Telugu Global
Family

భక్తి బేరం

నేనొక ఊరికి వెళ్ళాను. ఆ ఊరి మధ్య ఒక మందిరం ఉంది. ఆ ఊరి జనం ధర్మాత్ములుగా పేరుపొందినవాళ్ళు. అందుకనే చూడ్డానికి వెళ్ళాను. జనం సాయంత్రం కల్లా గుడికి చేరేవాళ్లు. భజనలు, ప్రార్థనలు మొదలయ్యేవి. శక్తికొద్దీ దేవుణ్ణి ప్రార్థించి, కీర్తించి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లేవాళ్లు. వాళ్లను పరిశీలించాను. వాళ్ల ప్రవర్తనకు , ప్రార్థనకూ ఏమీ సంబంధం లేదన్న సంగతి తెలిసి వచ్చింది. అనుదిన జీవితంలో అందరూ నిర్దయగా ఉండేవాళ్లు. ప్రార్థన నించీ వాళ్లు ఏమీ నేర్చుకున్నట్లు కనిపించలేదు. […]

నేనొక ఊరికి వెళ్ళాను. ఆ ఊరి మధ్య ఒక మందిరం ఉంది. ఆ ఊరి జనం ధర్మాత్ములుగా పేరుపొందినవాళ్ళు. అందుకనే చూడ్డానికి వెళ్ళాను. జనం సాయంత్రం కల్లా గుడికి చేరేవాళ్లు. భజనలు, ప్రార్థనలు మొదలయ్యేవి. శక్తికొద్దీ దేవుణ్ణి ప్రార్థించి, కీర్తించి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లేవాళ్లు. వాళ్లను పరిశీలించాను. వాళ్ల ప్రవర్తనకు , ప్రార్థనకూ ఏమీ సంబంధం లేదన్న సంగతి తెలిసి వచ్చింది. అనుదిన జీవితంలో అందరూ నిర్దయగా ఉండేవాళ్లు. ప్రార్థన నించీ వాళ్లు ఏమీ నేర్చుకున్నట్లు కనిపించలేదు. భక్తి భక్తే. బతుకు బతుకే. ఒకదాని ప్రభావం ఇంకోదానిమీద కనిపించదు. ధర్మమన్నది జీవితంలోకి అడుగు పెట్టడం కనిపించలేదు.

చివరికి తెలిసిందేమిటంటే అందరివీ అధర్మ జీవితాలే. పైకి మాత్రం సన్మార్గులుగా, భక్తులుగా కనిపిస్తున్నారు. తమ అధర్మాన్ని, తమలోపలి కపటాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్లు భక్తి అనే ముసుగును కప్పుకున్నారు. అది వాళ్లకెంతో అనుకూలంగా ఉంది. ఆలయాలు, పూజాగృహాలు వాళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అట్లా అని వాళ్లకు దైవంమీద ప్రేమ ఉందా? అంటే అదీ లేదు. ప్రేమ ఉన్నప్పుడు కోరికలుండవు. వాళ్లు భగవంతుణ్ణి ప్రార్థించినా ఆ ప్రార్థన ఐహిక సుఖాల్లో భాగంగానే ఉంది. ప్రార్థన అంటే ప్రేమ,త్యాగం,కృతజ్ఞత. ఆ లక్షణాలు వాళ్లలో అణుమాత్రం లేవు. వాళ్లని చూసి నాకో కథ గుర్తుకు వచ్చింది. ఒక హంతకుడికి ఉరిశిక్ష పడింది. నెల తరువాత అతన్ని ఉరి తీస్తారు. అంతవరకూ అతన్ని జైల్లో పెట్టారు. ఉరిశిక్ష విధింపబడినట్లు తెలుస్తూనే ఆ హంతకుడిలో అపూర్వ పరివర్తన కలిగింది.

అతనిలోని దుర్మార్గ ప్రవర్తన హఠాత్తుగా అదృశ్యమయిపోయింది. శాంతిమూర్తిగా మారిపోయాడు. ఉదయాన్నే లేచి పరిశుభ్రంగా తయారై, ప్రసన్నవదనంతో తోటి ఖైదీలకు, జైలు అధికారులకు అభివాదం చేసి భగవన్నామ స్మరణ మొదలుపెట్టేవాడు. రామనామ సంకీర్తనతో చెరసాల నిండిపోయేది. గొప్పగొప్ప తత్వగీతాలు ఆలపించేవాడు. అతని నిరంతర చింతన దైవమే అయిపోయింది. గొప్ప ప్రేమమూర్తిగా మారిపోయాడు. తోటి ఖైదీలతో ఎంతో దయగా ప్రవర్తించేవాడు.

ఉదయం మొదలు అతను ప్రార్థన చేస్తూ ఉంటే మెల్లగా తోటి ఖైదీలందరూ అతని దగ్గరకు వచ్చి అతని పక్కన కూచునేవారు.వాళ్లుకూడా ప్రార్థన అందుకునేవాళ్లు. వాళ్లు కూడా భక్తులుగా మారిపోయారు. నిత్య భజనలతో చెరసాల ఆలయ మయిపోయింది. అంత గొప్ప హంతకుడు ఇంత గొప్ప భక్తుడిగా మారిపోవడం చూసి జైలు అధికారి కదిలిపోయాడు. అతను కూడా హంతకుడి శిష్యుడయిపోయాడు.

అతను కూడా ఖైదీలతో బాటు కూర్చుని భజనలు చేసేవాడు. ఆ హంతకుడిలో వచ్చిన పరివర్తనపై అధికారులకు కూడా తెలిసింది. చెరసాలలు పరివర్తన శాలలుగా మారడం వాళ్లకు పరమానందం కలిగింది. జైలు అధికారి ఉదయాన్నే హంతకుడికి అభివాదం చేసి తన కార్యక్రమాలు ఆరంభించేవాడు. అతని అవసరాల్ని కనిపెట్టేవాడు. ఒకరోజు ఉదయం అంతా నిశ్శబ్ధంగా ఉంది. జైలు అధికారి ” ఎందుకు ఇంకా అతను నిద్రలేచి ప్రార్థన ప్రారంభించలేదు” అని ఖైదీల్ని అడిగాడు. ఖైదీలు అతనింకా నిద్ర లేవలేదన్నారు. జైలు అధికారి బహుశాన ప్రార్థనలతో రాత్రి అలసిపోయాడనుకుని వెళ్లాడు. ఖైదీలు హంతకుడితో ”ఎందుకింకా మీరు ఈరోజు ప్రార్థన ఆరంభించలేదు?” అని అడిగారు. దానికి హంతకుడు ‘నాభక్తి బేరం కుదిరింది. నాలో మార్పు చూసి పై అధికారులు నా ఉరిశిక్ష రద్దు చేసి దాన్ని ఏడు సంవత్సరాల జైలు శిక్షగా మార్చారు. అనుకున్న పని పూర్తయింది. దేవుణ్ణి ఇంకా నేను ఇబ్బందిపెట్టదలచుకోలేదు” అన్నాడు.

-సౌభాగ్య

First Published:  2 Jun 2016 1:01 PM GMT
Next Story