తెలివయిన వ్యాపారి

ఆ వ్యాపారి నగరంలో ప్రముఖుడు వాణిజ్య వేత్తలందర్లో ముందు వరుసలోని వాడు. రాజప్రముఖుల్లో ఒకడు. రాజు ఎన్నో సందర్భాల్లో అతని సలహాలు తీసుకునేవాడు. నిజానికి ఆ వ్యాపారి యువకుడు అతని చురుకుదనం వల్ల, తెలివి తేటల వల్ల గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ వ్యాపారికి పెళ్ళయింది. అంగరంగ వైభోగంగా జరిగింది. పెళ్ళయిన నాటి నించీ అతని భార్య అతన్ని గమనించింది. ఉదయం వెళ్ళిపోయేవాడు. చీకటిపడ్డాక యింటికి చేరేవాడు. కొన్నిమార్లు అర్థరాత్రి దాటిన తరువాత యిల్లు చేరేవాడు. ఒకరోజు భార్య నిలదీసి అడిగింది. వ్యాపారి నవ్వుతూ మనయింట్లో కావలసినంత మంది పనివాళ్ళున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా వాహనాలు సిద్ధం. వైభోగంలో నువ్వు రాణితో సమానమైనదానివి. నా పరిస్థితి ‘నేను’ ఉదయమే వెళ్ళి వ్యాపార విషయాలు చూడాలి. ఎందరో నా సలహాలకోసం వస్తారు, వాళ్ళతో గడపాలి. ఎన్నో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. ఒకో సారి రాజు పిలిపిస్తాడు, అందువల్ల అందరిలాగా సాయంత్రానికి యిల్లు చేరాలంటే నా వల్ల కాదు,పరిస్థితిని అర్థం చేసుకో అని సర్ది చెప్పాడు.

ఒకరోజు అన్ని పనులూ ముగించుకుని బయల్దేరేసరికి అర్థరాత్రి దాటింది. మిత్రుడొకడు చీకటిగా వుంది. దొంగల బెడద వుంటుంది. నా గుర్రం తీసుకెళ్ళు, అన్నాడు. వ్యాపారి గుర్రం పై యింటికి బయలు దేరాడు. ఒక చీకటి మార్గం గుండా వస్తూ వుంటే ఎదురుగా ఎవరో తూలుతూ వస్తున్నారు, బహుశా దొంగ అనుకున్నాడు. గుర్రం వేగం పెంచి మనిషి దగ్గర రాగానే బలంగా అతని తలపై ఒక దెబ్బవేసి ముందుకు సాగాడు. వ్యక్తి ధబ్‌మని కింద పడ్డారు. కొంత దూరం వెళ్ళాకా ఆ మనిషి ఏమయ్యాడో చూద్దామనిపించి వెనక్కి వచ్చాడు. వచ్చి చూస్తే అతను లేవకుండా పడివున్నాడు. గుర్రం దిగి చూశాడు. అతను యువరాజు గుండె ఆగినంత పనయింది.

రాజుకు ఈ సంగతి తెలిస్తే తనకు శిరచ్ఛేదమే అనుకున్నాడు. యువరాజు తాగుబోతు సమీపంలోని మధుశాలకు రోజూ వచ్చేవాడు. విపరీతంగా తాగడం వల్ల తనుకొట్టిన దెబ్బకు నేలమీద పడిన వెంటనే గుండాగి చనిపోయాడని నిర్థారించుకున్నాడు. ఆలోచనలో పడ్డాడు. ఈ ప్రమాదం నించీ తప్పించుకోవడానికి ప్రణాళిక వేశాడు.

యువరాజు తాగుబోతు నిత్యం మధుశాలకు వస్తాడు. కాబట్టి అతను విపరీతంగా మద్యం సేవించి చనిపోయాడని అందరూ అనుకుంటారు. అట్లాంటి అభిప్రాయం అందరికీ కలిగేలా ఏదో చేయాలి, అని ఆలోచించాడు.

యువరాజు శరీరాన్ని మోసుకుని దగ్గరగా వున్న మధుశాల దగ్గరకు వెళితే, తలుపులు మూసివున్నాయి. కానీ లోపల సందడిగా వుంది. మెల్లగా శరీరాన్ని నిలబెట్టి తలుపుకు ఆనించి వెళ్ళి యింట్లో పడుకున్నాడు. ఆందోళనతో పర్యవసానాన్ని వూహిస్తూ మేలుకున్నాడు.

అంతలో వున్నట్లుంటి ఎవరో తలుపు తట్టారు. భయంతో లేచి తలుపు తెరిచి చూస్తే ఎదురుగా మథుశాల యజమాని. కొంపదీసి తను చేసిన పని అతని కంటపడలేదుకదా! అనుకున్నాడు మధుశాల యజమాని , అయ్యా! మీరే నన్ను రక్షించాలి. యువరాజు విపరీత మధుసేవనం వల్ల బయటికి తూలుతూ వెళ్ళి మళ్ళీ మూసిన తలుపుకు ఆనుకుని కన్ను మూశాడు. మీరు ఆలోచనాపరులు. ఈ వెయ్యిరూకలు తీసుకుని మీరే ఏదో మార్గం చూపాలి, అన్నాడు.

వ్యాపారి వూపిరి పీల్చుకుని సరే నువ్వువెళ్ళు.నేను మార్గం వెతుకుతాను, అన్నాడు.

దగ్గర్లోనే మంత్రి గారి యిల్లు వుంది. అతను రాజు పై కుట్రలు పన్నడం వ్యాపారికి తెలుసు. అతనే యువరాజును చంపాడని రాజు సులభంగా నమ్ముతాడు. అని భావించి శవాన్ని భుజాన వేసుకుని మంత్రి యింటికి వెళ్ళి శవాన్ని మంత్రి యింటి తలుపుకు ఆనించి వచ్చాడు. మంత్రికి నిద్రపట్టక ఆరుబయటికి వద్దామని తలుపు తీస్తే శవం మీదపడింది. మంత్రి అదిరిపోయాడు. అసలే రాజుకు తన పై కొంత సందేహం. ఈ విషయం తెలిస్తే తనతల తీయడం ఖాయం అనుకున్నాడు.

నగరంలో వ్యాపారిని మించిన తెలివి తేటలు ఎవరికీ లేవు. తలుపు తట్టేసరికి పడుకుందామన్న వ్యాపారి లేచాడు. చూస్తే మంత్రి పరిస్థితి వివరించి, నన్ను రక్షించడానికి మీరే సమర్థులు ఈ ఐదువేల రూకలు తీసుకుని నన్నీ ఆపద నుండి గట్టెక్కించండి అని ప్రాధేయపడ్డాడు. వ్యాపారి సరేనన్నాడు.

యువరాజు శవాన్ని అంతఃపురం వేపు తీసుకుపోయాడు. తెలతెల వారుతున్నా అంతకుముందు రోజు ఉత్సవం కావడం వల్ల అందరూ నిద్రలో వున్నారు. రాజుగారి గది తలుపులకు శవాన్ని అనించి వచ్చేశాడు.

తెల్లవారింది. సైనికులు వచ్చి రాజుగారు రమ్మంటున్నారని చెప్పారు. వ్యాపారి రాజుగారి ముందు హాజరయ్యాడు. రాజు రాణి కన్నీళ్ళు పర్యంతంగా విషాదంగా వున్నారు. రాజు చివరికి వీడు యిలా తాగితాగి జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ఈ విషయం తెలిస్తే పొరుగు రాజ్యం వాళ్ళు మనమీద దండెత్తే వీలుంది.ఈ క్లిష్ట సమయంలో నీ సలహా అవసరం అన్నాడు.

వ్యాపారి రాజా! యువరాజును పాము కరిచిందని విషవైద్యులు సేవ చేస్తున్నారని ప్రచారం చేయండి. ఈ వార్త అందరికీ తెలిసేలా ప్రకటించండి. శత్రుసన్నాహాలు సన్నబడతాయి. ఆలోగా మనం అప్రమత్తం కావచ్చు. మెల్లగా అసలు సంగతి తరువాత బయట పెట్టవచ్చు అన్నాడు.

అతని సలహాకు రాజు ఎంతో సంతోషించి పదివేల రూకలు ఇచ్చాడు.

అట్లా తను సృష్టించుకున్న సమస్య నించీ వ్యాపారి తెలివిగా బయట పడ్డాడు.

– సౌభాగ్య