Telugu Global
WOMEN

ఆమెకు న‌ట్ ఎల‌ర్జీ...అత‌ని ముద్దు ప్రాణం తీసింది!

తీవ్ర‌మైన న‌ట్ ఎల‌ర్జీ ఉన్న ఇర‌వై ఏళ్ల అమ్మాయి, పీన‌ట్ బ‌ట్ట‌ర్ శాండ్ విచ్ తిన్న ప్రియుడు ముద్దు పెట్టుకోవ‌టంతో ప్రాణాల‌నే కోల్పోయింది. కెన‌డాకు చెందిన మిరియం డ్యూక్ర్-లీమే అనే ఆ అమ్మాయి 2012లో ప్రాణాలు కోల్పోగా ఆమె త‌ల్లి  మైఖెలిన్, ఈ విష‌యాన్ని ఇప్పుడు బ‌య‌ట‌పెట్టింది.  ఇలాంటి ప్ర‌మాదం ఉంటుంద‌ని ఇత‌రుల‌ను హెచ్చ‌రించ‌డానికే తాను ఇప్పుడు ఈ నిజాన్ని వెల్ల‌డిస్తున్నాన‌ని మైఖెలిన్ తెలిపింది. మిరియం డ్యూక్ర్…మ‌ర‌ణించ‌డానికి కొన్ని రోజుల ముందే త‌న కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమ‌లో […]

ఆమెకు న‌ట్ ఎల‌ర్జీ...అత‌ని ముద్దు ప్రాణం తీసింది!
X

తీవ్ర‌మైన న‌ట్ ఎల‌ర్జీ ఉన్న ఇర‌వై ఏళ్ల అమ్మాయి, పీన‌ట్ బ‌ట్ట‌ర్ శాండ్ విచ్ తిన్న ప్రియుడు ముద్దు పెట్టుకోవ‌టంతో ప్రాణాల‌నే కోల్పోయింది. కెన‌డాకు చెందిన మిరియం డ్యూక్ర్-లీమే అనే ఆ అమ్మాయి 2012లో ప్రాణాలు కోల్పోగా ఆమె త‌ల్లి మైఖెలిన్, ఈ విష‌యాన్ని ఇప్పుడు బ‌య‌ట‌పెట్టింది. ఇలాంటి ప్ర‌మాదం ఉంటుంద‌ని ఇత‌రుల‌ను హెచ్చ‌రించ‌డానికే తాను ఇప్పుడు ఈ నిజాన్ని వెల్ల‌డిస్తున్నాన‌ని మైఖెలిన్ తెలిపింది. మిరియం డ్యూక్ర్…మ‌ర‌ణించ‌డానికి కొన్ని రోజుల ముందే త‌న కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమ‌లో ప‌డింది. ఆ విష‌యం ఆమె త‌ల్లికి చెప్పింది. కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో సంతోషంగా ఉండ‌టం తాను గ‌మ‌నించిన‌ట్టుగా మైఖెలిన్ చెప్పింది.

అయితే మిరియంకి తీవ్ర‌మైన న‌ట్ ఎల‌ర్జీ ఉంది. ఆ విష‌యం ఆమె త‌న బాయ్ ప్రెండ్‌కి చెప్పేలోప‌లే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఆ రోజు రాత్రి మిరియం బాయ్ ఫ్రెండ్ ఆమెకు వీడ్కోలు చెబుతూ, ముద్దు పెట్టాడు. ఆ వెంట‌నే మిరియంకి ఊపిరి తీసుకోవ‌టం క‌ష్టంగా మారింది. ఎల‌ర్జీ తీవ్రంగా ఉన్న‌పుడు వాడే అడ్ర‌న‌లిన్ పెన్ (ఇంజ‌క్ష‌న్‌గా వాడే ఔష‌ధం) ద‌గ్గ‌ర లేక‌పోవ‌డంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతూ, త‌న బాయ్ ప్రెండ్‌ని న‌ట్స్‌తో కూడిన ఆహారం తిన్నావా అని ప్ర‌శ్నించింది. అత‌ను పీన‌ట్ బ‌ట్ట‌ర్ శాండ్‌విచ్ తిన్నాన‌ని చెప్ప‌టంతో, ఆమె త‌న‌కున్న ఎల‌ర్జీ సంగ‌తి చెప్పి త‌న‌ని వెంట‌నే ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా కోరింది.

ఎనిమిది నిముషాల్లోనే అంబులెన్స్ ఆమెని చేరినా, అప్ప‌టికే మిరియం ప‌రిస్థితి విష‌మించింది. అంబులెన్స్‌లోనే ఆమె గుండె విఫ‌ల‌మైంది. డాక్ట‌ర్లు తిరిగి గుండె కొట్టుకునేలా చేసినా, వెంట‌నే మెద‌డుకి ఆక్సిజ‌న్ అంద‌ని స్థితికి చేరి మిరియం ప్రాణాలు కోల్పోయింది. అనుమానాస్ప‌ద మ‌ర‌ణాల‌పై విచార‌ణ జ‌రిపే క‌రోన‌ర్ అధికారులు 2014లో మిరియం మృతికి కార‌ణ‌మైన నిజాన్ని… త‌మ నివేదిక‌లో వెల్ల‌డించారు. ఆ త‌రువాత ఇన్నాళ్ల‌కు ఆమె త‌ల్లి బ‌య‌ట‌కు వ‌చ్చి కెన‌డా వార్తాప‌త్రిక‌కు మొత్తం వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

ఎల‌ర్జీల‌ను క‌లిగించే ఆహారం… తిన్న వ్య‌క్తి లాలాజ‌లంలో నాలుగుగంట‌ల‌పాటు నిలిచి ఉంటుంద‌ని ఓ పిల్ల‌ల ఎల‌ర్జీల వైద్య నిపుణుడు… ఈ కేసు విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ వెల్ల‌డించారు. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా, ఎల‌ర్జీ ఉన్న‌వారు త‌క్ష‌ణ వైద్య స‌హాయ‌మందించే ఈపిపెన్‌ని అందుబాటులో ఉంచుకోవాల‌ని మిరియం త‌ల్లి విజ్ఞ‌ప్తి చేసింది. ముఖ్యంగా త‌మ‌తో ఉన్న‌వారికి త‌మకున్న ఎల‌ర్జీ గురించి ముందుగా చెప్పి ఉంచాల‌ని, అలా చెప్ప‌క‌పోవ‌టం వ‌ల్ల‌నే త‌న కుమార్తె ప్రాణాలు కోల్పోయింద‌ని ఆమె ఆవేద‌న చెందింది.

First Published:  9 Jun 2016 11:17 PM GMT
Next Story