. స్వాములయినా అంతే. వాళ్లకు శిష్యులు కావాలి. అంతా గురువులకే తెలుసు అని సామాన్యజనం అనుకోవాలి. అంతే కానీ తమకెంత తెలుసో గురువులకూ అంతే తెలుసునని జనం […]

స్వాములనే వాళ్లు, గురువులనే వాళ్లు మనిషిలో అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని నిలిపిఉంచడానికే ప్రయత్నిస్తారు. వాళ్లు చెప్పింది వింటూ,వాళ్లు చెయ్యమన్నది చేస్తూ ఉంటేనే వాళ్ళ పనులు జరుగుతాయి. ఎవరయినా సందేహిస్తే, ప్రశ్నిస్తే వాళ్ల బండారం బయట పడుతుంది. వాళ్లకు కావలసిందల్లా జనం వాళ్లు చెప్పినట్లు వినాలి.రాజకీయ నాయకులయినా అంతే. వాళ్ళకు అనుచరులు కావాలి. స్వాములయినా అంతే. వాళ్లకు శిష్యులు కావాలి. అంతా గురువులకే తెలుసు అని సామాన్యజనం అనుకోవాలి. అంతే కానీ తమకెంత తెలుసో గురువులకూ అంతే తెలుసునని జనం తెలుసుకుంటే గురువుల ప్రత్యేకత ఉండదు. వాళ్ళు జనంపై అజమాయిషీ చెయ్యలేరు. జనానికి సలహాలివ్వలేరు.

సలహాలు తీసుకోవడానికి సాధారణ జనం ఇష్టపడతారు. స్వతంత్రంగా ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు. అది శ్రమతో కూడుకున్న సంగతి. పరిస్థితుల్ని సూటిగా, సరాసరి ఎదుర్కోవాలి. ఒక గ్రామంలో ఉన్న జనం అమాయకులు. వాళ్లు ఎవరు ఏది చెబితే అది నమ్మేవాళ్లు. పైగా వాళ్లకు దేవుడంటే ఎంతో భక్తి. నిత్యం పూజలు,భజనలు చేసేవాళ్లు. ఎందరో వచ్చి వాళ్ళకు బోధనలు చేసేవాళ్లు. గ్రామస్థులు వాళ్లను సత్కరించి, గౌరవించి పంపేవాళ్లు. స్వాములు మోసగాళ్లని, తమని వంచిస్తున్నారని, ఆ కపటం లేని గ్రామ ప్రజలు ఎప్పుడూ అనుకోలేదు. ఆ గ్రామం ముందు ఒక దేవుని విగ్రహం ఉండేది. అది వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ ఉండేది. పూర్వకాలంలో అక్కడ గుడి ఉండేది. అది కూలిపోయి విగ్రహం ఒకటే మిగిలింది. పూజాపునస్కారాలు లేకుండా పడి ఉండేది. ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. ఒక రోజు ఆదారంటే వస్తున్న ఒక గురువు ఆ విగ్రహాన్ని చూశాడు. పూజకు నోచుకోకుండా దుమ్ము పట్టిన ఆ విగ్రహాన్ని చూసి అతను కదిలిపోయాడు. వెంటనే గ్రామంలోకి వెళ్ళి గ్రామస్థుల్ని ఒక దగ్గరకు చేర్చి ”మీ గ్రామం ముందు ఒక దేవుని విగ్రహం ఉంది. ఎప్పుడయినా చూశారా? ఎవరూ పట్టించుకోకుండా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంది. ఇది అపచారం. మీరు వెంటనే ఆ విగ్రహం చుట్టూ కర్రలు నాటి, పందిరి వేసి, రక్షణ కల్పించండి. మీకు పుణ్యం వస్తుంది. ఆ పందిరి కిందనే నేను బోధనలు చేస్తాను. మీరు భజనలు చేయండి. ఈ సత్కారాన్ని ఇప్పుడే మొదలుపెట్టి పుణ్యం కట్టుకోండి.” అన్నాడు.

వెంటనే గ్రామ ప్రజలు ఆ విగ్రహం చుట్టూ శుభ్రం చేసి గుంజలు నాటి పందిరి వేశారు. ఆరోజునుంచి అక్కడే భజనలు మొదలుపెట్టారు. ఆ గురువు ఆ గ్రామం వదిలి మరో చోటకు వెళ్లిపోయాడు. కొంతకాలానికి మరో సన్యాసి ఆ గ్రామానికి వచ్చాడు. విగ్రహం చుట్టూ గుంజలు,పందిరి చూసి విస్తుపోయాడు. గ్రామస్థుల్ని చూసి”అయ్యా! మీరు చేస్తున్న దేమి? విగ్రహం చుట్టూ గుంజలు నాటి పందిరి వేశారు. పగలు మీరు ఇక్కడ భజనలు చేసినా రాత్రిళ్లు మీ ఇళ్లకు మీరు వెళ్లిపోతారు. ఇది వేసవి కాలం. ఏ క్షణాన్నయినా ప్రమాదవశాత్తు ఒక నిప్పురవ్వ పడినా ఈ పందిరి క్షణంలో దగ్థమయిపోతుంది. అప్పుడు విగ్రహం కూడా మాడి మసి అవుతుంది. వెంటనే ఈ గుంజలు పీకి,పందిరిపీకి, ఈ విగ్రహానికి రక్షణ కల్పించండి” అన్నాడు.

వెంటనే గ్రామస్తులంతా ఆ గుంజలు పీకి, పందిరిపీకి, విగ్రహానికి గాలీ,ఎండా సోకేలా చేశారు. ఆ సన్యాసి తన దారంటీ తను వెళ్లాడు. అంతలో మరో గురువు గ్రామానికి వచ్చాడు. ఆ సంగతి తెలిసి గ్రామ ప్రజలంతా తలుపులు బిడాయించుకుని ఇళ్ళలో

ఉండిపోయారు. కారణం ఈ గురువు ఏమి చెబుతాడో అని వాళ్ళ భయం!

– సౌభాగ్య

First Published:  2 Jun 2016 1:01 PM GMT
Next Story