మూడు కాంపౌండ్లనీ గుప్పెట్లో పెట్టుకున్న నితిన్

కేవలం హిట్ డైరక్టర్లతో సినిమాలు చేయడంలోనే కాదు…. పరిశ్రమలో ప్రముఖ కుటుంబాల్ని మచ్చిక చేసుకోవడంలో కూడా నితిన్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. త్రివిక్రమ్ తో సినిమా చేసినప్పుడే నితిన్ తెలివితేటలకు అంతా ఆశ్చర్యపోయారు. ఓవైపు అఖిల్ తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ కోసం నాగార్జున తెగ ప్రయత్నిస్తుంటే అదే టైమ్ లో… త్రివిక్రమ్ తో సినిమాను పక్కా చేయించుకున్నాడంటే నితిన్ లాబీయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదొక ఎత్తయితే… ఇప్పుడు పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్ని మచ్చికచేసుకునే కార్యక్రమం కూడా ప్రారంభించాడు నితిన్. 
ఇప్పటికే మెగా కాంపౌడ్ కు నితిన్ బాగా దగ్గరయ్యాడనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కు నితిన్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఏటా మామిడిపళ్లు కూడా పంపిస్తుంటాడు. ఆడియో ఫంక్షన్లకు, లొకేషన్లకు కూడా హాజరవుతుంటాడు. పవన్ తో పాటు చెర్రీ, బన్నీతో కూడా క్లోజ్ గా మూవ్ అవుతుంటాడు నితిన్. ఇక అక్కినేని ఫ్యామిలీ విషయానికొస్తే నితిన్-అఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరూ ఏ రేంజ్ ఫ్రెండ్స్ అంటే.. అఖిల్ తొలి సినిమాను నితినే నిర్మించాడు. ఏదైనా సినిమాకు కలిసే వెళ్తారు. అంత క్లోజ్ అన్నమాట. ఇప్పుడు తాజాగా నందమూరి కాంపౌండ్ లో కూడా అడుగుపెట్టాడు నితిన్. జనతా గ్యారేజీ సెట్స్ లోకి వెళ్లి మరీ ఎన్టీఆర్ ను కలిశాడు. తారక్ స్టెప్పులంటే పడి చస్తానంటూ స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నాడు. నితిన్ ఇలా అందర్నీ కలుపుకుంటూ పోవడానికి కారణం ఒకటే. భవిష్యత్తులో నితిన్ నుంచి ఓ సినిమా వచ్చిందంటే… అక్కినేని, నందమూరి, మెగా ఫ్యాన్స్ అంతా కలిసి చూసేలా ఉండాలి. ఏ ఒక్క వర్గం అతడికి దూరం కాకూడదు. అందుకే ఈ మాస్టర్ ప్లాన్.