Telugu Global
Family

స్వర్గ ప్రవేశం

స్వర్గద్వారం దగ్గర చాలా రద్దీగా ఉంది. తాను ముందు వెళ్లాలంటే తాను ముందని ఒకర్నొకరు తోసుకుంటున్నారు. స్వర్గద్వారాలు మూసే ఉన్నాయి. ద్వారపాలకులు అందర్నీ అరవద్దని చెబుతున్నారు. ఎవరి అర్హతల్ని బట్టి వాళ్లు అర్హులో కాదో నిర్ణయించి మాత్రమే స్వర్గంలోకి అనుమతిస్తామని తక్కినవాళ్లకు ప్రవేశం దొరకదని వాళ్ళన్నారు. అంతలో అందర్లో సకలశాస్త్ర పారంగతులయిన పండితుల గుంపుముందుకు వచ్చింది. ”మేము సత్సంప్రదాయంలో జీవించిన వాళ్లం. సమస్త వేదవేదాంగ జ్ఞాన సంపన్నులం. అందువల్ల మొదట మాకే స్వర్గప్రవేశార్హత ఉంది. ఈ జనాన్నంతా […]

స్వర్గద్వారం దగ్గర చాలా రద్దీగా ఉంది. తాను ముందు వెళ్లాలంటే తాను ముందని ఒకర్నొకరు తోసుకుంటున్నారు. స్వర్గద్వారాలు మూసే ఉన్నాయి. ద్వారపాలకులు అందర్నీ అరవద్దని చెబుతున్నారు. ఎవరి అర్హతల్ని బట్టి వాళ్లు అర్హులో కాదో నిర్ణయించి మాత్రమే స్వర్గంలోకి అనుమతిస్తామని తక్కినవాళ్లకు ప్రవేశం దొరకదని వాళ్ళన్నారు. అంతలో అందర్లో సకలశాస్త్ర పారంగతులయిన పండితుల గుంపుముందుకు వచ్చింది. ”మేము సత్సంప్రదాయంలో జీవించిన వాళ్లం. సమస్త వేదవేదాంగ జ్ఞాన సంపన్నులం. అందువల్ల మొదట మాకే స్వర్గప్రవేశార్హత ఉంది. ఈ జనాన్నంతా వెనక్కి నెట్టి మొదట మిమ్మల్ని స్వర్గంలోకి పంపండి” అన్నారు.

ద్వారపాలకులు ”అయ్యా! సకల శాస్త్రాలూ అభ్యసించినంత మాత్రాన స్వర్గానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే స్వర్గ ప్రవేశానికి జ్ఞానం పనికిరాదు. అది ప్రపంచానికి పనికొస్తుందేమో కానీ ఇక్కడ పనికిరాదు” అన్నారు. అంతలో ఒక సన్యాసి ముందుకు వచ్చి ”ఇక్కడ

ఉన్నవాళ్లలో స్వర్గంలో ప్రవేశించడానికి నాకంటే అర్హత ఉన్న వ్యక్తి ఇంకెవరూ లేరు. ఎందుకంటే నేను సర్వసంగపరిత్యాగిని. నిత్య దేవధ్యానంలో ఉపవాసదీక్షతో నా జీవితాన్ని పునీతం చేసుకున్నాను. పైగా ఇటీవలి కాలంలో నన్నుమించిన తపో సంపన్నుడు ఎవడూ లేడు” అన్నాడు. దానికి ద్వారపాలకులు ”అయ్యా! అంతా బాగానే ఉంది. కానీ మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి తపస్సు చేశారు. ఏదయినా ఫలితాన్ని ఆశించి తపస్సు చేస్తే అది తపస్సు కాదు. స్వార్థమవుతుంది” అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు. ”దేశ సేవలో మమ్మల్ని మించిన వాళ్లు లేరు. ప్రజల కష్ట సుఖాల్ని పట్టించుకున్నాం. ప్రజాసేవలో మా జీవితం తరించింది” అన్నారు. ద్వారపాలకులు ”ప్రజలకు సేవ చేయడం మంచిదే. అది అధికారం కోసం పొగడ్తలు కోసం చేస్తే అర్థం లేనిది. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా మీరు ప్రజాసేవ చేశారా?” అన్నారు.

ఇట్లా జనం ఒకర్నొకరు తోసుకుంటూ తామే ముందుగా స్వర్గంలోకి వెళ్ళాలని తన్నుకుంటూ, తోసుకుంటూ ఉన్నారు. అందరికీ వెనుక అనవసరంగా ఇక్కడికి వచ్చానేమో అనుకుంటూ పశ్చాత్తాపపడుతున్నట్లు ఒక వ్యక్తి ఉండడాన్ని ద్వారపాలకులు చూశారు. అందర్నీ పక్కకు జరగమని చెప్పి ఆ వ్యక్తిని ముందుకు పిలిచారు. ‘ నీ అర్హతలేమిటి?’ అని అడిగారు. ఆ వ్యక్తి చేతులు జోడించి ” అయ్యా! పొరపాటున నేను ఇక్కడికి వచ్చినట్లున్నాను. ఇక్కడికి రావడానికి నాకు ఏ అర్హతలు లేవు. ఎందుకంటే నాకు ఎట్లాంటి శాస్త్రజ్ఞానమూ లేదు. నేను ఎట్లాంటి ప్రజాసేవ చెయ్యలేదు. ఎట్లాంటి సంఘసంస్కరణలు చెయ్యలేదు. నేను సన్యాసిని కాను. ఎట్లాంటి తపస్సు చెయ్యలేదు. దాన్ని గురించి నాకు ఏమీ తెలీదు. పైగా దాన ధర్మాలు చెయ్యడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను పేదవాణ్ణి. నాదగ్గర ప్రేమ మాత్రమే

ఉంది. ఇక్కడి పరిస్థితిని చూస్తే ప్రేమకు స్వర్గంలో స్థానం లేదని తెలుస్తోంది. దయచేసి నరకానికి వెళ్లేదారి ఏదో చూపిస్తే వెళతాను. నాకా ఉపకారం చెయ్యండి” అన్నాడు.

ఆ మాటలతో ద్వారపాలకులు ఎంతో ఆనందించారు. ”అయ్యా! ఇక్కడ ఇంతమంది పడిగాపులు కాస్తున్నారు. కానీ ఇంతమందిలో ఒక్కరికీ స్వర్గంలో ప్రవేశించే అర్హత లేదు. స్వర్గంలో అడుగుపెట్టడానికి అర్హత ఉన్న వ్యక్తి మీరొక్కరే. స్వార్థం లేని వ్యక్తి మీరు ఒక్కరే” అని అతన్ని సగౌరవంగా స్వర్గద్వారాలు తెరిచి లోపలికి ఆహ్వానించారు.

-సౌభాగ్య

First Published:  2 Jun 2016 1:01 PM GMT
Next Story